Saturday, April 27, 2024

కార్యకర్తలే కథానాయకులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  కెసిఆర్‌పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉంద ని, కాంగ్రెస్‌కు ఇప్పటికే అనేక వర్గాలు దూరం అయ్యాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టిఆర్ తెలిపారు. ఈ పరిస్థితిని పార్లమెంట్ ఎ న్నికల్లో సానుకూలంగా మలచుకోవాలని బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నల్గొండ లోక్‌సభ సన్నాహక సమావేశంలో కె టిఆర్ ప్రసంగించారు. తెలంగాణ భవన్‌లో సో మవారం నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశానికి బిఆర్‌ఎస్ అగ్రనాయకులు హరీశ్ రావు, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, నాయకులు బడుగుల లింగయ్య యాదవ్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి కెటిఆర్ ప్రసంగించారు. జనవరి 3వ తేదీన ఆదిలాబాద్‌తో ప్రారంభమైన లోక్‌సభ సన్నాహక సమావేశాలు సోమవారంతో ముగిసాయని వెల్లడించారు. బిఆర్‌ఎస్ లోక్‌సభ సన్నాహాక సమావేశాల తీరు చూస్తే కార్యకర్తలే పార్టీకి ధైర్యం చెప్పారని వివరించారు. కార్యకర్తల వల్లనే ఇన్నేళ్లు పార్టీ బలంగా ఉందని, బిఆర్‌ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులని కెటిఆర్ అన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజక వర్గాల సమీక్షలు మొదలవుతాయని వెల్లడించారు.
కెసిఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి
సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టలేకపోయామని కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్ అభూత కల్పనలు, అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. తాము ఇంకా మాట్లాడటం మొదలు పెట్టనే లేదు…దీనికే కాంగ్రెస్ వాళ్లు ఉలికి పడుతున్నారని పేర్కొన్నారు. కెసిఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవాలని అన్నారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు కూడా అనుకోలేదని, అందుకే ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారని కెటిఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ రెడ్డి అడ్డమైన మాటలు చెప్పారని మండిపడ్డారు. హామీలకు కాంగ్రెస్ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆక్షేపించారు. గ్యారెంటీలు అమలు అయ్యేంత వరకు వదిలేది లేదని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత నవంబర్‌లోనే కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారని గుర్తు చేశారు. నల్గొండ ప్రజలు బిల్లులు కట్టకుండా కోమటిరెడ్డికే పంపాలని సూచించారు. కోమటి రెడ్డి గత నవంబర్‌లోనే కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారన్నారు. నల్లగొండ ప్రజలు బిల్లులు కట్టకుండా కోమటి రెడ్డికే పంపించాలన్నారు.
కాంగ్రెస్ తెలంగాణ జుట్టును కేంద్రం చేతిలో పెడుతోంది
సాగర్ ఆయకట్టుకు కాంగ్రెస్ పాలనలో మొదటిసారి క్రాప్ హాలీడే ప్రకటించే దుస్థితి దాపురించిందని కెటిఆర్ మండిపడ్డారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి తెలంగాణ జుట్టును కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం చేతిలో పెడుతోందని ఆరోపించారు. శ్రీరాంసాగర్ చివరి ఆయకట్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయని తెలిపారు. కాంగ్రెస్, బిజెపి మధ్య సంబంధం నల్లగొండ మున్సిపాలిటీ అవిశ్వాసంలో బయటపడిందని తెలిపారు. రేవంత్ భుజం మీద తుపాకీ పెట్టి ప్రధాని మోడీ బిఆర్‌ఎస్‌ను కాలుస్తారట అని పేర్కొన్నారు. మైనార్టీ సోదరులకు కాంగ్రెస్, బిజెపి సంబంధం గురించి చెప్పాలని కెటిఆర్ నేతలకు సూచించారు. అదానీని రాహుల్ గాంధీ దొంగ అన్నారని.. రేవంత్ దొర అంటున్నారని కెటిఆర్ అన్నారు.
సమష్టిగా పనిచేసి నల్గొండ లోక్‌సభ స్థానాన్ని గెలుద్దాం
నల్లగొండలో ఎన్నికల ప్రచార సరళి మనకు అనుకూలంగా ఉన్నట్టే అనిపించిందని కెటిఆర్ అన్నారు. ఎక్కడా ఓటమిపై అనుమానాలు రాలేదని, ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చాయని చెప్పారు. సూర్యాపేటలో మాత్రమే గెలిచామని, పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నారు. ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి నల్గొండ లోక్‌సభ స్థానాన్ని గెలుద్దామని కెటిఆర్ అన్నారు.
ప్రచారంలో అబద్దం .. పాలనలో అసహనం.. ఇదే కాంగ్రెస్ తీరు : హరీశ్‌రావు
ప్రచారంలో అబద్దం..పాలనలో అసహనం ..ఇదే కాంగ్రెస్ తీరు అని బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ఎండ్రి కాయల పార్టీ అని..ఒకరి కాలు ఇంకొకరు పట్టి లాగుతుంటారని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు గోబెల్స్‌ను మించి దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ తీరు ప్రజలకు అర్థమైందని, ఇక్కడ కూడా అర్థమవుతుందని చెప్పారు. కెసిఆర్ మాటిస్తే తప్ప లేదు అని, కాంగ్రెస్‌ది ఇచ్చే గుణం కాదు…ఎగవేసే గుణమని మండిపడ్డారు. 6 గ్యారంటీల్లోని 13 హామీలను కాంగ్రెస్ మరో ఇరవై రోజుల్లో నెరవేర్చాలని, 20 రోజుల్లో నెరవేర్చకపోతే పార్లమెంటుట్ ఎన్నికల కోడ్ వచ్చేస్తుందని అన్నారు. కోమటి రెడ్డి బిఆర్‌ఎస్‌ను ముక్కలు చేస్తామనడం కాదు..కృష్ణా రివర్ బోర్డులో చేరెందుకు రెండు నెలల్లోనే ఈ ప్రభుత్వం సంతకం పెట్టిందని, సంతకం పెట్టిన సిఎంను కోమటిరెడ్డి నిలదీయాలని అన్నారు. నల్లగొండకు సాగు, తాగు నీళ్ల కటకట గురించి కోమటి రెడ్డి మాట్లాడాలని డిమాండ్ చేశారు. రైతుబంధు గురించి మాట్లాడితే ఓ మహిళా మంత్రి అసహానంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కెసిఆర్ హయాంలో ఎస్‌ఆస్‌ఎస్‌పి చివరి ఆయకట్టు దాకా నీళ్లిచ్చామని, ఇపుడు కాళేశ్వరం నీళ్లు వాడుకునే అవకాశం ఉన్నా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని అన్నారు.కాంగ్రెస్ మెడలు వంచాలంటే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలవాలని చెప్పారు. కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కు రాజకీయాలను ఎండగడుదామని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News