Saturday, April 27, 2024

ఒకానొక ప్రాదేశిక కవి

- Advertisement -
- Advertisement -

About Poet Jukanti Jagannatham

 

భారతదేశ స్వాతంత్య్రానంతర రాజకీయ, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక పరిణామాలతో తెలుగు కవులు నిరంతరం తలపడుతూనే ఉన్నారు. స్వాతంత్య్రం కంటే ముందే మొదలై స్వాతంత్య్రానంతరం కూడా కొనసాగిన రైతాంగ సాయుధ పోరాటం (1946-1951) నాటి కవులు, దిగంబర కవులు (1965-1968), తిరుగబడు కవులు (1969), విరసం (1970) కవులు రాజ్యాంగం ఇచ్చిన హామీ లేవీ సాకారం కాకపోవడంతో సామాన్య ప్రజల వైపు నిలబడి వ్యవస్థను ప్రశ్నించే కవిత్వమెంతో రాశారు. ఈ ప్రశ్నల కొడవళ్ళు ఇలా కొనసాగుతుండగానే దేశంలో అత్యవసర పరిస్థితి (1975-77) విధింపబడింది. ఎన్నో ఫాసిస్టు చర్యలు అమలయ్యాయి. రాజ్యాంగం 14 అధికరణ చట్టం ముందు పౌరులంతా సమానమంటుంది. 21వ అధికరణ పౌరులకు జీవించే హక్కును కల్పిస్తుంది. ఇలాంటి వ్యక్తి స్వేచ్ఛను కాపాడే అధికరణలను కూడా ఆనాటి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మీసాలాంటి భద్రతా చట్టాలను అమలు పరిచి వేలాది మందని అరెస్టు చేశారు. ఇంతటి నేపథ్యాన్ని కడుపులో దాచుకొని ఆ చీకటి దారులను చీల్చుకుంటూ కవిత్వమనే ల్యాంప్‌ను పట్టుకొని తెలుగు కవిత్వావరణంలోకి అడుగు పెట్టిన ధిక్కారకవి జూకంటి జగన్నాథం. సిరిసిల్ల నుండి సినారె అంతేవాసులు లలిత గీతాలు రాస్తుంటే ఆ దారిని వదిలిపెట్టి, తన కలాన్ని ప్రజల దుఃఖంలో ముంచి తీసి తొలినాళ్ళ నుండే తనదైన, స్పష్టమైన దారి ఏర్పరచుకొని గత నాలుగున్నర దశాబ్దాలుగా కవిత్వమై పలవరిస్తున్న జూకంటి త్వరలో వెలువడబోతున్న ‘సద్దిమూట’తో కలిపి ఇప్పటిదాకా 16 కవితా సంపుటాలు వెలువరించారు. ‘వైపని’ (నైపుణ్యం) పేర ఒక కథల సంపుటి కూడా వెలువరించారు.

దోసెడు కన్నీళ్లు, పిడికెడు ధిక్కారాన్ని దినుసులుగా పట్టుకొని బయలుదేరిన జూకంటి కవిత్వం ప్రధానంగా విప్లవం, ప్రపంచీకరణ, తెలంగాణ, మానవీయ కోణాల్లో మున్ముందుకు సాగిపోతోంది. అద్దాన్నీ, ఆకారాన్నీ విభజించలేనట్లే జీవితాన్నీ, కవిత్వాన్నీ వేరువేరుగా దర్శించలేకపోతున్నాను అని ప్రకటించుకున్న జూకంటి జీవితం పొడుగూతా ఎదురైనా ప్రతి గాయాన్నీ కవిత్వీకరించారు. జూకంటిని అర్థం చేసుకోవాలంటే ముందు వాళ్ళ ఊరును అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఊరును అర్థం చేసుకోవాలంటే గత ఆరున్నర దశాబ్దాల తెలంగాణ సామాజిక, ఆర్ధిక పరిణామాలను అర్థం చేసుకోవాలి. దేశంలో ఎమర్జెన్సీ విధించడం అనే చర్య ప్రగతిశీల ఆలోచనలు కలిగిన యువకులెంతో మందికి కొత్త చూపును ప్రసాదించింది. మార్క్సిజాన్ని, కమ్యూనిజాన్ని, ప్రభుత్వం కల్పిస్తున్న నిర్బంధాన్ని అవగాహన చేసుకున్న భావావేశం గల కవులు భావ కవిత్వ మూస నుంచి బయటపడి కొత్త దారుల్లో కవిత్వం రాయడం మొదలు పెట్టారు. నిర్దిష్టమైన అభిప్రాయాలను ఏర్పరచుకొని, ఎవరివైపు నిలబడాలో తేల్చుకొని, తనలోకి తాను ‘పాతాళగరిగె’ వేసుకొని ‘జకముక’ వంటి కవిత్వాన్ని రాజేస్తూ తెలుగు కవిత్వావరణంలోకి అడుగు పెట్టారు జూకంటి.

