Saturday, April 27, 2024

ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామనడం రాజ్యాంగ విరుద్ధం

- Advertisement -
- Advertisement -

అల్లర్లకు ఆజ్యం పోసేలా కేంద్ర మంత్రి వ్యాఖ్యలు
మణిపూర్ మరణహోమంపై ప్రధాని మౌనం వీడాలి
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్ : తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సామాజికంగా వెనుకబడ్డ ముస్లింలకు విద్యా, ఉద్యోగాల్లో కల్పించిన 4 శాతం రిజర్వేషన్లను తొలగిస్తామంటే ఎలా? అంటూ ప్రశ్నించారు.

మతపరంగా ముస్లింలను శత్రువులుగా చూపి, మతవిద్వేషాలకురెచ్చగొట్టే ప్రకటనలు చేయడం సరికాదన్నారు. దేశంలోని బిజెపి నేతలు అందరూ రాజేంద్ర సచర్ కమిటీ నివేదిక చదవాలన్నారు. ఎటువంటి కమిటీ నివేదికలు లేకుండానే అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ముస్లింలకు ఇస్తే తప్పేందని ప్రశ్నించారు. మణిపూర్‌లో కుకి గిరిజన మహిళలపై దాడులు, అత్యాచారాలు,హత్యలు జరుగుతున్నా ప్రధానమంత్రి మౌనంగా ఉండడం శోచనీయమన్నారు. భేటీ బచావో – బేటి పడావో, భారత్ మాతాకీ జై అనే నినాదాలతో ప్రగల్బాలు పలికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించినా స్పందించకపోవడం దారుణమన్నారు.

ఒకవైపు బిజెపి పాలిత రాష్ట్రాల్లో గిరిజనులపై దాడులు చేస్తూనే మరోవైపు తెలంగాణలో బిజేపి అధికారంలో వస్తే,గిరిజనుల రిజర్వేషన్లు పెంచుతామని కిషన్ రెడ్డి ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. పారిశుద్ధ కార్మికులను 2013 లో పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ అధికారంలోకి వచ్చి 10 ఏళ్లయినా హామీలను నెరవేర్చలేకపోవడం సరికాదన్నారు.
23 ఏళ్ల క్రితం ఏర్పడ్డ ఎలిగేడు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్,జూనియర్ కళాశాల,మోడల్ స్కూల్, కేజీబీవీ,సంక్షేమ హాస్టళ్లు మంజూరు చేయాలని కోరారు. కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు నాయకులు ఈ ప్రాంత ప్రజల ఓట్లు వేసుకున్నారు తప్ప, అభివృద్ధి పట్టించుకోలేదని విమర్శించారు. దూళికట్ట బౌద్ధ స్తూపం ఆధిపత్య గత పాలకుల పాలనలో నిర్లక్ష్యానికి గురైందన్నారు. ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా విలసిల్లాల్సిన బౌద్ధ స్తూపానికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని పేర్కొన్నారు. బిఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధూళికట్టను అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.

ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణకు ఉద్దేశించిన జీవో నెంబర్ 58, 59 అమలు కావడం లేదన్నారు. అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం పలు గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరించారు. యాత్రలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి దాసరి హనుమయ్య, బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి దాసరి ఉష, జిల్లా అధ్యక్షులు గొట్టే రాజు, ఉపాధ్యక్షులు తోట వెంకటేష్ పటేల్ జోనల్,నియోజకవర్గం అధ్యక్షులు బొంకురి దుర్గయ్య, ఉపాధ్యక్షులు నార్ల గోపాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సతూరి అనిల్, కోశాధికారి ఎండి రియాజ్, మహిళా కన్వీనర్ కుమ్మరి సవిత,జిల్లా ఇంచార్జ్ బాల కళ్యాణ్ పంజా,మొలుమూరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News