Saturday, April 27, 2024

ఇకనైనా పాఠశాలలు బాగుపడతాయా!

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. పాత ప్రభుత్వం పని తీరును సమీక్షించడం శుభపరిమాణం. సమీక్షించాల్సిన అతి ముఖ్యమైన అంశాల్లో పాఠశాల విద్యాశాఖ ఒకటి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం అత్యంత నిర్లక్ష్యానికి గురై 50% పాఠశాలలు మూసివేత అంచున నిలబడి వున్నాయి. బడి బాట, బడి పిలుస్తోంది రా, జయశంకర్ బడిబాట వంటి వాటి ద్వారా పిల్లలను బడులలో చేర్పించే కార్యక్రమాలు నిర్వహించడం వలన అదేం విచిత్రమో గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కావచ్చు లేదా నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ర్టంలో కావచ్చు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పడిపోవడం ప్రారంభమైంది. పైకి చూడడానికి గత ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలల సంఖ్యను భారీగా పెంచినట్టు కనబడడం శుభపరిణామమే అయినా వాటిలో చేరిన విద్యార్థులలో 90% ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నవారే కావడం గమనర్హం. ఒక ప్రభుత్వ వ్యవస్థను కుప్పకూల్చి మరొక ప్రభుత్వ వ్యవస్థను నిర్మించడం నిర్మాణాత్మక అభివృద్ధి ఎలా అవుతుంది? ప్రజలు, ఉపాధ్యాయులు,

విద్యా రంగంలో పని చేస్తున్న మేధావులు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచి రెసిడెన్షియల్స్‌గా మార్చాలని డిమాండ్ చేస్తే దానికి బదులుగా కొత్త వ్యవస్థను తీసుకొచ్చి వున్న వ్యవస్థను నాశనం చేశారు. అలాకాకుండా ప్రభుత్వ పాఠశాలలనే రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చి ఆ ఖర్చంతా వీటి వసతుల కల్పనకు పెట్టి ఉంటే ప్రతి మండలంలోని బడులన్నీ బాగుపడేవి. భూమితో పాటు బోలెడంత డబ్బు ఆదా అయ్యేది. ముప్పై ఏళ్ళ క్రితమే ప్రైవేటులో నర్సరీ, ఎల్‌కెజి, యుకెజి లాంటి ప్రీ ప్రైమరీ విద్యకు అనుమతిని ఇచ్చి, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీని ప్రారంభించకుండా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తప్పు చేస్తే, కెజి టు పిజి అనే అందమైన అబద్ధపు నినాదాన్ని ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం కెజిని ప్రారంభించలేదు సరికదా పిజిని సంస్కరించకుండానే ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతిని ఇచ్చి అదే తప్పు చేసారు. ముప్పై ఏళ్ళ క్రితమే అడ్మిషన్ వయసును ప్రైవేటులో 3 సం॥ రాలకు తగ్గించిన విద్యా శాఖ ప్రభుత్వ పాఠశాలల్లో నేటికీ 5+ సం॥రాలు కొనసాగిస్తున్నది. నర్సరీలో ప్రైవేటుకు వెళ్ళినవాడు 1వ తరగతికి ప్రభుత్వ పాఠశాలకు ఎలా వస్తాడు? ఐఐటి,

మెడికల్‌లాంటి ఎంట్రెన్స్ పరీక్షలను ఎదుర్కొనే విధంగా ఇ-టెక్నో, కాన్సెప్ట్, ఒలింపియాడ్ స్కూల్స్, కళాశాలలు ప్రభుత్వ రంగంలో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉన్నా నేటికీ ఎందుకు ప్రారంభం కాలేదు? ఒకవేళ ఇవన్నీ జరిగి ఉంటే ప్రభుత్వ పాఠశాలలు ఈ దుర్భర స్థితికి వచ్చి ఉండేవి కావు. కొత్త ఉద్యోగాలు సృష్టించబడి చాలా మంది నిరుద్యోగులకు అతిపెద్ద ఉపాధి కేంద్రంగా విద్యా వ్యవస్థ ఉండేది.
పాఠ్యపుస్తకాలలో, బోధనలో ఎటువంటి ప్రయోగాలు లేకుండా ప్రైవేటు పాఠశాలలు అద్భుతంగా పరిఢవిల్లుతుంటే, మెరుగైన ఫలితాలు సాధిస్తుంటే, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగాల పాడు కాలం ఎందుకు నడుస్తున్నది? ఎపెప్, డిపెప్, క్యూఐపి, ఎల్‌ఇపి, నిరంతర సమగ్ర మూల్యాంకనం (సిసిఇ), నిష్ఠ లాంటి ప్రయోగాలన్నీ ప్రపంచ బ్యాంకు కుట్రలో పావులుగా మారిన కొంత మంది వాళ్ళ పదవులు, డిప్యూటేషన్లు పది కాలాల పాటు కాపాడుకునే సూడో మేధావుల సృష్టి. సంవత్సరానికో ప్రయోగం. ఏ ప్రయోగం ఏం ఫలితం సాధించిందో ఇప్పటికీ బహిరంగ పరుచలేదు! వీటి వల్ల ప్రజల్లో పాఠశాల విద్యా వ్యవస్థ పట్ల ఉండే విశ్వాసం దెబ్బతినడమే కాదు విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోయింది.

