Wednesday, May 1, 2024

శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్.. ఎయిర్ ఏషియాకు తప్పిన ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: జైపూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఎయిర్ ఏషియాకు చెందిన విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం మధ్యాహ్నం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఎయిర్ ఏషియా విమాన పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో విమానంలో 76 మంది ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. పైలట్ ఎటిసి ద్వారా అధికారులను అప్రమత్తం చేయడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈక్రమంలో ఎయిర్‌పోర్ట్‌లో ఇతర సేవలన్నింటినీ నిలిపివేయడంతో పాటు సురక్షితంగా ల్యాండింగ్ అయ్యేందుకు ఎమర్జెన్సీ సేవలను అప్రమత్తం చేశారు. జైపూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఏషియాకు చెందిన ఎ-320 విమానానికి చెందిన ఒక ఇంజిన్‌లో ఫ్యూయల్ లీకేజీని పైలట్ ముందుగానే గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ ఇంజిన్ నిలిపివేసి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

ఎ-320 విమానంలో సాంకేతిక లోపంపై స్పందించిన ఎయర్ ఏషియా పైలట్ నేర్పుగా వ్యవహరించడంతో విమానం సురక్షితంగా గమ్యం చేరిందని తెలిపింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తిన అంశంపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఎవియేషన్(డిజిసిఎ) విచారణకు సహకరిస్తామని తెలిపింది. ప్రయాణికుల భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. సుశిక్షితులైన తమ పైలట్లు ఇలాంటి పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోగలరని పేర్కొంది. ఇదిలావుండగా శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ విధించడం చాలా అరుదైన సందర్భమని ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులు మీడియాకు తెలిపారు.

Air Asia Flight Emergency Landing in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News