Saturday, April 27, 2024

ప్రధాని జమిలి ఎన్నికల జపం!

- Advertisement -
- Advertisement -

All elections are at time in India

ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీల ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. రెండు దశాబ్దాల క్రితమే లా కమిషన్ ముందు కు తెచ్చిన ఈ అంశం సమాఖ్య వ్యవస్ధ, రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యతిరేకమని అనేక పార్టీలు, నిపుణులు తిరస్కరించినప్పటికీ 2014 నుంచీ ఒకే దేశం ఒకే ఎన్నికలంటూ వదలకుండా చెబుతున్నారు. నవంబరు 26వ తేదీన సభాపతుల 80 జాతీయ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ఈ ప్రతిపాదన ఆలోచన కాదు దేశానికి అవసరం అని, ప్రతి నిర్ణయం జాతీయ ప్రయోజనాల లక్ష్యంగా ఉండాలని చెప్పారు. విడివిడిగా ఎన్నికలు జరగటం వలన అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతున్నందున ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి చర్చించాలని కోరారు. చట్టసభలతో పాటు స్థానిక సంస్ధలకూ ఉపయోగపడే ఒకే ఓటర్ల జాబితా తయారు చేస్తే సమయం, నిధులు ఆదా అవుతాయన్నారు. జనం మీద రాజకీయాలే పైచేయి సాధిస్తే జాతి ప్రతికూల మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు.
నిజానికి ఇప్పుడు కావాల్సింది ఒకే సారి ఎన్నికలు కాదు. ప్రజాస్వామ్యం మరింతగా వర్ధిల్లే విధంగా, ధన ప్రలోభాలను గణనీయంగా తగ్గించి, ప్రజాభిప్రాయానికి చట్టసభల్లో తగు ప్రాతినిధ్యం లభించేందుకు ఉన్నంతలో మెరుగైన దామాషా పద్ధతి ఎన్నికల సంస్కరణలు కావాలి. ఒకేసారి ఎన్నికలు జరపాలని సూచన చేసిన పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదికలో దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్‌లను ఉదహరిస్తూ నిర్ణీత తేదీకి అక్కడ ఎన్నికలు జరుపుతారని పేర్కొన్నారు. (అమెరికా కూడా అలాంటిదే.) అయితే ఈ రెండు దేశాల్లో పార్టీల జాబితాలతో దామాషా ప్రాతిపదికన చట్టసభల్లో సీట్లు కేటాయిస్తారు. ఆ విషయం మాత్రం స్ధాయీ సంఘానికి పట్టలేదు. అమెరికాలో దేశాధ్యక్ష ఎన్నికల్లో 50 రాష్ట్రాల్లో రెండు చోట్ల తప్ప మిగిలిన చోట్ల మెజారిటీ ఓట్లు తెచ్చుకున్న పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్ట్రరల్ కాలేజీ ప్రతినిధులను మొత్తంగా కేటాయిస్తారు. అందువలన గత ఎన్నికల్లో మొత్తంగా ఓట్లు తక్కువ తెచ్చుకున్నా అధ్యక్ష పదవిని ట్రంప్ గెలిచారు. మన మాదిరి నియోజకవర్గాల ప్రాతిపదిక విధానంలో డబ్బున్న పార్టీలే ప్రాతినిధ్యం పొందగలుగుతున్నాయి. కొన్ని పార్టీలకు వచ్చిన ఓట్ల మేరకు ప్రాతినిధ్యం ఉండటం లేదు. దామాషా ప్రాతినిధ్య విధానంలో డబ్బుతో ఓట్లు కొన్నప్పటికీ అలాంటివారు ఎన్నికయ్యే అవకాశం ఉండదు కనుక ఎవరూ డబ్బు పెట్టరు, నిజమైన ప్రజాభిప్రాయం వెల్లడి కావటానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు అధికారమే పరమావధిగా ఉన్న పార్టీలు, వ్యక్తులు డబ్బున్నవారికే పెద్దపీట వేస్తూ అధికారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అందుకే దామాషా ప్రాతినిధ్యం (ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తే అన్ని సీట్లు) గురించి వామపక్షాలు తప్ప మిగిలిన పార్టీలేవీ మాట్లాడవు.
తరచూ ఎన్నికల వలన ప్రభుత్వాలు దీర్ఘకాలిక విధానాలను రూపొందించే అవకాశాలకు ఆటంకం కలుగతుందని కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో నేటి ఉపరాష్ర్టపతి ఎం వెంకయ్య నాయుడు వాదించారు. ఒకే సారి ఎన్నికలు జరిగితే ఇలాంటి అవకాశం ఉండదని చెప్పారు. ఇంకా కొందరు ఇదే విధమైన వాదనలు చేస్తున్నారు. పాలకులు మారినా లక్ష్యాల నిర్దేశం, పథకాలు కొనసాగేందుకు ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసిన పెద్దలు దీర్ఘకాలిక విధానాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం, జనాన్ని తప్పుదారి పట్టించే వ్యవహారమే.