ఈ మధ్య కాలంలో జరిగిన సర్వేలన్నీ పిల్లలకు చదవడం, రాయడం రావడం లేదని చెబుతుంటే ఎసి గదుల్లో కూర్చోన్న మేధావులు మాత్రం ఉపాధ్యాయుడు పాఠాలు ఎలా బోధించాలో శిక్షణల పేరుతో శిక్ష విధిస్తూ ఎఫ్‌ఎల్‌ఎన్, ఉన్నతి లాంటి కొత్త ప్రయోగాలను వద్దో మొర్రో అని మొత్తుకున్నా, మమ్మల్ని పాఠాలు చెప్పనివ్వండని అరిచిగీపెట్టిన బలవంతంగా రుద్దుతున్నారు. వీటిలో భాగంగా విద్యార్థులతో చదవడం, రాయడం చేయించాల్సిన ఉపాధ్యాయులు వార్షిక ప్రణాళికలు, పాఠ్యప్రణాళికలు, పీరియడ్ ప్రణాళికలు, డైరీలు రాయడంలో, చదవడంలో తనకో ప్రైవేటు లైఫ్ వుందనే విషయమే మరిచిపోయి తలమునకలు అవుతుండటం, టెన్షన్స్ పెరిగి రోగాల పాలై హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుండటం ఎంత దురదృష్టకరం! ఏకోపాధ్యాయుడు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు ఎఫ్‌ఎల్‌ఎన్‌ను ప్రాథమిక స్థాయిలో 5 తరగతులకు ఎలా అమలు చేయగలరు? ఉపాధ్యాయులు తరగతి గదుల్లో బోధించాల్సిన సోపానాలను బట్టి పట్టాలి.

వాటిని అడగడానికి, వాటి ప్రకారం బోధిస్తున్నారా లేదా పరిశీలించడానికి వందల మంది ఉపాధ్యాయులను వాళ్ళు పనిచేసే బడులను నాశనం చేసి డిప్యూటేషన్లు పెట్టి, తనిఖీ బృందాలను ఏర్పరిచి వారి సమాన క్యాడర్‌కు చెందిన సహచర ఉపాధ్యాయుల తరగతి గదుల్లో కూర్చొని పరిశీలించమనడం ఎంత సిగ్గుచేటు! యంఇఒ, డిప్యూటీ ఇఒ లాంటి పర్యవేక్షక పోస్టులు ఎందుకు నింపరు? విద్యార్థే అన్నీ అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి, ఉపాధ్యాయుడు ఏమీ బోధించకూడదట! అక్షరాల నుండి పదాలు, వాక్యాలు నేర్చుకోవడానికి బదులుగా వాక్యాల నుండే అక్షరాలు నేర్చుకోవాలని పుస్తక రచయితలుగా అవతారమెత్తిన ఉపాధ్యాయులు సెలవిచ్చి ప్రాథమిక స్థాయి పాఠ్యపుస్తకాలు రాయడం వల్ల ప్రభుత్వ విద్యార్థులు చదువు రాకుండా అయితే, ఆ సర్‌తో అధ్యయనం చేయించి విద్యార్థికి చదువు రావడం లేదని ఉపాధ్యాయుడిని దోషిగా చూపి ప్రభుత్వ పాఠశాలలను బదునాం చేసి మూసివేత కుట్రకు తెరలేపి ప్రైవేటుకు దారులు వేయడం ఎంత పెద్దకళో కదా! మార్చిలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థిని జూన్‌లో పై తరగతికి ప్రమోట్ చేయడం ఏ విధంగా కరెక్ట్! కనీస స్థాయికి చేరుకోని వారిని డిటెన్షన్ ఎందుకు చేయరు?

సిసిఇని ప్రవేశపెట్టిన సిబిఎస్‌ఇ, 21 రాష్ట్రాలు దాని దుష్ఫలితాలను సమీక్షించుకొని, వెంటనే రద్దు చేసుకొని పాత పద్ధతిని ప్రవేశపెట్టుకుంటే, మన రాష్ర్టంలో మాత్రం ఇది తప్పుడు విధానమని ఉపాధ్యాయులు, సంఘాలు, తల్లిదండ్రులు చెప్పి రద్దు చేయాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం పెడచెవినపెట్టింది. విద్యార్థికైతే రోజు పరీక్షలే! పరీక్ష లేని రోజంటు ఉండదు. విద్యార్థులపై పెరిగిన పరీక్షల భారాన్ని తగ్గించి సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి బోధనకు, చదవడానికి, రాయడానికి విద్యార్థికి అధిక సమయం కేటాయించడానికి చర్యలు తీసుకోవడానికి బదులుగా విద్యాశాఖ, ఎస్‌సిఇఆర్‌టిలో రిటైరైనా మేధావులు దానిని వదిలి పెట్టడకుండా కేవలం తమ పదవులను కాపాడుకోవడానికి తిష్ట వేసుకొని గబ్బిలాల్ల వేలాడుతూ శిక్షణల మంత్రాగాన్ని నడుపుతూ విద్యా వ్యవస్థను పగబట్టి సర్వనాశనం చేసి పతనం అంచుకు తీసుకువచ్చారు.
మన ఊరు, మన బడి మంచి పథకమే అయినా చెరువులో నీళ్ళు చెరువెనుకబడ్డ తర్వాత ప్రారంభించబడిందనే అపవాదుతోపాటు కొన్ని పాఠశాలల్లోనే అది ప్రారంభమైంది.

