Thursday, May 9, 2024

పికె రాజకీయ యాత్ర సాగేనా!

- Advertisement -
- Advertisement -

Prashant kishor political expedition

 

అప్పటి వరకు ఏనాడు పార్లమెంట్ భవన్‌లో అడుగు కూడా పెట్టని నరేంద్ర మోడీ నాయకత్వంలో 2014 ఎన్నికలలో బిజెపి అపూర్వ విజయం సాధించడంతో పాటు కాంగ్రెసేతర పార్టీలలో లోక్‌సభలో సొంతంగా పూర్తి ఆధిక్యత సంపాదించిన మొదటి పార్టీగా ఎదగడం పెద్ద రాజకీయ సంచలనమే. అయితే ఈ సంచలనంలో దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకున్న మరో వ్యక్తి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార వ్యూహం రూపొందించడంలో కీలక పాత్ర వహించారని అందరి దృష్టి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మోడీ కేంద్రం లో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో సహజంగానే తనకు ప్రభుత్వంలో కీలక భూమిక ఏర్పడగలదని ఎదురు చూశారు. అయితే ఆయన సేవలు ఇక అవసరం లేదన్నట్లు బిజెపి వ్యవహరించడంతో నిరాశ చెందిన ఆయన ఇతర రాజకీయ పార్టీల వెంట పడుతూ వస్తున్నారు.

2017 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పంజాబ్, యుపిలలో కాంగ్రెస్‌కు సహాయం అందించారు. అయితే పంజాబ్‌లో కెప్టెన్ అమరిందర్ సింగ్ ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదు. తనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలనే సూచనలు నచ్చక ఆయనను దూరంగా ఉంచారు. ఇక యుపిలో కాంగ్రెస్ ప్రచారం గందరగోళంగా మారింది.ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్‌లో వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఢిల్లీలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌లకు ఎన్నికల వ్యూహకర్తగా ఎన్నికలలో వారి పార్టీల విజయంకు దోహదపడ్డారు. ఈలోగా సొంతరాష్ట్రంలో రాజకీయ భూమిక ఏర్పర్చుకోవాలని అధికారంలో ఉన్న జెడి(యు) అధినేత నితీశ్ కుమార్ వెంట చేరారు. ఆ పార్టీలో చేరి పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవి పొందడమే కాకుండా, నితీశ్ రాజకీయ వారసుడనే మీడియా కథనాలు కూడా వచ్చాయి.

అయితే నితీశ్ తిరిగి బిజెపితో చేతులు కలపడంతో ఇరకాటంలో పడి, చివరకు ఆ పార్టీకి కూడా దూరంగా వచ్చేశారు. ఈ మధ్య జరిగిన ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్‌లకు ఎన్నికల వ్యూహకర్తగా వారి విజయానికి సహకరించారు. బెంగాల్ ఎన్నికల ఫలితాలు రాగానే ఇక ‘వ్యూహకర్త’ గా పని చేయబోవడం లేదని, తన భవిష్యత్ పట్ల దృష్టి సారిస్తానని ప్రకటించారు. సంక్లిష్టమైన ఎన్నికల గణాంకాలను క్లుప్తంగా, అర్ధమయ్యే విధంగా చెప్పడంలో నేర్పరిగా ఆయనకు పేరుంది. అందుకనే ఎన్నికల వ్యూహాలు రూపొందించడంలో అనేక మందిని ఆకట్టుకొంటున్నారు. అయితే తన సహాయంతో ఎన్నికలలో గెలుపొందినవారెవ్వరూ తనకు రాజకీయంగా ప్రాధాన్యత గల పదవులు ఇవ్వకపోవడంతో ఒకింత నిరాశ చెందిన్నట్లు కనిపిస్తున్నది.

