Friday, April 26, 2024

8 మంది రాజ్య‌స‌భ ఎంపిల‌పై స‌స్పెన్ష‌న్‌

- Advertisement -
- Advertisement -

 అరాచకం సహించమంటూ వేటు
 మూజువాణి తీర్మానంతో వెంకయ్య చర్య
 వాయిదా వరకూ సభ్యులు సభలోనే తిష్ట

8 MPs are suspended from Rajya sabha

 

న్యూఢిల్లీ : ఎనమండుగురు ఎంపిలపై రాజ్యసభ సస్పెన్షన్ వేటు వేసింది. టిఎంసి నేత డెరెక్ ఒ బ్రియిన్, ఆప్ సభ్యులు సంజయ్ సింగ్ సహా మొత్తం 8 మంది ఎగువ సభ సభ్యులను ఈ వర్షాకాల సమావేశాల మిగిలిన సమయం అంతా సస్పెండ్ చేస్తున్నట్లు సభాధ్యక్షులు ఛైర్మన్ ఎం వెంకయ్యనాయుడు సోమవారం ప్రకటించారు. వ్యవసాయ బిల్లుల ఆమోద ప్రక్రియ సందర్భంగా ఆదివారం వీరి ప్రవర్తన అరాచకంగా ఉందని గుర్తిస్తూ వీరిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. సభలో తీవ్రస్థాయి అరాచకానికి దిగిన వీరిని సస్పెండ్ చేయాలని పేర్కొంటూ ప్రభుత్వం తీర్మానం తీసుకువచ్చింది. దీని పట్ల నిరసనలు కొనసాగుతూ ఉండగానే తీర్మానాన్ని మూజువాణితో ఆమోదించారు. వెంటనే సభాధ్యక్ష స్థానంలో ఉన్న వెంకయ్యనాయుడు ఈ సభ్యులు సస్పెండ్ అయినట్లు ప్రకటించారు. వెంటనే వారు సభ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే ఈ రూలింగ్‌ను పట్టించుకోకుండా సభ్యులు సభలోనే చాలా సేపు ఉన్నారు. సస్పెండ్ అయిన సభ్యులు వీరే ః డెరెక్ ఒ బ్రియిన్ (టిఎంసి), సంజయ్ సింగ్ (ఆప్), రాజీవ్ సాతవ్ (కాంగ్రెస్), కెకె రాగేష్ (సిపిఎం), సయ్యద్ నజీర్ హుస్సేన్ ( కాంగ్రెస్), రిపున్ బోరెన్ (కాంగ్రెస్), డోలా సేన్ (టిఎంసి), ఎలామరం కరీం (సిపిఎం). వీరిని ప్రస్తుత వర్షాకాల సెషన్ ముగిసే వరకూ బహిష్కరిస్తున్నట్లు సభాధ్యక్షులు తెలిపారు. బిల్లులకు ఆమోద దశలో ఈ సభ్యుల వ్యవహార శైలి చాలా అనుచితంగా ఉందని, దురదృష్టకర, అనామోదయోగ్యకర రీతిలో వ్యవహరించారని వెంకయ్యనాయుడు ఆక్షేపించారు. పార్లమెంట్ ప్రత్యేకించి ఎగువ సభ ప్రతిష్టను మంటగలిపారని విమర్శించారు. ఇక ఆదివారం బిల్లుల ఆమోద ప్రక్రియ దశలో సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్‌పై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానపు నోటీసును వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. ఈ నోటీసు సరైన పద్థతిలో లేదని, అవిశ్వాస తీర్మానానికి కనీసం 14 రోజుల సమయం అవసరం అని కూడా వివరించారు. ఆదివారం ఎగువసభలో గందరగోళ పరిస్థితుల నడుమ మూడు కీలక వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందాయి. బిల్లులోని అంశాల మరింత పరిశీలనకు వీటిని సభా కమిటీకి పంపించాలని, మూజువాణి కాకుండా ఓటింగ్ జరగాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. అయితే డిప్యూటీ ఛైర్మన్ మూజువాణి జరిగినట్లు, బిల్లులు ఆమోదం పొందినట్లు ప్రకటించడంతో వెల్‌లోకి దూసుకువచ్చిన ప్రతిపక్షాలు సభలో నిరసనలు, నినాదాలతో ఉద్రిక్తతను రేకెత్తించాయి. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా సభాధ్యక్ష స్ధానంలోని వ్యకి బిల్లులు నెగ్గేలా చేశారని ఆయనపై అవిశ్వాసానికి కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ , 46 మంది ఎంపీలు ఆయనపై అవిశ్వాసానికి నోటీసు ఇచ్చారు.

