Saturday, April 27, 2024

వ్యవసాయ సంస్కరణలు దేని కోసం?

- Advertisement -
- Advertisement -

Agricultural reforms for what

 

ఒకే దేశం ఒకే మార్కెట్ అంటూ కేంద్రం తెచ్చిన సంస్కరణ రైతులకు, వినియోగదారులకు లాభమా ! నష్టమా అనే చర్చ జరుగుతుంది. రైతు సంఘాలు, వ్యవసాయ రంగ నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒకే దేశం ఒకే పన్ను విధానం ఉంది. ఒకే దేశం ఒకే భాష తెచ్చే ప్రయత్నం జరిగింది. కానీ వ్యతిరేకత రావడంతో వాయిదా వేశారు. కామన్ సివిల్ కోడ్ ఎజండాలో ఉంది. ఒకే దేశం ఒకే విద్యుత్ విధానం తెచ్చేందుకు చట్ట సవరణ చేస్తున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక(జమిలి) ఉండాలనే చర్చకు తెరలేపారు. ఏదైనా దేశ వ్యాప్తంగా ఒకటే విధానం ఉండాలి అనేది మోడీ సర్కార్ ఆలోచనగా ఉంది. అందుకు అనుగుణంగానే చట్టాల్లో మార్పులు చేస్తున్నారు. ఈ విధానాలను చూస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి పాలన వికేంద్రీకరణ ఇష్టం లేదనిపిస్తుంది. అందుకే కేంద్రీకరణ పాలన వైపు అడుగులు వేస్తుంది.

రైతులు ఎక్కడైనా తమ పంటలు అమ్ముకోవచ్చు అని చెప్పడం వినడానికి బాగుంది. కానీ ఆచరణలో అన్నదాతకు అన్యాయం జరగడం ఖాయం. బలవంతుడిని, బలహీనుడిని సమానం చేసి ఇద్దరికీ పోటీ పెట్టడం లాంటిది. ఆటలో బలవంతుడే గెలుస్తాడు తప్ప బలహీనుడు గెలవాడు. వెనుకబడిన వారిని అభివృద్ధి చెందిన వారిని ఒకలాగా చూడడం అశాస్త్రీయమైనది. అలాగే పన్నులు కట్టే రాష్ట్రాలను, కట్టని రాష్ట్రాలను ఒకేలా చూస్తే ఎలా ఉంటుంది. నేను పొట్టు తెస్తా… నువ్వు గింజలు తీసుకొనిరా… కలిపి ఊదుకొని చెరి సగం తిందాం అన్నట్లు ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలనే ఆలోచన వెనుక రాజకీయ లక్ష్యం ఏదైనా ఉందా… అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అందరూ సమానమే అనే పేరుతో బలహీనులకు, వెనుకబడిన వారికి, మైనారిటీలకు అన్యాయం చేసే ఉద్దేశం ఏదో ఉందనిపిస్తుంది.

ఒకే దేశం ఒకే మార్కెట్‌తో 6 దశాబ్దాల బంధనాల నుంచి రైతులకు విముక్తి కలిగించినట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. కానీ అది నిజం కాదు. ఆరు దశాబ్దాలుగా రైతులకు ఉన్న రక్షణను తొలిగించి…కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చారు. కోల్ స్టోరేజ్‌లను, గోదాముల నిర్మాణం చేసుకుని ఎంత సరుకైనా బడా వ్యాపారులు నిల్వ చేసుకునే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇది రైతులకు ప్రయోజనం చేకూర్చేది ఎలా అవుతుంది? మన దేశంలో చిన్న కమతాలు ఎక్కువ. చిన్న సన్న కారు రైతులు ఎక్కువగా ఉన్నారు. అమలులో ఉన్న ఈ-నామ్ మార్కెట్ విధానం విఫలమైందని మోడీ చెప్పడం విశేషం. రైతులు ఇప్పటికీ తమ ఉత్పత్తులను నేరుగా అమ్ముకుంటున్నారు. ప్రాసెసింగ్ చేసి అమ్ముకునే పరిస్థితిలో వారులేరు. వాళ్లకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లేవు. అందువల్ల ముడి సరుకునే అమ్ముకుంటారు. తమ పంటలను ఎక్కువ దూరం తీసుకెళ్లి అమ్ముకునే పరిస్థితిలో వారు లేరు. అందుకే రైతులకు అందుబాటులో ఉండేలా వ్యవసాయ మార్కెట్లను ఏర్పాటు చేశారు. అక్కడ వారికి అన్ని రకాలుగా రక్షణ ఉంటుంది.

