Monday, April 29, 2024

జవాన్ల శవాలపైనే గత లోక్‌సభ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

ఓట్ల లబ్థికి ఎంతకైనా తెగించే బిజెపి
జెకె మాజీ గవర్నర్ మాలిక్ తీవ్ర విమర్శలు
పుల్వామా ఘటనపై ఇప్పటికీ ఇంతేసంగతులు
దర్యాప్తు జరిగి ఉంటే పలువురు జైలుకు
అదానీ వ్యాపారాల మూలం ప్రధానినే
రాజస్థాన్‌లో సత్యపాల్ ఆరోపణలు

జైపూర్ : 2019 లోక్‌సభ ఎన్నికలు మన భారతీయ వీరసైనికుల శవాలపైనే జరిగిందని జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఘాటుగా తీవ్రస్థాయిలో బిజెపిని విమర్శించారు. 2019 ఫిబ్రవరి 14న ఉగ్రవాదులు జరిపిన దాడిలో పుల్వామా దాడిలో 40 మంది జవాన్లు బలి అయిన విషయాన్ని ప్రస్తావిస్తూ మాలిక్ బిజెపిపై విరుచుకుపడ్డారు. పుల్వామా ఘటనపై ఎటువంటి దర్యాప్తు జరగలేదని, జరిగి ఉంటే అప్పటి హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాజీనామా చేయాల్సి వచ్చేది, పలువురు అప్పటి అధికారులు జైలుపాలయ్యి ఉండేవారని, దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆందోళన చెలరేగి ఉండేదని తెలిపారు. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో బన్సూర్‌లో జరిగిన ఓ సభలో మాజీ గవర్నర్ మాట్లాడారు.

పుల్వామా దాడి సమయంలో మాలిక్ పూర్వపు జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి గవర్నర్‌గా వ్యవహరించారు. పూర్తిగా అధికారుల నిర్లక్షంతోనే పుల్వామా ఉగ్రఘటన జరిగి, పలువురు వీర సైనికులు దుర్మరణం చెందారని తెలిపిన మాలిక్ ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ వ్యవహరించిన తీరు బాధ్యతారహితంగా ఉందన్నారు. దాడి ఘటన సమయంలో ప్రధాని మోడీ జిమ్ కార్బెట్ అభయారణ్యంలో ఓ వీడియో చిత్రీకరణలో ఉన్నారని, ఆయన వెలుపలికి రాగానే తాను పుల్వామా ఘటన గురించి తెలియచేశానని, మన స్వయం తప్పిదాల వల్లనే వారు బలి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశానని, అయితే దీనికి ఆయన తనను కసురుకుంటూ , దీనిపై ఎక్కువ మాట్లాడకండి (చుప్ రహో) అని బదులిచ్చారని మాలిక్ గుర్తు చేశారు.

జమ్మూ కశ్మీర్‌ను రెండుగా విభజించడం ఇతర పరిణామాలపై మాలిక్ తరచూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్నారు. ఎన్నికలు, ఓట్లు రాబట్టుకునేందుకు ఎటువంటి విషయాన్ని అయినా వాడుకునే తీరులో బిజెపి వ్యవహరించిందని, చివరికి మన జవాన్ల ప్రాణాల విషయంలోనూ రాజకీయాలకు పాల్పడిందని మండిపడ్డారు. పుల్వామా ఘటనపై ఇంతవరకూ సమగ్ర దర్యాప్తు ఎందుకు జరపలేదు? జరిపి ఉంటే పలువురి చిట్టాలు బయటకు వచ్చేవని వ్యాఖ్యానించారు.

