Saturday, April 27, 2024

తీన్మార్ మల్లన్నపై పరువు నష్టం దావా వేస్తా

- Advertisement -
- Advertisement -

తన సతీమణి నీలిమకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం దొంగతనంగా ఉద్యోగం ఇచ్చినట్లు
తీన్మార్ మల్లన్న అసత్య ప్రచారం చేస్తున్నారు
ప్రజావాణి తీన్మార్ మల్లన్న అక్రమాలపై ఫిర్యాదులు వచ్చాయి, కానీ ప్రభుత్వం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు
బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : తమ కుటుంబ సభ్యులపై తీన్మార్ మల్లన్న అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తన సతీమణి నీలిమ ఇంటర్‌లో రాష్ట్ర ప్రథమ స్థానం పొందారని, 1992లోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించారని చెప్పారు.ఆమెకు 2015లో డివిజనల్ ఇంజనీర్‌గా ప్రమోషన్ వచ్చిందని తెలిపారు. ఆరు నెలలు డిప్యూటేషన్‌పై సచివాలయంలో పని చేశారని, 2020 నవంబర్ 19న విఆర్‌ఎస్ తీసుకున్నారని చెప్పారు. తన సతీమణి వామపక్ష విద్యార్థి సంఘం నాయకురాలిగా పని చేసిందని పేర్కొన్నారు. తన సతీమణి నీలిమకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం దొంగతనంగా ఉద్యోగం ఇచ్చినట్లు తీన్మార్ మల్లన్న అసత్య ప్రచారం చేస్తున్నారని.. తన కుటుంబ సభ్యులపై తప్పుడు ప్రచారం చేస్తోన్న తీన్మార్ మల్లన్నపై పరువు నష్టం దావా వేస్తానని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రజావాణీలో తీన్మార్ మల్లన్న అక్రమాలపై ప్రజలు ఫిర్యాదులు చేశారని.. కానీ ప్రభుత్వం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. తనపై తీన్మార్ మల్లన్న రెండు సార్లు ఎంఎల్‌సిగా పోటీ చేసి ఓడిపోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మల్లన్న మాట్లాడుతున్నాడని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అనురాగ్ విద్యాసంస్థలకు వచ్చి తీన్మార్ మల్లన్న సోదరుడు బెదిరిస్తున్నాడని ఆరోపించారు. అనురాగ్ విద్యాసంస్థల్లో ప్రతి నెల ఐదవ తేదీన జీతాలు ఇస్తున్నామని చెప్పారు. తమ యూనివర్సిటీకి ఇంటిలిజెన్స్ అధికారులు వచ్చి బెదిరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలు అసత్యాలు,అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఓడిన ఎంఎల్‌ఎలు ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. జనగాంలో తనపై ఓడిపోయిన అభ్యర్థి ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. బిఆర్‌ఎస్ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు : బాల్క సుమన్
కాంగ్రెస్ పార్టీ నేతల బుద్ధి మారడం లేదని మాజీ ఎంఎల్‌ఎ బాల్క సుమన్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా పాలన మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని అన్నారు. శాసనమండలిని ఇరానీ కేఫ్, ఎంఎల్‌సిలను రియల్ ఎస్టేట్ వ్యాపారులని సిఎం అగౌరవపరుస్తున్నారని వాపోయారు. బిఆర్‌ఎస్ నేతలపై దుష్ప్రచారాలు మానుకోవాలని సూచించారు. మాజీ ఎంఎల్‌ఎల గన్‌మెన్‌లను తొలగించారని, సమయం ఇవ్వకుండా మాజీ ఎంఎల్‌ఎల క్వార్టర్స్‌ను ఖాళీ చేయించారని పేర్కొన్నారు. అప్పుల కుప్ప అంటూ తెలంగాణ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రైతుబంధు నిధులు, మంత్రుల కంపెనీలకు మళ్ళించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, నిధులు ఎటు వెళ్తున్నాయో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.

లోక్‌సభ ఎన్నికల పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వాయిదా వేయవద్దని అన్నారు. రాష్ట్రంలో ఆర్‌టిసి బస్సు సర్వీసులను తగ్గించారని, రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ఆటో డ్రైవర్లకు నెలకు 15 వేల రూపాయల జీవన భృతి ఇవ్వాలని పేర్కొన్నారు. ఇంటిలిజెన్స్ అధికారులు ఫోన్స్ ట్యాప్ చేస్తున్నారని, గోదావరి పరివాహక ప్రాంత నేతలకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గన్‌మెన్‌లను తొలగించిందని, తుంగతుర్తిలో సురేష్ అనే బిఆర్‌ఎస్ కార్యకర్త, అతని భార్యను కాంగ్రెస్ వాళ్లు కొట్టారని, అలాగే కొల్లాపూర్‌లో బిఆర్‌ఎస్ కార్యకర్తను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News