అన్నదాతకు అండగా ఉండే మార్కెట్ల వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ పైగా దశాబ్దాల బంధనాల నుండి వారిని విముక్తి చేస్తున్నానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే అది రైతుకు ఎలా మేలు చేస్తుందో అర్ధం కావడం లేదు. చిన్న, సన్నకారు రైతులకు సుదూరం వెళ్లి తమ పంటలను అమ్ముకునే శక్తి ఉండదు. ప్రభుత్వ మార్కెట్‌లో కాకుండా బయట అమ్ముకోవడం అంటే రైతులు నష్టపోవడమే. అక్కడ ధర నిర్ణయించేది వ్యాపారస్థులు. తూకం, చెల్లింపుల పై నియంత్రణ ఉండదు. ఎవరు ఎక్కడైనా అమ్ముకోవచ్చని తాజా కేంద్రం నిర్ణయంతో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు రంగంలోకి ఆదానీ, బేయర్, ఐటిసి, బిర్లా, టాటా రిలయన్స్ లాంటి బడా కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాయి. ఎగుమతులు దిగుమతులు వారే చేస్తారు. వారే కోల్ స్టోరేజ్‌లు గోదాములు నిర్మాణం చేసి అధిక ధరలకు అమ్ముకొని భారీ ఎత్తున్న లాభాలు సంపాదించడానికి కేంద్రం అనుమతి ఇచ్చినట్లైంది. ఇది ఏ రకంగా కూడా రైతులకు మేలు చేసేది కాదు. పైగా రైతులకున్న కొద్దిపాటి మార్కెట్ రక్షణను కూడా లేకుండా చేయడమే అవుతుంది. అంతేకాదు ఇప్పటి దాకా ఆయా మార్కెట్లలో ఉన్న చిన్న చిన్న వ్యాపారస్థులు (కమీషన్ దార్లు) భవిష్యత్తులో కార్పొరేట్ సంస్థలలో గుమాస్తాలుగా చేరడం ఖాయం.

పంట దిగుబడికి ముందే రైతులు కార్పొరేట్ సంస్థలతో విక్రయ ఒప్పందం చేసుకోవచ్చు. దానికి చట్టబద్ధత ఉంటుంది అని ప్రధాని మోడీ ప్రకటించడమంటే కార్పొరేట్ సంస్థలకు రైతులను బహిరంగంగానే బలివ్వడమే అవుతుంది. పంట పెట్టుబడి పెట్టే వ్యాపారస్థుడికే ధర నిర్ణయించే పరిస్థితి ఉంటుంది. వ్యవసాయానికి పెట్టుబడి పెట్టినవాడికే రైతు చచ్చినట్లు తన పంటను అమ్మాలి. ఇదేనా దశాబ్దాలుగా ఉన్న బంధనాలను తొలిగించడమంటే. కార్పొరేట్ సంస్థలు జిల్లాకు జిల్లాలే రైతులకు పెట్టుబడి పెడతాయి. వారి ఉత్పత్తులన్నీ అవే కొంటాయి. అవసరమైన శీతల గిడ్డంగులను, గోదాములను నిర్మించి నిల్వలు ఉంచుతాయి. ఫుడ్ ప్రాసెసింగ్ చేసి అధిక ధరలకు వినియోగదారుడికి విక్రయిస్తాయి. వారు అధిక ధరలకు అమ్ముకునే విధంగా నిత్యావసర చట్టాన్ని కూడా సవరించారు.