మోడీతోనే మూడేళ్లలో సంపన్నుడైన అదానీ
గౌతమ్ అదానీకి ప్రధాని మోడీ నుంచి దండిగా సహకారం ఉందని, దీని వల్లనే కేవలం మూడేళ్ల కాలంలోనే ఆయన ప్రపంచస్థాయిలో అత్యంత సంపన్నుల జాబితాలో చేరారని మాలిక్ తెలిపారు. సామాన్య జనంలో ఎవరైనా ఉన్నట్లుండి శక్తివంతంగా సంపన్నులు అవుతారా? అని సభికులను ప్రశ్నించారు. ఎన్నికలు , ఓట్లు ఇందుకు ఎటువంటి సునిశితమైన, సున్నితమైన విషయాలను అయినా బాగా వాడుకునేందుకు బిజెపి వెనుకాడదని, వెనుకాడలేదని పుల్వామా ఘటనతో తేటతెల్లం అయిందన్నారు.

పుల్వామా నిజాలు ప్రజలకు తెలిసి ఉంటే బిజెపి పట్ల ఏహ్యాభావం పెరిగి ఉండేదన్నారు. పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ మోడీ అదానీ బంధాన్ని వెలుగులోకి తెచ్చారని, అదానీకి రూ 20వేల కోట్ల సంపద ఎక్కడి నుంచి వచ్చిందని , దీనిపై మోడీ ఏం చెబుతారని రాహుల్ ప్రశ్నించారని, మోడీ సమాధానం కోసం డిమాండ్ చేశారని, అయితే దాదాపు రెండు రోజులు పలు విషయాలపై మాట్లాడిన మోడీ అదానీ సంపద గురించి తప్ప మిగిలిన అన్ని విషయాలు మాట్లాడారని మాలిక్ తెలిపారు. అదంతా కూడా మోడీ ధనమే అన్నారు.

అవినీతి సొమ్ములో వాటాలు అదానీకి మళ్లింపులు
వారు ముఖ్యమంత్రుల నుంచి లూఠీ చేసింది తీసుకువచ్చి అదానికి సమర్పించడం, ఆయన భారీ స్థాయి వ్యాపారాలు చేయడం జరుగుతోందని తెలిపిన మాలిక్ ఈ సంపద ఎవరిదనేది మోడీ ఆత్మసాక్షికి తప్పనిసరిగా తెలుసునన్నారు. తాను గోవాలో విధుల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఆయన మందీమార్బలం అవినీతి గురించి ఫిర్యాదు చేస్తే దీనికి బదులుగా ప్రధాని తనను గవర్నర్ పదవి నుంచి తీసివేయించారని, అయితే వారికి అత్యవసరం అయిన సిఎం కొనసాగేలా చేశారని విమర్శించారు.

దీనిని బట్టి తాను నిర్థిష్టంగా ఒక్కటే చెప్పదల్చుకున్నానని, జరిగే అవినీతి అంతా ఆయన (మోడీ) కనుసన్నల్లోనే జరుగుతుంది. వాటాలుదక్కించుకుంటారు. ఈ మొత్తం వాటా తన చేతికి మట్టి అందకుండా అదానీ కంపెనీలకు చేరుస్తారని,దినికి ప్రతిగా అదానీ వీరికోసం వ్యాపారాలు చేస్తూ , ప్రపంచాన్ని ఏలుతారని స్పందించారు. ఇదంతా అవినీతి డబ్బు దందాల వ్యవహారం అయితే చివరికి దేశ సైన్యం బలి అయితే కూడా దీనిపై స్పందన లేకుండా ఉండటం, నిజాలను తొక్కిపెట్టడం ఎంతవరకు న్యాయం అన్నారు.

బిజెపికి తిరిగి ఓటేస్తే ఓటేసే హక్కు పోయినట్లే
ఈసారైనా కేంద్రంలోని ప్రభుత్వాన్ని మార్చాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని మాలిక్ తెలిపారు. తిరిగి వారికే ఓటేస్తే ఇక ఆ తరువాత మీకు ఓటేసే అవకాశం ఉండకపోవచ్చునని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ఈసారి గెలిపించిన తరువాత వారు ఇక జనం పరిస్థితి ఇంతే సంగతులు అవుతుందని, ప్రతిసారి తానే గెలువాల్సిందే అంటూ , చివరికి ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బూపెట్టడం ఎందుకు దండగా, మరో మార్గం ఎంచుకుందామనే ధోరణికి దిగుతారని మోడీ ప్రభుత్వ తీరును తూర్పారపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News