మొదటి నుండి ఆయన దృష్టి జాతీయ రాజకీయాలపైననే ఉన్నట్లు కనిపిస్తున్నది. ఎన్నికల వ్యూహాలు రూపొందించడం కాకుండా కీలకమైన రాజకీయ నాయకుడిగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఒక కుటుంబం లేదా ఒకరిద్దరు వ్యక్తుల మయమే అవుతూ ఉండడంతో మరోవ్యక్తికి కీలక ప్రాధాన్యతలు ఇవ్వడానికి ఎవ్వరూ ఇష్టపడటం లేదు. పైగా రాజకీయ నాయకులు ఉన్నత అధికారులు, ఎన్నికల వ్యూహకర్తలు, మీడియా రంగానికి చెందిన వారి సేవలను తమ ఎదుగుదలకు ఉపయోగించుకోవడం సహజం. వారిలో కొందరికి రాజ్యసభ, శాసనమండలి లేదా ఇతర నామినేట్ పదవులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. కొద్దిమంది ప్రత్యక్ష ఎన్నికలలో కూడా విజయం సాధించవచ్చు. అంతేగాని వారికి రాజకీయ నాయకత్వం అప్పజెప్పడం ఎప్పడికి సాధ్యం కాదు.

తెర వెనుక ఉండి వ్యవహారాలు నడిపేవారు తెరముందుకు వచ్చి నాయకత్వం స్థాయిలో విజయాలు సాధించడం చాలా అరుదు. డా. జయప్రకాష్ నారాయణ్, జెడి లక్ష్మీనారాయణ వంటి వారు తెలుగు రాష్ట్రాలలో చేసిన ప్రయోగాలు చూశాము. జాతీయ స్థాయిలో అందరి దృష్టి ఆకర్షించే విధంగా స్వయం గా భూమి కొని, వ్యవసాయం చేసి, రైతులను సంఘటితపరచి, వారి హక్కుల కోసం పోరాడిన శరద్ జోషి వంటి వారు కూడా రాజకీయ పార్టీ ప్రారంభించి విజయం సాధింపలేకపోయారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సహితం తెరవెనుక ఎంత విజయవంతమైన పాత్రలు వహిస్తూ వచ్చినా, తెర ముందు నాయకత్వం వహించబోవడం ఏ మేరకు విజయవంతం అవుతుందో చూడాలి. బెంగాల్ ఎన్నికలు కాగానే మమతను 2024కి ప్రధాని అభ్యర్థిగా చేయడం కోసం అంటూ శరద్ పవర్ వంటి వారిని కలుస్తూ, బిజెపి-, కాంగ్రెసేతర రాజకీయ పక్షాల కూటమి కోసం ఒకింత ప్రయోగం చేశారు.

గతంలో జరిగిన ఇటువంటి ప్రయోగాలు ముందుకు వెళ్ళలేదు. కాంగ్రెస్ ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ నేటికీ 200కి పైగా సీట్లలో బిజెపికి ప్రధాన ప్రత్యర్థి. బిజెపి బలహీనపడితే నేరుగా ప్రయోజనం కాంగ్రెస్‌కే లభిస్తుంది. బిజెపి సహితం ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న ఎక్కడా బలం పుంజుకోలేక పోతున్నది. కాంగ్రెస్ ప్రాబల్యం గల ప్రాంతాలలోనే రాజ్యమేలుతున్నది. అందుకనే శరద్ పవర్ ఇంట్లో ఆయన సూత్రధారిగా జరిగిన సమావేశంకు కాంగ్రెస్ గైర్హాజరు కావడంతో ఎటువంటి ప్రయోజనం సాధించలేకపోయారు. దానితో పొరపాటు గ్రహించి ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ పార్టీలో చేరి జాతీయ రాజకీయాలను తన కనుసన్నలలో నడిపేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు.

