Wednesday, May 1, 2024

ఎసిబి వలలో సర్వే అధికారితో పాటు ఇద్దరు ఉద్యోగులు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : తన భూమికి హద్దులు గుర్తించాలని వెళ్లిన రైతు నుంచి లంచం తీసుకుంటున్న సర్వే అధికారితో పాటు ఇద్దరు ఉద్యోగులను ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి డిఎస్పి ఆనంద్ కథనం ప్రకారం… మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామానికి చెందిన దుగ్గాను రాజేందర్ 5 గుంటల భూమికి సంబంధించి సరిహద్దు సర్టిఫికెట్‌తో పాటు లొకేషన్ స్కెచ్ రిపోర్టు, మ్యాప్ కోసం జిల్లా కేంద్రంలో ల్యాండ్ సర్వే డిపార్ట్‌మెంట్‌కు వచ్చాడు.

అసిస్టెండ్ డైరెక్టర్ శ్యాం సుందర్ రెడ్డిని కలిసి విన్నవించాడు. కాగా, ఆ సర్టిఫికెట్ జారీ చేయడానికి సదరు ఏడి లంచం డిమాండ్ చేశారు.10 వేల రూపాయలకు ఒప్పందం చేసుకున్నాడు. అలాగే ఫైల్ సిద్దం చేయడానికి అదే ఆఫీసులో సూపరిండెంట్‌తో పాటు క్లర్క్‌కు సైతం డబ్బులు ఇవ్వడానికి అంగీక రించాడు. రాజేందర్ నేరుగా ఎసిబి అధికారులను సంప్రదించి ఉచితంగా ఇవ్వాల్సిన సర్టిఫికెట్ కోసం డబ్బులు అడుగుతున్నారని చెప్పారు.

వారు వేసిన పథకం ప్రకారం రాజేందర్ బుధవారం ఆ డబ్బు తీసుకుని కొత్త కలెక్టరేట్‌లో సర్వే ల్యాండ్ రికార్డు కార్యా లయానికి వచ్చాడు. మొదట సూపరింటిండెంట్ వెంకటేష్‌కు రూ. 3 వేలు, క్లర్క్ రహీంకు రెండు వేలు ఇచ్చాడు. అక్కడి నుంచి ఏడి ఛాంబర్‌కు వెళ్లి రూ. 10 వేలు ఇచ్చాడు. అప్పటికే మాటు వేసి ఉన్న ఎసిబి అధికారులు వెంటనే రంగంలోకి దిగి రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. వారి నుంచి లంచం సొమ్ము రికవరీ చేసిన అధికారులు ముగ్గురిని కరీంనగర్ ఎసిబి కోర్టులో హాజరు పరిచారు. కొత్త కలెక్టరేట్‌లో మొదటి ఎసిబి ట్రాప్ ఎట్టకేలకు బుధవారం నమోదైంది.

సర్వే విభాగంకు చెందిన అధికారితో పాటు ఇద్దరిని లంచం తీసుకుంటుండగా, ఎసిబి అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ట్రాప్ జరిగే సమయంలో కలెక్టర్ ఛాంబర్‌లో లేరు. అదనపు కలెక్టర్ ఒక్కరే ఉన్నారు. ఎసిబి అధికారుల మెరపు దాడి చేసి జిల్లాస్థాయి అధికారిని పట్టుకోవడంతో ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. కలెక్టరేట్‌లో కలకలం సృష్టించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News