ఇది దుర్మార్గమైన నిర్ణయం. నూనె గింజలు, పప్పులు, ధాన్యాలు, ఉల్లి గడ్డలు, ఆలు గడ్డల పంటలను నిత్యావసర చట్టం నుండి తొలిగించారు. ఈ చట్టంలో ఉన్న సరుకులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నియంత్రణ ఉంటుంది. ధరలు నిర్ణయించడం, నిలువలను క్రమబద్ధీకరించడం, ఎగుమతి దిగుమతులను క్రమబద్ధీకరించడం, బ్లాక్ మార్కెట్ జరగకుండా వినియోగదారులకు సరసమైన ధరలకు నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచుతుంది. కానీ ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ధరలు ఆకాశాన్ని అంటడం గ్యారంటీ. బ్లాక్ మార్కెటింగ్ పెరుగుతుంది. కార్పొరేట్ సంస్థలు నిత్యావసరాల ధరలను నిర్ణయిస్తాయి. అటు రైతు పంటలకు ధర వాళ్ళే నిర్ణయిస్తారు … ఇటు వినియోగదారుడికి అమ్మే సరుకు ధరను కూడా వాళ్ళే నిర్ణయిస్తారు.

ఒకే దేశం ఒకే మార్కెట్ అంటే ఇదేనా… మోడీ ప్రభుత్వం 14 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించి రైతులకు మేలు చేసినట్లు చెబుతూనే మరోవైపు ఒకే మార్కెట్ విధానం పేరుతో నిత్యావసర సరుకుల చట్ట సవరణ పేరుతో రైతులకు వినియోగదారులను చావు దెబ్బ తీసింది. మద్దతు ధర ప్రకటించి మార్కెట్ వ్యవస్థను పథకం ప్రకారం నిర్వీర్యం చేసింది. ఇప్పటికే ఏటా 3 లక్షల కోట్లు వ్యవసాయ రంగం ద్వారా పారిశ్రామిక వేత్తలు లాభాలు తరలించుకొని పోతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ విధానాల వలన ప్రతి సంవత్సరం 13 రాష్ట్రాలలో 12 వేల 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలో 32 కోట్ల ఎకరాలలో సాగు చేస్తూ సుమారు 26 కోట్ల ఆహార ధాన్యాలు, అలాగే 6.5 కోట్ల ఎకరాలలో హార్టీకల్చర్ సాగు ద్వారా 32 కోట్ల పండ్లు కూరగాయలు ఉత్పత్తి చేస్తున్నారు.

తెలంగాణ గణాంకాలు చూస్తే యాసంగి, వానాకాలం కలిపి 162 లక్షల ఎకరాలలో సాగు చేస్తూ 180 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పండిస్తున్నారు. 12 లక్షల ఎకరాలలో 72 లక్షల టన్నుల ఉద్యానవన ఉత్పత్తులు చేస్తున్నారు. ఇందులో 26 లక్షల టన్నుల పండ్లు, 30 లక్షల టన్నుల కూరగాయలు పండిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ సిఎం కెసిఆర్ నియంత్రిత సాగు విధానం తెస్తున్నారు. ఎగుమతులు చేసే స్థాయికి రైతులు ఎదగాలని అందుకు అవసరమైన శీతల గిడ్డంగులను, గోదాముల నిర్మించాలని నిర్ణయించారు. రైతులకు అన్ని రకాలుగా ఆదుకునేందుకు వ్యవసాయ శాఖతో పాటు రైతు సమన్వయ సమితి ద్వారా చర్యలు చేపట్టారు. దేశంలోనే వ్యవసాయ రంగంలో తెలంగాణ నెంబర్ వన్ పొజిషన్‌లో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ రంగంలో తెలంగాణ దూసుకొని పోతుంది. రైతు ఆర్ధికంగా బలపడాలని కెసిఆర్ ప్రయత్నిస్తుంటే… మోడీ సర్కారు మాత్రం వ్యవసాయ రంగంలో కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున లాభపడే విధంగా సంస్కరణలు తెచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News