Friday, April 26, 2024

ఇండస్ట్రీ బెస్ట్ సినిమాల్లో ‘అల వైకుంఠపురములో’ ఒకటి

- Advertisement -
- Advertisement -

Ala vaikunta puramulo

 

అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా తాజాగా విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర బృందం హైదరాబాద్‌లో థాంక్స్‌మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ “త్రివిక్రమ్ మాకు కథ చెప్పినప్పుడు సింపుల్ కథే అనిపించింది. కానీ తన స్క్రీన్‌ప్లేతో గొప్పగా తీర్చిదిద్దారు త్రివిక్రమ్. రషెస్ చూసి బన్నీ అలవోకగా ఆ క్యారెక్టర్ చేసిన విధానానికి ఆశ్చర్యపోయా. కానీ దానివెనుక ఉన్న కృషి నాకు తెలుసు. కలెక్షన్స్ పరంగా చూస్తే బన్నీ బెస్ట్, త్రివిక్రం బెస్ట్ మాత్రమే కాదు… ఇండస్ట్రీ బెస్ట్ సినిమాల్లో ‘అల వైకుంఠపురములో’ ఒకటవుతుందని చెప్పగలను”అని పేర్కొన్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ “డైరెక్టర్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ. అలాంటి మా అందరికీ లైఫ్ ఇచ్చిన త్రివిక్రమ్‌కి థాంక్స్.

ఇది మా హ్యాట్రిక్ కాంబినేషన్. మా కలయికలో ఇది ఒక కామా మాత్రమే. మా కాంబినేషన్‌లో మరిన్ని సినిమాలు వస్తాయి. ఇక తమన్ మ్యూజిక్‌ని నేను చాలా ఇష్టపడతాను. ‘జులాయి’తో హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ మొదలైంది. ఆ తర్వాత ఈ బ్యానర్‌లో సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాలు చేశాను. ఇక పూజతో ‘డీజే’ చిత్రం చేసేప్పుడు ఈ అమ్మాయి చాలా బాగా చేస్తోంది… ఆమెతో ఇంకో సినిమా చేస్తే బాగుంటుందని అనుకున్నా. ఆమెతో ఈ సినిమా చేశాక మరోసారి రిపీట్ చేసినా తప్పులేదనిపించింది”అని అన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ “సినిమాలో చున్నీ ఫైట్‌తోటే షూటింగ్ మొదలుపెట్టాం. అలా రామ్,-లక్ష్మణ్ మాస్టర్స్‌తో సినిమా మొదలుపెట్టాను. వాళ్లతో ప్రయాణం నాకొక తాత్విక ప్రయాణం. ఈ సినిమాకు సంబంధించి రెండు విషయాలు దాచాను. ’సిత్తరాల సిరపడు’ అనే శ్రీకాకుళం యాసతో నడిచే ఒక పాటని రామ్ -లక్ష్మణ్ మాస్టర్లతో కొరియోగ్రఫీ చేయించాను. దానికి వాళ్లు ఫైట్ చెయ్యలేదు.

అందులోని ప్రతి లిరిక్‌ని అర్థం చేసుకొని ఒక కవితలాగా దాన్ని తీశారు. ఒక కొత్త ప్రయోగాన్ని నేను అనుకున్న దానికన్నా అందంగా తీశారు. ఆ పాటను ఉత్తరాంధ్ర ప్రజలకు అంకితమిస్తున్నాం. దాన్ని విజయకుమార్ రాస్తే తమన్ మంచి ట్యూన్స్ కట్టాడు. అలాగే ‘రాములో రాములా’ పాటలో బ్రహ్మానందంని ఉపయోగించుకున్నాం. మామీదున్న వాత్సల్యంతో ఆయన దాన్ని చేశారు. ఆయన సినిమాలో ఉన్న విషయాన్ని దాచిపెట్టడం చాలా కష్టమైంది. మొత్తానికి ఏనుగుకు విడుదల కలిగించాం. ఈ సినిమాకు మొదలు, చివర బన్నీనే. ఇద్దరం బాల్కనీలో ఒక బ్లాక్ కాఫీ తాగుతూ ‘అల వైకుంఠపురములో’ జర్నీ మొదలుపెట్టాం. అప్పటినుంచీ మా ఇద్దరికీ ఇదే ప్రపంచం. ఎంతో తపన ఉన్న నటుడు బన్నీ. అతను మంచి డ్యాన్సర్ అనే విషయం అందరికీ తెలుసు. అసాధారణ స్టైల్ సెన్స్ ఉన్నవాడు. మొదటి నుంచీ చివరి దాకా అతనిలోని నటుడు కనిపిస్తే ఎలా ఉంటుంది… అనే నా కోరిక ఈ సినిమాతో తీరింది”అని తెలిపారు.

పూజా హెగ్డే మాట్లాడుతూ “ఈ సినిమాతో త్రివిక్రమ్‌కి పెద్ద ఫ్యాన్ అయ్యాను. దర్శకునిగానే కాకుండా ఒక వ్యక్తిగా కూడా ఆయనకు అభిమానిగా మారాను. ఆయన గురూజీ అంతే. హారిక అండ్ హాసిని వంటి బ్యానర్‌లో రెండో సినిమా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అల్ల్లు అర్జున్‌తో నన్ను రిపీట్ చేసిన త్రివిక్రమ్‌కి థాంక్స్. ‘డీజె’ చేసినప్పటి నుంచి బన్నీకి అభిమానినయ్యాను”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సునీల్, తమన్, సుశాంత్, నవదీప్, హర్షవర్ధన్, రామ్-లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Ala vaikunta puramulo thanks meet
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News