ప్రతి దానికీ ప్రజాస్వామ్య జపం చేసే వ్యక్తులు, శక్తులూ అభివృద్ధి, ఖర్చు తగ్గించాలనే పేరుతో ప్రజాస్వామిక సూత్రాలకే విఘాతం కలిగించే ప్రతిపాదన ముందుకు తెస్తున్నారు. ఇది ఫెడరల్ సూత్రాలకు, రాజ్యాంగ మౌలిక స్వభావానికే విరుద్ధం. ఏక వ్యక్తి ఆధిపత్యానికి దారి తీస్తుంది. అందువలన ఇది ఇక్కడికే పరిమితం అవుతుందన్న హామీ ఏముంది? అసలు బిజెపి ఈ ప్రతిపాదనను పదే పదే ఎందుకు ముందుకు తెస్తున్నది? దీన్ని మూడు దశలుగా చూడాలి. ఒకటి వాజ్‌పేయి హయాం, మరొకటి రెండవ సారి బిజెపికి కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం వచ్చిన తరుణం, కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయం అని మూడు అంశాలుగా చూడాల్సి ఉంది. అటల్ బిహారీ వాజ్‌పాయి ప్రధానిగా ఉన్న 1999లో లా కమిషన్ ద్వారా ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. తరువాత యుపిఎ పాలనలో దాని ప్రస్తావన లేదు. తిరిగి నరేంద్ర మోడీ వచ్చిన తరువాత దానికి దుమ్ము దులిపారు. నీతి ఆయోగ్ ద్వారా ముందుకు తెచ్చారు. తరువాత లా కమిషన్ నిర్మాణాత్మక అవిశ్వాసం పేరుతో మరొక ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఒక ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టటానికి ముందు ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని సభ విశ్వాసం పొందాలని చెప్పారు.
ఐడిఎఫ్‌సి అనే ఒక సంస్ధ 1999 నుంచి 2014వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమాచారాన్ని విశ్లేషించింది. ఒకేసారి జరిగితే కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఓటర్లు ఒకే పార్టీని ఎంచుకొనేందుకు 77 శాతం అవకాశాలుంటాయని పేర్కొన్నది. ఐఐఎం అహమ్మదాబాద్ డైరెక్టర్‌గా ఉన్న జగదీప్ ఛోకర్ జరిపిన విశ్లేషణ కూడా దీన్నే చెప్పింది. 1989 నుంచి ఒకేసారి జరిగిన లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 24 ఉదంతాలలో ప్రధాన రాజకీయ పార్టీలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో దాదాపు ఒకే విధమైన శాతాలలో ఓట్లు పొందాయి. కేవలం ఏడు సందర్భాలలో మాత్రమే ఫలితాలు భిన్నంగా వచ్చాయి. ఈ కారణంగానే గతంలో కాంగ్రెస్ మాదిరి ప్రస్తుతం దేశ వ్యాపితంగా ఉన్న బిజెపి ఒకేసారి ఎన్నికలు జరిగితే తనకు ఉపయోగమని, ఉన్న అధికారాన్ని మరింతగా సుస్ధిరపరచుకోవచ్చని, ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే అవకాశాలను తగ్గిస్తాయని గత ఆరు సంవత్సరాలుగా పార్టీ భావిస్తున్నది. ఒకేసారి ఎన్నికలు జరపాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సింది ఉంది. అదే జరిగితే రాష్ట్రాలలో, కేంద్రంలో ఏ కారణాలతో అయినా ప్రభుత్వాలు కూలిపోతే నిర్ణీత వ్యవధి వరకు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ర్టపతి పాలన విధించాల్సి ఉంది. దాని అర్ధం కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే దాని అధికారమే పరోక్షంగా ఉంటుంది.
