Sunday, April 28, 2024

‘జై సింగరేణి’ గీతాన్ని ఆలపించిన బాలు

- Advertisement -
- Advertisement -
SP Balu who sang the song Jai Singareni

 

గత 17 సంవత్సరాలుగా స్ఫూర్తి నింపుతున్న ‘జై సింగరేణి గీతం’
 సింగరేణి రింగ్ టోన్ గా కూడా కొనసాగుతున్న ఈ గీతం

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్‌పి. బాలసుబ్రహ్మాణ్యం మరణం సింగరేణీయులను కూడా బాధకు గురి చేస్తోంది. నేపథ్య గాయకుడిగా ఎంతో బిజీగా ఉన్న కాలంలోనే ఆయన ‘జై సింగరేణి జై సింగరేణి, జై సిరులవేణి, జై కల్పవల్లి, జైజై కన్నతల్లి’ అనే స్ఫూర్తిదాయకమైన గీతాన్ని సింగరేణీయుల కోసం పాడారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవాల ప్రారంభం సందర్భంగా సింగరేణికి ఒక గీతం ఉండాలని, అది సింగరేణి వర్తమాన భూత భవిష్యత్ కాలాల గురించి వివరిస్తూ స్ఫూర్తి దాయకంగా ఉండాలని దానిని .బాలసుబ్రహ్మాణ్యం పాడించాలని అప్పడి సిఎండి ఆర్.హెచ్.ఖ్వాజా సూచింటారు. వెంటనే నాటి ఇడి మార్కెటింగ్, పిఆర్ టిఆర్‌కె.రావు, డైరెక్టర్లు తరణికంటి శ్రీరామ్, దత్తాత్రేయులు, ప్రస్తుత డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్.చంద్రశేఖర్ నేతృత్వంలో ఈ పాటకు అంకురార్పణ జరిగింది. కవి, గాయకుడు, కమ్యూనికేషన్ ఆఫీసర్ గణాశంకర్ పూజారి సింగరేణి గీతాన్ని 4 చరణాలతో ఎంతో భావగర్షితంగా రచించి, స్వరపరచారు. దీనిని బాలుతో 2003 డిసెంబర్ 18వ తేదీన హైదరాబాద్‌లోనికీర్తన స్టూడియోలో రికార్డు చేయడం జరిగింది. ఆయనతో పాటు ప్రముఖ గాయని ఉషా కూడా పాడారు.

అప్పట్లో చాలా బిజీగా ఉన్న బాలు ‘సింగరేణి గీతం’ అవశ్యకత ఏమిటని అడగగా, సింగరేణి కార్మికులు కృషితో బొగ్గు ఉత్పత్తి, తద్వారా రాష్ట్రానికి, దేశానికి ప్రగతి వెలుగు చేకూరుతున్నాయనీ, ప్రాణాలకు తెగించి సింగరేణీయులు పనిచేస్తుంటారని వివరించారు. అలాగే సింగరేణిని కార్మికులు తల్లిగా భావిస్తుంటారనీ, ఆ తల్లిని కీర్తిస్తూ మరింత స్ఫూర్తిని, ఉత్తేజాన్ని పొందడానికి ఈ పాటను రూపొందిస్తున్నామనీ, ఇది 50 గనుల్లో సింగరేణి ఉత్సవాల్లో, కార్యక్రమాల్లో మారుమోగుతూ ఉంటుందని వివరించగా ఆయన వెంటనే పాడటానికి ఒప్పుకున్నారు. పైగా ఆయన తీసుకొంటున్న పారితోషికంలో సగం మాత్రమే తీసుకొంటానని చెప్పారు. మద్రాసులో బిజీగా ఉన్నానని, హైద్రాబాద్ వచ్చినప్పుడు పాడతానని అన్నారు. డిసెంబర్ లో ఆయన హైదరాబాద్‌గా వచ్చినప్పుడు బిజీగా ఉన్నప్పటికీ ఆయన తన జన్మదినం రోజున సింగరేణి పాటకోసం వీలు చూసుకొని వచ్చి పాడారు. బాలు కార్యక్రమాలకు ఫ్లూట్ వాయించే రవిశంకర్ సంగీత సహకారం అందించగా అమీర్ పేట్ లోని కీర్తన స్టూడియో లో రికార్డింగ్ జరిగింది.

కేవలం గంట సమయంలోనే పాటమొత్తం పూర్తి చేసిన బాలసుబ్రహ్మాణ్యం రచయిత, స్వరకర్త గణాశంకర్‌ను భుజంతట్టి అభినందించారు. దేశం కోసం శ్రమపడే సింగరేణి కార్మికుల కోసం నేను పాట పాడటం తనకెంతో ఆనందంగా ఉందని, సింగరేణీయులు రక్షణతో, క్రమశిక్షణతో పనిచేయాలని శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.

ఈ పాటను 2003 డిసెంబర్ 23వ తేదీన సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొత్తగూడెంలో సింగరేణి సిఎండి ఆర్.హెచ్.ఖ్వాజా కార్మికుల మధ్య విడుదల చేశారు. సింగరేణి ఉనికి, సింగరేణి బొగ్గుతో జాతికి కలిగే మేలు, కష్టాల నుండి సమిష్టి కృషితో బయటపడిన స్ఫూర్తి, రానున్న కాలంలో రక్షణతో సాధించాల్సిన విజయాలపై 4 చరణాలతో సాగే ఈ పాట ఎంతో ఉత్తేజభరితంగా, రోమాంచితంగా ఉండి, అందరి హృదయాలను దోచుకొంది. ఈ పాటను నాటి యాజమాన్యం వారు ‘సింగరేణి గీతం’గా గుర్తించి ప్రకటించారు. ప్రతి ఉత్సవంలో, సింగరేణి రన్ లో ఈ పాట మంచి స్ఫూర్తిని కలిగిస్తూ వస్తోంది. కాగా ఇదే పాటలోని పల్లవిని సింగరేణి గ్రూపు మోబైల్ ఫోన్స్‌కు రింగ్ టోన్ గా కూడా యాజమాన్యం ఏర్పాటు చేసింది.

దీనిపై పాట రచయిత, స్వరకర్త, గణాశంకర్ పూజారి (కమ్యూనికేషన్ ఆఫీసర్) మాట్లాడుతూ, బాలు పాడిన ఈ పాట రెండు దశాబ్దాల కాలం అయినా సరే ఇప్పటికీ గొప్ప స్ఫూర్తిదాయక గీతంగానే ఉంటోందన్నారు. ఆయన గొంతులో ఉన్న గాంభీర్యం, ఉత్తేజం, ఉత్సాహం, మాధుర్యం ఆ పాటను అజరామరం చేశాయన్నారు. ఒక పరిశ్రమకోసం బాలు పాట పాడటం ఇదే ప్రథమం అని తెలిసి మరింత ఆనందం కలిగిందన్నారు. ఆయన మరణం సంగీత ప్రపంచానికే తీరనిలోటు… కానీ ఆయన పాడిన వేలాది పాటల్లో ఆయన ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారన్నారు. ముఖ్యంగా సింగరేణి కార్మికుల హృదయాల్లో ఈ పాట ద్వారా ఆయన శాశ్వతంగా నిలిచి ఉంటారని వ్యాఖ్యానించారు. తాను రాసిన పాటను బాలు వంటి మహా గాయకుడు పాడటంతో జన్మ ధన్యమైందని భావిస్తున్నానని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News