80వ దశకం నుండి తెలంగాణ నేల మీద పుట్టిన ఎన్నో ప్రజా ఉద్యమాలకు తనను తాను ‘ఆకురాయి’లా రాసుకొని, ఉద్యమాల గుండె చప్పుళ్లకు అనునాదమై స్పందిస్తూ నిఖ్సాన ప్రజా కవిత్వం రాయడం మొదలు పెట్టాడు. నశించి పోతున్న విలువల్ని తన కవిత్వం ద్వారా పట్టుకోవడం ప్రారంభించాడు. ఏ సమాజం మధ్య నిలబడ్డాడో, ఏ ప్రజల మధ్య నిత్యం సంచరిస్తున్నాడో, ఎవరి బాధలను తన బాధలుగా భావించాడో వాళ్ళ కోసం రాస్తేనే కవిగా నిలదొక్కుకోవచ్చని, అలాంటి సృజనలో నిర్దిష్ట ప్రయోజనం ఇమిడి ఉంటుందని కొన్ని సార్లు బహిర్ముఖంగా, కొన్ని సార్లు అంతర్ముఖంగా ప్రకటించారు.
నా చుట్టూ ఉవ్వెత్తున ఉరుమురిమి పడుతున్న జన సముద్రాలు. ఒక్క చోట నిలబడనీయని రాజ్య హింస. హత్యలు, ఆత్మహత్యలూ, దినదినం గ్రామాలకూ, పట్టణాలకూ మధ్య పెరుగుతున్న దూరాలు, బతుకులోంచి ‘దెంక’ పోవడాలు, ముసుగులో గుద్దులాట. శిథిలమవుతున్న వ్యవస్థా బీభత్సం. మరోవైపు మొండివారుతున్న తనం. కొల్లగొట్టబడుతున్నమనిషి సార్వభౌమాధికారం, కుంచించుకుపోతున్న వైశాల్యాలు, విడదీస్తున్న వైరుధ్యాలు, ఆకర్షిస్తున్న ధృవాలు, అడుగడుక్కీ అనివార్యంగా ప్రాయోజితమవుతున్న బతుకు తండ్లాట. బహిరంగ విషయాన్ని ఆమోదించని ‘పట్టని’ తనాలు. ఒకే ఒక్క తొక్కులాట నన్ను ‘బెంగటీల’ చేశాయి. మనసును ‘కలికలి’ చేశాయి. కోల్పోయిన అంశాల్ని తిరిగి పొందే ‘పాతాళగరిగె’ నన్ను నిరంతరం అరమరికలు లేకుండా నిలబెట్టింది అంటూ తన కవిత్వ పునాదిరాళ్ళని, మనిషి శిథిలత్వాన్ని లోచూపుతో తన కవిత్వ అద్దంలో చూపిస్తారు జూకంటి.

తెలుగు కవిత్వంలోనే ప్రపంచీకరణ ప్రమాద ఘంటికలను మొదట వినిపించిన కవి జూకంటి. నట్టింట్లో తిష్ట వేసిన రంగుల పెట్టె సృష్టించిన మానవీయ సంబంధాల విచ్చిత్తిని, వ్యవసాయ సంక్షోభాన్ని, గ్రామాల్లో వృత్తులు కోల్పోయిన చేతులు, కాళ్ళు నగరం లేబర్ అడ్డా మీద పని కోసం నిల్చున్న దైన్యాన్ని, వ్యవసాయాన్ని, చరిత్రను దండుగమారి పనిగా తలచిన పాలకులు ఆయా రంగాల నుండి పెట్టుబడులను ఉపసంహరించుకున్న విధానాన్ని, పెరుగు బువ్వ తిన్నంత సులభంగా రైతులు పురుగు మందులను తాగిన దృశ్యాలకు కదిలిపోయి ‘ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ గా ఎలా మారిపోతోందో తెలుగు సమాజం ఆశ్చర్య పోయేలా కవిత్వమై కుమిలిపోయారు. జీవితంలోని అనేక పార్శ్వాలలో సగటు మనిషి పడుతున్న పాట్లను, రాను రానూ దుర్భర స్థితిలోకి జారిపోతున్న మనిషి జీవితాన్ని ‘గంగ డోలు’ గా మారి వారి జీవన సవ్వడులను వినిపించారు. ప్రపంచీకరణ సృష్టించిన విధ్వంసక ముఖచిత్రాన్ని ‘వాస్కోడిగామా డాట్ కాం’లో సుదీర్ఘంగా చర్చించారు. రండి!
ఇండియా తమకు శిరసు వంచి /స్వాగతం పలుకుతుంది /