కాంగ్రెస్‌లో చేరడం కోసం పంజాబ్ ముఖ్యమంత్రి సలహాదారుడి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజకీయ కార్యదర్శిగా చేరబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఏదిఏమైనా కాంగ్రెస్‌లో సీనియర్ నేతలను పక్కనబెట్టి రాజకీయ చేయడం సాధ్యం కాదని ఇప్పటికే రాహుల్ గాంధీ అనుభవం వెల్లడి చేస్తున్నది. ఎన్నికల వ్యూహ కర్తలు, ప్రభుత్వ అధికారులు, పాత్రికేయులకు క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎంతటి అవగాహన ఉన్నప్పటికీ రాజకీయ నాయకులకు ‘సాధారణ ప్రజల నాడి’ ని అందుకోగల ‘వ్యవహార జ్ఞానం’ పుష్కలంగా ఉంటుంది. ఆ పరిజ్ఞానంతోనే చెప్పుకోదగిన విద్యార్హతలు లేనివారు కూడా నెగ్గుకు రాగలుగుతున్నారు.

ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి టి అంజయ్య గురించిన ఒక సంఘటన గుర్తుకు వస్తుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యం ఆయన పాలనపై విమర్శలు గుప్పిస్తూ కథనాలు ప్రచురిస్తుండే ఒక తెలుగు దినపత్రిక సంపాదకుడిని పిలిలించారు. ‘అయ్యా మీరు గొప్ప విజ్ఞానవంతులు, విషయపరిజ్ఞానం గలవారు. నాకు అన్ని తెలివి తేటలు లేవు. నిత్యం మా ప్రభుత్వంపై దుమ్మెత్తే బదులు ప్రజలకు మేలు చేయాలి అంటే ఏమి చేయాలో కొన్ని విషయాలు చెప్పండి. ఇప్పడే జిఒలు జారీ చేస్తాను’ అన్నారట.

వెంటనే ఆ ప్రముఖ సంపాదకుడు నోటమాటరాక తెల్లముఖం వేశారు. ఆయన తనపై తిట్ల వర్షం కురిపిస్తే, సమాధానం ఎంత ఘాటుగా చెప్పాలో అని తయారై వెళ్లారు. అందుకనే డా. జయప్రకాశ్ నారాయణ్, జెడి లక్ష్మీనారాయణ, శరద్ జోషి వంటి వారు ఇటువంటి ‘వ్యవహార జ్ఞానం’ లోపించిన కారణంగానే రాజకీయాలలో నెట్టుకు రాలేకపోయారు. అదే విధంగా ప్రశాంత్ కిషోర్‌ను సహితం ఎన్నికల వ్యూహకర్తగా అందరు ప్రాధాన్యత ఇస్తున్నా రాజకీయ పాత్ర వహించే ప్రయత్నం చేస్తే మాత్రం ఏమేరకు స్వాగతిస్తారో చూడాలి. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుపుకి సూత్రధారిగా భావిస్తూ, ఆయనను బిజెపికి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కి సన్నిహితంగా తీసుకు రావాలని విఫల ప్రయత్నం చేశారు.

ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్ర ప్రయోజనాలు, తమ రాజకీయ ఉనికిలను దృష్టిలో ఉంచుకొంటాయి గాని గుడ్డిగా జాతీయ పార్టీల వెంటపడలేవు. తెలంగాణలో కెసిఆర్, ఎపిలో జగన్, ఒడిశాలో నవీన్ పట్నాయక్ వంటి వారు అటువంటి విధానాలే వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ భాగస్వామిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే కూడా జాతీయ రాజకీయాలలో ఆ పార్టీ వెంట నడవడానికి సిద్ధంగా లేరు. తమిళనాడులో స్టాలిన్, బెంగాల్‌లో మమతా సహితం కాంగ్రెస్ అనుకూల కూటమిలో ఉండేందుకు ముందుకు వస్తున్నా ఆ పార్టీ వ్యూహాలలో భాగంకాలేరు. యుపిలో అఖిలేష్ యాదవ్, మాయావతి సహితం స్వతంత్ర వైఖరి అవలంబిస్తున్నారు. ఇటువంటి సంక్లిష్ట రాజకీయ సమీకరణలలో ప్రశాంత్ కిషోర్ జాతీయ రాజకీయాలను తనదైన రీతిలో తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తే ముందుకు వెళ్లడం కష్టమే కాగలదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News