అయితే దీనిని తిరస్కరిస్తున్నట్లు వెంకయ్యనాయుడు ప్రకటించారు.రాష్ట్రాలకు జిఎస్‌టి పరిహారంపై సభ్యులు ప్రతిపాదించిన సావధాన తీర్మానంపై చర్చ కు ఆదేశించారు. అయితే ఈ తీర్మానాన్ని టిఎంసి నేత డెరెక్, సిపిఎం సభ్యులు రాగేష్, కరీంలు తీసుకువచ్చి ఉండటంతో, అప్పటికే సభలో నిరసనలు వ్యక్తం అవుతూ ఉండటంతో జిఎస్‌టి పరిహారాలపై సభ్యులకు ఆసక్తి లేనట్లుగా ఉందని పేర్కొంటూ సభాధ్యక్షులు తరువాతి అంశాన్ని ప్రస్తావించారు. అయితే సభ్యుల సస్పెన్షన్‌పై సభలో తిరిగి ఆదివారం నాటి పరిణామాలే తలెత్తుతూ ఉండటంతో సభాధ్యక్షులు రెండు మూడుసార్లు సభను వాయిదా వేశారు. ఆ తరువాత మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యులు సభా కార్యకలాపాలను సజావుగా సాగనివ్వాలని, వారి సహకారం అవసరం అని కోరారు. ఆదివారం నాటి సంఘటనలలో సభ్యులు ఏకంగా బల్లలపై ఎక్కడం, కాగితాలు విసరడం, చివరికి సభాధ్యక్షుడి పట్ల గౌరవం లేకుండా భౌతిక దాడికి యత్నించడం దారుణం అని విమర్శించారు. సభ్యులు తమ వ్యవహారశైలిపై ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని తెలిపారు. అయితే ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ల రూలింగ్‌తో సోమవారం ఎగువ సభ కార్యకలాపాలు దాదాపుగా అర్థాంతరంగా నిలిచిపొయ్యాయి. కేవలం జీరో అవర్‌లో కొందరు సభ్యులు ఇతర విషయాలను సభలో ప్రస్తావించగలిగారు. సభ్యుల సస్పెన్షన్లకు నిరసనగా సభలో ప్రతిపక్షాల నినాదాలతో సభను అర్థాంతరంగా వాయిదావేయాల్సి వచ్చింది. సస్పెండ్ అయిన సభ్యులు సభ నుంచి వెళ్లిపోకుండా ఉండటంతో పలు దఫాల వాయిదాల తరువాత సభాధ్యక్ష స్థానంలో ఉన్న భువనేశ్వర్ కలిత సస్పెండ్ అయిన వారు సభ నుంచి నిష్క్రమించాలని కోరారు. ఫలితం లేకపోవడంతో సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు.
సస్పెన్షన్లు అప్రజాస్వామికం : కాంగ్రెస్
గొంతునులిమే ప్రక్రియ సశేషం : రాహుల్
ఎగువసభలో సోమవారం ఎనమండుగురు ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్‌పై కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా అప్రజాస్వామికం, ఏకపక్ష చర్య అని పార్టీ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. సస్పెండ్ అయిన సభ్యులలో ముగ్గురు కాంగ్రెస్ ఎంపిలు కూడా ఉన్నారు. ప్రజాస్వామిక భారతపు గొంతు నులిమే ప్రక్రియ ఈ విధంగా సశేషంగా సాగుతోందని రాహుల్ వ్యాఖ్యానించారు. ముందు సభ్యులను మాట్లాడనివ్వకుండా చేయడం తరువాత పార్లమెంటేరియన్లను సభ నుంచి గెంటివేయడం ఇప్పటి ఆనవాయితీ అయిందని అన్నా రు. ఈ ప్రభుత్వం అన్నింటిపైనా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, వ్యతిరేకత వ్యక్తం చేసే వారిని మాట్లాడనివ్వకుండా చేయడం, రైతుల కడగండ్లను పట్టించుకోకపోవడం పద్ధతిగా మారిందని అన్నారు. ఈ ప్రభుత్వం చాలా విచక్షణాయుతంగానే తన అంతులేని అహంకార ధోరణిని సాగిస్తూ ఉన్నట్లుందని వ్యాఖ్యానించారు. వారి పద్ధతి వల్ల దేశ ఆర్థిక పరిస్థితికి విపత్తు ఏర్పడిందని విమర్శించారు. పార్లమెంట్ వెలుపల కాంగ్రెస్ ఇతర నేతలు అధీర్ రంజన్ చౌదరి, రణదీప్ సూర్జేవాలా విలేకరులతో మాట్లాడారు. డిప్యూటీ ఛైర్మన్ సభా పద్థతులను విస్మరించి , కేవలం పిఎంఒ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని వీరు విమర్శించారు. కొత్తగా తిరిగి డిప్యూటీ ఛైర్మన్ పదవిలోకి వచ్చిన ఆయన పూర్తిగా ప్రభుత్వ ఆదేశాలు, విధివిధానాలకు అనుకూలంగా స్పందిస్తూ వస్తున్నారని ఆరోపించారు. సభలో ఆయన ప్రతిపక్షాల గొంతు నులిమేందుకు యత్నించారని చౌదరీ మండిపడ్డారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News