ఇది కరోనాకు ముందున్న నేపథ్యం. ఈ మహమ్మారితో నిమిత్తం లేకుండానే వ్యవసాయ రంగంలో తలెత్తిన సంక్షోభం కారణంగా తలెత్తిన రైతాంగ ఉద్యమాలు, పదిహేనేండ్ల పాటు అధికారంలో కొనసాగిన రాష్ట్రాలలో బిజెపికి తగిలిన ఎదురు దెబ్బలు తెలిసిందే. కరోనా వ్యాప్తి ప్రారంభానికి ముందే దేశ ఆర్ధిక వ్యవస్ధ దిగజారింది. ఈ కాలంలో మరింత దిగజారి వరుసగా రెండు త్రైమాస కాలాల్లో తిరోగమన వృద్ధి నమోదై తొలిసారిగా దేశం మాంద్యంలోకి పోయింది. వచ్చే ఆరు నెలల కాలంలో కూడా పరిస్ధితి పెద్దగా మెరుగుపడే అవకాశాలు లేవని పాలక పార్టీ పెద్దలకు ముందే తెలుసు. వచ్చే రెండు సంవత్సరాల కాలంలో కూడా పూర్వపు స్థాయికి చేరుకొనే అవకాశాలు కష్టమని అనేక మంది ఆర్ధికవేత్తలు అంచనాలు వేస్తున్నారు. అదే జరిగితే ఇంతకాలం దేశం వెలిగిపోతోందని బిజెపిచేస్తున్న ప్రచారం తుస్సుమంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత పెరగటం అనివార్యం. అందువలన ముందుగానే రాజ్యాంగ సవరణల వివాదాన్ని ముందుకు తెచ్చి అభివృద్ధి నినాదం మాటున జమిలి ఎన్నికలకు పోవాలన్న ఆలోచన కనిపిస్తోంది. కరోనా ప్రభావం గురించి దేశమంతా ఆందోళన చెందుతోంటే ఆగస్టు 13న ప్రధాని కార్యాలయం స్థానిక సంస్ధలతో సహా అన్ని ఎన్నికలకు ఒకే ఓటర్ల జాబితా తయారీ సాధ్యాసాధ్యాల గురించి చర్చించేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అలా చేయాలంటే ముందుగా ఆర్టికల్ 243 కె, 243 జడ్, ఏ లకు సవరణలు చేయాల్సి ఉంటుందని చర్చ జరిగింది. దీనికి ప్రధాని ముఖ్య కార్యదర్శి పికె మిశ్రా అధ్యక్షత వహించారు. ఇప్పుడు ప్రధాని మరోసారి ముందుకు తెచ్చారు. పాలకపార్టీ, అధికార యంత్రాంగంలో జరుగుతున్న ఈ చర్చ, కదలికల కారణంగానే అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు తమ జాగ్రత్తలు తాము తీసుకుంటున్నాయి.
దేశ అభివృద్ధి, ప్రయోజనాల గురించి తమకు తప్ప మరొకరికి పట్టవని, అలాగే దేశభక్తి ఇతరులకు లేనట్లుగా, దేశద్రోహులకు మద్దతు ఇస్తున్నట్లు గత ఆరున్నర సంవత్సరాలుగా ఒక పథకం ప్రకారం ప్రచారం చేస్తున్నారు. ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే 101వసారి నిజంగా మారుతుందని సూత్రీకరణ చేసిన జర్మన్ నాజీ మంత్రి గోబెల్స్ తరహా ప్రచారం ఇదని కొందరు చెప్పటాన్ని కొట్టిపారవేయలేము. స్వాతంత్య్రమా పరాయి పాలనా దేన్ని ఎంచుకోవాలన్న దాని మీద సాగిన స్వాతంత్య్ర ఉద్యమంలో బిజెపిని ఏర్పాటు చేసిన సంఘ్ పరివార్ ఆర్‌ఎస్‌ఎస్ పాత్రలేకపోగా సావర్కర్ వంటి కొందరు బ్రిటీష్ వారికి లొంగిపోయి ప్రభుత్వానికి సేవ చేస్తామని రాసి ఇచ్చిన చరిత్ర కళ్ల ముందుఉంది. దాని కొనసాగింపుగానే క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించారు. ద్విజాతి సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చిన ముస్లింలీగ్‌తో కలసి రాష్ర్ట ప్రభుత్వాల్లో పాల్గొన్న హిందూమహాసభలోని వారు ఆర్‌ఎస్‌ఎస్ వాదులే అన్నది తెలిసిందే. ప్రధాని మోడీ సభాధ్యక్షుల సమావేశంలో చెప్పిన దేశ అభివృద్ధి, ప్రయోజనాల కబుర్లు రాజ్యాంగ మౌలిక స్వభావానికి తూట్లు పొడిచి జమిలి ఎన్నికలను రుద్దేందుకు పూనుకున్నారా అన్న అనుమానాలను ముందుకు తెస్తున్నాయి. 2022 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు నిండుతుంది. ఆ సమయానికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తానని చెప్పిన ప్రధాని ఆ బాటలో తీసుకున్న చర్యలేమీ లేవు. కానీ ఒకే దేశం ఒకే ఎన్నికలంటూ పదే పదే మాట్లాడుతున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఉన్న మెజారిటీ, దేన్నయినా బలపరిచే ఇతర పార్టీలు కూడా ఉన్నందున ఒక్క రోజులోనే కశ్మీర్ రాష్ట్రాన్నే రద్దు చేసినట్లు ఒకేసారి ఎన్నికల కోసం జనాభిప్రాయాన్ని తోసిపుచ్చి రాజ్యాంగ సవరణలు చేయటం నరేంద్ర మోడీకి ఒక పెద్ద సమస్య కాదు. అలాంటి పరిణామం జరిగినా ఆశ్చర్యం లేదు. అందువలన ఈ నేపథ్యంలో అలాంటి ఎన్నికలకు వ్యతిరేకత తెలపటం తప్ప ఉన్న ఆటంకాలు, లాభనష్టాలు ఏమిటి అని తలలు బద్దలు కొట్టుకోవటం కంఠశోష తప్ప మరొకటి కాదు.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News