Wednesday, May 1, 2024

రాష్ట్రంలో కొత్తగా 41

- Advertisement -
- Advertisement -

41 Corona cases registered

 

10 మంది డిశ్చార్జ్
జిహెచ్‌ఎంసిలో 26, మేడ్చల్ 3, మరో 12 మంది మైగ్రెంట్స్‌కు వైరస్
1592కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ల సంఖ్య
1002 మంది ఆరోగ్యవంతంగా ఇళ్లకు
వయసు మీరిన 75 మంది వైరస్‌ను జయించారు
వలసకార్మికులతో ఆగని వైరస్ వ్యాప్తి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజధాని నగరంలో కరోనా ఉలిక్కిపాటుకు గురిచేస్తుంది. తాజాగా కోఠిలోని ఓ బ్యాంక్ మేనేజర్ కరోనాతో మరణించడం ఆందోళన కలిగిస్తుంది. దీంతో ఆ బ్యాంక్‌ని మూసివేసి, సిబ్బందితో పాటు బ్యాంక్‌కు వచ్చిన ఖాతాదారులను అందరినీ క్వారంటైన్ చేస్తున్నామని వైద్యాధికారులు స్పష్టం చేశారు. అయితే గత కొన్ని రోజుల నుంచి బ్యాంక్‌కు ఎవరెవరు వచ్చారు?మేనేజర్‌తో క్లోజ్ కాంటాక్ట్‌లో ఎవరు ఉన్నరనేది పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆయనను కాంటాక్ట్ అయిన వారందరినీ క్వారంటైన్ సెంటర్‌కు తరలించామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కొత్తగా 41 కేసులు నమోదు కాగా, పది మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ను ప్రకటించింది. దీనిలో జిహెచ్‌ఎంసి నుంచి 26, మేడ్చల్ నుంచి ముగ్గురుతో పాటు మరో 12 మంది వలసకార్మికులకు వైరస్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 1592కు చేరుకోగా, ఇప్పటి వరకు వైరస్ బారిన పడి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 1002కు పెరిగింది.

ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో 556 మంది చికిత్స పొందుతుండగా, వైరస్ దాడిలో ఇప్పటి వరకు 34 మంది మరణించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే గత వారం రోజుల నుంచి వలస కార్మికులకు కేసులు పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న వారి సంఖ్య పెరిగిందని, ముందస్తు జాగ్రత్తల మేరకు వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 69 మంది వలస కార్మికులకు వైరస్ సోకింది. అయితే సోమవారం వైరస్ వచ్చిన మైగ్రెంట్స్ మంచిర్యాల, ఖమ్మం, రాజన్న సిరిసిల్లాలకు చెందిన వ్యక్తులుగా అధికారులు పేర్కొన్నారు. కానీ వీటిని జిల్లా కేసులుగా పరిగణించమని అధికారులు స్పష్టం చేశారు. వీరంతా ముంబై నుంచి వచ్చిన వలస కార్మికులు కావడం గమనార్హం.

వయసు మీరినా… వైరస్‌ను జయించారు…

రాష్ట్రంలో కరోనా వైరస్‌ను వృద్ధులు జయిస్తున్నారు. వాస్తవంగా వీరికే ఎక్కువ ముప్పు ఉంటుంది. కానీ ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక వైద్యంతో వేగంగా కోలుకుంటున్నారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 1002 మందికి చేరగా, వీరిలో 61 నుంచి 80 మధ్య వయస్సులు 75 మంది ఉండటం గమనార్హం. వీరికి గాంధీ ఆసుపత్రిలో అద్బుతమైన చికిత్సను అందించామని సూపరింటెండెంట్ డా రాజారావు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఆరోగ్యవంతంగా ఇళ్లకు చేరిన వారిలో 663 మంది పురుషులు ఉండగా, 339 మంది స్త్రీలు ఉన్నారు. దీనిలో 0నుంచి 10 మధ్యలో 85 మంది , 11 నుంచి 20 మధ్య 132 మంది, 21 నుంచి 30 వయస్సు వారిలో 233 మంది, 31 నుంచి 40 మధ్యలో 202 మంది, 41 నుంచి 50 మధ్య వయస్సులో 152 మంది, 51నుంచి 60 మధ్యలో 123 ఉన్నారని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News