రైతు వెన్నెముకల్నిఏర్చి కూర్చి / విమానం దిగుతున్న మెట్లుగా తీర్చిదిద్దాం/ గుండె పగిలిపోతుంది / చితికిన గూన పెంకలు విరిగిన మూల వాసం / కూలిన ప్రహరీ గోడ /ఓదార్పు భుజంపై / వాలిన దుఃఖదాయిని ఊరు /మనిషిది- మట్టిది, కవిది-సమాజానిది ‘బొడ్డుతాడు’ సంబంధం. అందుకే జూకంటిలాంటి కవులు మూల కణాలతో నిర్మితమైన జీవధాతువులాంటి కవిత్వాన్నే అందిస్తారు. ‘ఒక రోజు పది గాయాలు’, ‘తల్లి కొంగు’, ‘పిడికెడు కలలు – దోసెడు కన్నీళ్లు’, ‘రాజపత్రం’, ‘చిలుక రహస్యం’, ‘చెట్టును దాటుకుంటూ’, ‘పస’, ‘ఊరు ఒక నారు మడి’ లాంటి కవిత్వ సంపుటాల పుటల నిండా జూకంటి కవిత్వ శ్వాస, సమాజంతో తాను జరిపిన నిరంతర సంఘర్షణ దేహంలో నెత్తురులా పరచుకొని పోయింది. జూకంటి ఏ కంటితో చూస్తాడో కాని తన కళ్ళ ముందున్న సమాజ చలన సూత్రాలను చాలా ముందే పసిగట్టి తన వంతుగా ప్రజా సమూహాలను హెచ్చరిస్తాడు. మనిషిని సెన్సిటైజ్ చేసి కర్తవ్యాన్ని కవిత్వ పరిభాషలో ఏకరువు పెడుతాడు. జూకంటి మూగ నొప్పులు అర్థం కావాలంటే గత యాభై వసంతాల సమాజ ప్రయాణంతో అనుసంధానం కావాలి. అప్పుడే ఆయన ఆరాటం పోరాటం మనల్ని నదీ ప్రవాహంలా అల్లుకుపోతుంది.

అధ్యక్షా! ఒకరు కాదు ఇద్దరు కాదు/ వందల మంది మా పోరగాండ్లు /ఎవర్ని ఏమనలేక /మ్యాదకంగా బలిదానం చేసుకున్నరు/ అయ్యా! / మీకు దయ రాక పాయె /మీకు గోరెడంత నెనరు లేకపాయె /
మీ అసెంబ్లీ కంటికి / ఇసుమంత చెమ్మ రాదు అంటూ అంతఃకరణ శుద్ధితోనే కాదు, త్రికరణశుద్ధితో నాలుగు కోట్ల ప్రజల తరపున అవిశ్వాసం ప్రకటిస్తారు. తెలంగాణ ఉద్యమంతో పాటు ఉపనదిలా కలిసి నడిచిన జూకంటి మలిదశ ఉద్యమంలోని ప్రతి మూలమలుపునూ కవిత్వంలో రికార్డు చేశాడు. స్థానికత నుంచే అంతర్జాతీయతను దర్శించే జూకంటి కవిత్వం మౌఖిక శిల్పంతో కదిలే ఒక ఊరు లాంటి కవిత్వం. ఇన్నేళ్ళ కవితా ప్రయాణంలో జూకంటి ఎన్నో కవితా ప్రయోగాలు చేశారు. ధిక్కార స్వరాన్ని వినిపించారు. తొలి అడుగు నుంచి ఇప్పటిదాకా ఆయన ప్రతిపక్ష కవి. నిరాడంబర కవి. అనుభవాన్నే కవిత్వ కళలో వ్యక్తీకరించే జలపాతంలాంటి కవి. ఎంతో వస్తు వైవిధ్యంతో పాటు లోతైన తాత్వికతతో, విభిన్న నిర్మాణ పద్ధతుల్లో అతని కవిత్వం ఎప్పుడూ తాజాదనంతో తళుకులీనుతుంది. జూకంటి కవిత్వాన్ని చర్చించిన ప్రతిసారి అతని తెలంగాణ తెలుగు భాషా ప్రయోగశీలతను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాగు నీళ్ళలాంటి జూకంటి భాష తెలంగాణ అస్తిత్వానికి ఎత్తిన పతాక.

