Wednesday, May 1, 2024

రాష్ట్రంలో నీటి భద్రతకు స్థిరమైన పరిష్కారం చూపించాం.. జల విప్లవాన్ని సాధించాం

- Advertisement -
- Advertisement -

Achieved water revolution inTelangana

 

నీటి భద్రతకు స్థిరమైన పరిష్కారం చూపించాం
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఆరేళ్ల కాలంలోనే జల విప్లవాన్ని సాధించామని, నీటి భద్రతకు స్థిరమైన పరిష్కారం చూపామని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం కాన్ఫిడిరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) ‘ వాటర్ సెక్యూరిటీ త్రూ సస్టేనేబుల్ సొల్యూషన్స్‘ అనే అంశంపై నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల వర్చువల్ కాన్ఫరెన్స్‌లో వినోద్ కుమార్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో స్వరాష్ట్ర సాధన కోసం సాగిన తెలంగాణ ఉద్యమం, ఏర్పడిన కొత్త రాష్ట్రంలో ఆరేళ్ళ కాలంలోనే నీటి పారుదల రంగంలో సాధించిన విప్లవాత్మక విజయాలపై ఈ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో వినోద్ కుమార్ సవివరంగా నివేదికను సమర్పించారు.

సాగు నీరు, తద్వారా వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా ఆయన వివరించారు. నూతన రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రణాళికా బద్ధంగా కార్యాచరణను రూపొందించి పకడ్బందీగా అమలు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం సుసంపన్నంగా, సస్యశ్యామలంగా మారిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఆరేళ్ల కాలంలోనే పలు రంగాల్లో.. ముఖ్యంగా నీటి పారుదల విభాగంలో యావత్ దేశానికి తెలంగాణ రాష్ట్రం మార్గదర్శకంగా నిలిచిందని ఆయన తెలిపారు. నీటి పారుదల రంగంలో అపార ప్రగతిని సాధించినట్లు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News