వేల కోట్ల రూపాయలతో పాఠశాలల్లో కంప్యూటర్లతో గదులను నెలకొల్పి, వున్న బోధకున్ని తీసేసి వాటిని మూలకు బడేసి విద్యార్థులను గ్లోబల్ సిటీజన్ తయారు చేయాలనే పీడకలకంటున్న అధికారులు, ప్రభుత్వం వున్న కాలం ఇది! ప్రైవేటులో కంప్యూటర్లపై పిల్లలు ఆటలాడుతుంటే మన ఘనత వహించిన విద్యాశాఖ పనికి మాలిన శిక్షణలు ఇస్తూ పరువు తీసుకుంటున్నది. సమావేశాలపై సమావేశాలు, నివేదికలపై నివేదికలు, రిపోర్టులపై రిపోర్టులు కంప్యూటర్ యుగంలో కూడా అడిగిన వాటినే అడగడం లాంటివన్నీ కేవలం ఉపాధ్యాయున్ని తరగతి గదికి దూరం చేసే కుట్రలో భాగమే! 98% పాఠశాలలు అటెండర్, స్వీపర్, స్కావేంజర్, క్లర్క్ లేకుండా ఉపాధ్యాయులే ఆ విధులు నిర్వహిస్తూ కాలం వెళ్ళదీస్తుంటే తనిఖీల పేరుతో అధికారులు, నాయకులు మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం బాగా లేవని సస్పెండ్ చేయడం ఎంత దౌర్భాగ్యం! రైతులకు, పేదలకు ఉచిత కరెంట్ ఇచ్చే పాలకులకు బడులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని ఎందుకు గుర్తుకురాదో అర్థం కాదు! పాఠశాలలకు ఇచ్చే నిధులు విద్యుత్ బిల్లుకే సరిపోవు.లైబ్రరీలు, ల్యాబ్‌లు అటుంచి 50% పాఠశాలల్లో నేటికీ టాయిలెట్ లాంటి కనీస మౌలిక వసతుల కల్పన కూడా జరుగపోవడం చాలా దురదృష్టకరం.

గత ప్రభుత్వంలా కాకుండా ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం అడ్మిషన్ వయసు 3 సం॥ రాలకు తగ్గించడంతో పాటుగా, ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కెజి, యుకెజిలను ప్రవేశపెట్టడంతో పాటు ప్రాథమిక పాఠశాలలను సెమి రెసిడెన్షియల్స్‌గా, హైస్కూల్స్ అన్నింటిని రెసిడెన్షియల్స్‌గా మార్చాలి. ఈ ప్రయోగాలను, శిక్షణలను ఆపి, అన్ని రాష్ట్రాల్లాగే సిసిఇని రద్దు చేసి, సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. ఒక పాఠశాలను ఒక యూనిట్‌గా తీసుకొని మౌలిక వసతులతో పాటు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించి కంప్యూటర్ విద్య ప్రాధాన్యతను పెంచడంతో పాటు లైబ్రరీలు, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లు నెలకొల్పాలి. తరగతి గదికో ఉపాధ్యాయున్ని నియమించాలి. మండల విద్యాధికారి కార్యాలయాలతో పాటు ప్రతి పాఠశాలకు స్కావెంజర్, అటెండర్, క్లర్క్‌ను నియమించాలి. ఇంచార్జ్‌ల వ్యవస్థను రద్దు చేసి అన్ని స్థాయిల్లో పర్యవేక్షక పోస్టులను నింపాలి. డిప్యూటేషన్లను రద్దు చేసి విద్యాశాఖను భ్రష్టు పట్టిస్తున్న రిటైర్డ్ మేధావులను తొలగించాలి.

ఇకనైన ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజలు, ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కళ్ళు తెరిచి గ్లోబలైజేషన్ విసిరిన సవాల్‌కు తగ్గట్టుగా పాఠశాలలను సంస్కరించాలనే డిమాండ్‌ను ప్రభుత్వాల ముందు ఉంచాలి. అందుకు తగ్గట్టుగా పౌరులను తయారు చేస్తామని హామీ ఇస్తే తప్ప ప్రభుత్వ పాఠశాలలను ప్రజలు విశ్వసించరు. గత ప్రభుత్వం విస్మరించినపై అంశాలన్నింటిపై సమీక్షించి పతనం అంచున నిలబడి వున్న ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ ప్రజా ప్రభుత్వం కాపాడుకోవడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలంగాణ టీచర్స్ యూనియన్ ఆశిస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News