గ్లోబలైజేషన్ కత్తి వాదరకు తెర్లు తెర్లు అవుతున్న పల్లెలను, కనిపించని శక్తేదో, హింసేదో మనిషికి నిలువ నీడ లేకుండా చేస్తుంటే జూకంటి కంటికేడు ధారలై ఏడుస్తారు. రాజ్యంపై తన నిరసనను ప్రకటించడానికి వ్యంగ్యాన్ని, అధిక్షేప స్వరాన్ని బలంగా వాడుకుంటారు. అసలు కన్నా కొసరు ముద్దు అన్నట్లు మన పిల్లల బాల్యపు మధురిమల్ని ఏవో ఒత్తిళ్ళ వల్ల పట్టించుకోము. ఆరు పదులు దాటినాక ఏ లోకం నుండో మనుమలు, మనుమరాళ్ళు నట్టింట్లో అడుగుపెట్టాక మన అంతరంగంలోని సున్నితత్వం, వారసత్వ తన్మయత్వం ఒక్కసారి ‘తారంగం’ ఆడుతుంది.
పిల్లల నిద్రలోని బోసి నవ్వులు / ఎన్నెన్ని వెలుగు పువ్వులు / ఆశ్చర్యంగా మెలకువ మౌన గుసగుసల్లో/ ఎలుకోలేని ఎరుకోలేని /విరిసిన సింగిడీలు దశాబ్దాల పోరాటం ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట కల సాకారం అయిన తరువాత ఒక దశలో కవులు, రచయితలు కలాలు మూసుకొని విశ్రాంతి తీసుకున్నారు. ఇక చేయాల్సిన పోరాటం ఏమీ లేదని, స్వరాష్టంలో జీవితాలను వెలిగించుకోవడమే మిగిలిందని భావించారు. కాని ప్రజల బతుకులు మారనంత కాలం, అందరికీ సమన్యాయం దక్కనంత కాలం పోరాటం మిగిలే ఉంటుందని ఎలుగెత్తి చాటిన కవి జూకంటి.

‘గళ్ళ పట్టి అడుగకపోతే నేను కవిని కాదు’ అని ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ నెత్తురు చుక్కలు రాలినా, ఎక్కడ చెమట బిందువులను గుర్తించక పోయినా అక్కడ కవిత్వమై మొలకెత్తుతారు. అసలుసిసలైన ప్రజా కవులు ఎప్పటికీ సంతృప్తి చెందరని, ప్రజా పోరాటాల్లో లేదా పోరాటాలే లేని స్తబ్ద కాలంలో పిడికిట్లో కలాలు పట్టుకొని ప్రజా క్షేత్రంలో నిలబడాలని నిరూపించిన కవి. రెక్కలు విరిచి జైళ్లో పెట్టి కుళ్లబొడిచిన ఎమర్జెన్సీ రోజుల నుంచి, పగిలిన అద్దంలా పొక్కిలి పొక్కిలైన పల్లె ముఖ చిత్రం మీది నుంచి, ఉద్యమాల ‘ఉడుకు’కు మనసు మూలల నుంచి చిప్పిల్లిన నెత్తుటి ధారల నుంచి, ప్రాంతీయ ముద్రతో ఆధిపత్యాలను ప్రశ్నించిన మొండితనం నుంచి, ఒక కల సాకారం అయినా ఆశించిన ఫలాలు చేరుకోవాల్సిన చోటికి చేరుకోలేనితనాన్ని నిలదీసే తనం నుంచి జూకంటిది ఎడతెగని ప్రయాణం. తనను తాను సముదాయించుకునేదాకా, తనను తాను సర్దుబాటు చేసుకునే దాక జూకంటి నిద్రపోరు. ఏ రోజుకారోజు వర్తమానంలో జరుగుతున్న విద్రోహాన్ని అక్షరాల్లోకి తర్జుమా చేస్తున్న అచ్చమైన ప్రాదేశిక కవి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News