Monday, April 29, 2024

అవినీతిపరులు లూటీ సొమ్ము కక్కాల్సిందే: పిఎం మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష పార్టీల నాయకులపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశాన్ని లూటీ చేసిన వారు ఎవరైనా మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. సోమవారం లోక్‌సభ సమావేశాలలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని ప్రసంగిస్తూ అవినీతికి పాల్పడిన రాజకీయ నేతలు తగిన మూల్యం చెల్లించక తప్పదని, ఇందుకు తాజా ఉదాహరణ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అంటూ వ్యాఖ్యానించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి దర్యాప్తు సంస్థలు అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులను వదిలిపెట్టబోవని ఆయన చెప్పారు. నాయకుల అవినీతిపై దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటే దానిపై ఆగ్రహం వ్యక్తమవ్వడం విచిత్రంగా ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు. పదేళ్ల క్రితం వరకు పార్లమెంట్‌లో కుంభకోణాలపై చర్చలు జరిగేవని, ప్రతిసారి చర్యల కోసం పార్లమెంట్ పట్టుపట్టేదని ఆయన గుర్తు చేశారు. కాని ఇప్పుడు అవినీతిపై చర్యలు తీసుకుంటే కొందరు వ్యతిరేకిస్తున్నారని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

ప్రత్యర్థులను లక్షంగా చేసుకుని దర్యాప్తు సంస్థల చేత బిజెపి దాడులు చేయిస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణలను ప్రధాని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఎ హయాంలో దర్యాప్తు సంస్థలను రాజకీయ అవసరాల కోసమే వాడుకున్నదని విమర్శించారు. పిఎంఎల్‌ఎ చట్టం కింద గతంతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రూ. 5,000 కోట్ల ఆస్తులను ఇడి జప్తు చేయగా తమ హయాంలో రూ. 1 లక్ష కోట్ల ఆస్తులను ఇడి స్వాధీనం చేసుకుందని ఆయన వివరించారు. మీరు దోచుకున్న అవినీతి సొమ్మును వాపసు చేయాల్సిందేనని, దేశాన్ని మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమంటూ అవినీతి నేతలనుద్దేశించి ప్రధాని హెచ్చరించారు. తమ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చాక దేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఇది మోడీ ఇస్తున్న గ్యారంటీ అని ప్రధాని ప్రకటించారు. 2022లో బరిటన్‌ను అధిగమించి ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఆవిర్భవించిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం దేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉందని, దేశం పయనిస్తున్న వేగాన్ని చూస్తే అతి త్వరలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారడం ఖాయమని ఆయన అన్నారు.

2014లో తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేపెడుతూ అప్పటి ఆర్థిక మంత్రి మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలంటే దేశానికి మరో దశాబ్దాలు(2044 నాటికి) పడుతుందని చెప్పారని, కనీసం పెద్ద కలలను కూడా కనడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాదని ప్రధాని విమర్శించారు. వారి ఆలోచనలకు తాను జాలిపడుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. వెనుకడిన కులాలకు అప్పటి యుపిఎ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేశాయని ఆయన ఆరోపించారు. వెనుకబడిన తరగతులకు చెందిన నాయకులను అవి అవమానించాయని ఆయన అన్నారు. ప్రభుత్వంలో ఎంతమంది ఓబిసిలు ఉన్నారోనని కాంగ్రెస్ ఒకపక్క లెక్కపెట్టుకుంటూ అతిపెద్ద ఓబిసిని చూచలేకపోయానని తన గురించి చెప్పుకుంటూ మోడీ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News