Friday, April 26, 2024

సంపాదకీయం: అమెరికా ఆత్మ- ట్రంప్ పేచీ!

- Advertisement -
- Advertisement -

America elections in Supreme Court  ‘ఒకప్పుడు ప్రపంచ సుస్థిరతకు భరోసాగా, హామీగా నిలబడిన అమెరికా, అంతర్జాతీయ పరిణామాలపై ప్రభావం చూపగల సామర్థాన్ని కోల్పోతున్నది’ అని డోనాల్డ్ ట్రంప్ పాలనను పరోక్షంగా విమర్శిస్తూ రెండేళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గటెరర్స్ వ్యాఖ్యానించారు. వాణిజ్య యుద్ధాలకు తలపడుతూ, అంతర్జాతీయ ఒప్పందాల నుంచి తప్పుకుంటూ అమెరికా తన మధ్యవర్త్తిత్వ లక్షణాన్ని వదులుకుంటున్నదని, నచ్చజెప్పి దారికి తెచ్చే పాత్ర నుంచి తప్పుకుంటున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ ఈ లక్షణాన్నే ‘అమెరికా ఆత్మ’ అన్నారు. దానిని పునరుద్ధరిస్తానని మాట ఇచ్చి మెజారిటీ ఓటర్ల మద్దతును చూరగొన్నారు.

ప్రజా ఓట్లపరంగా, ఎలెక్టోరల్ బ్యాలెట్లపరంగా బైడెన్ తిరుగులేని గెలుపు సందేహాతీతంగా నిర్ధారణ అయిపోయినప్పటికీ ట్రంప్ దానిని అంగీకరించడం లేదు. తపాలా ఓట్లలో కుట్ర జరిగిందనే ఆరోపణతో సుప్రీంకోర్టును కూడా ఆయన ఆశ్రయించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇదొక అసాధారణ పరిణామం. 20 ఎలెక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియా రాష్ట్ర తపాలా బ్యాలెట్ల లెక్కింపును నిలిపివేయాలని ట్రంప్ తరపున దాఖలైన వ్యాజ్యాన్ని ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇంతకు ముందు తోసిపుచ్చింది. పోలింగ్ తేదీ గడచిన తర్వాత 3 రోజుల వరకు వచ్చిన పోస్టల్ ఓట్లను పరిగణనలోకి తీసుకొని లెక్కించ వచ్చని తీర్పు ఇచ్చింది. అయితే ఆ ఓట్లు పోలింగ్ తేదీన గాని, అంతకు ముందుగాని వేసినవై ఉండాలని స్పష్టం చేసింది. ఆ తీర్పును రద్దు చేయాలని ట్రంప్ తరపున పిటిషన్లు వేసిన వారు సుప్రీంకోర్టును కోరుతున్నారు.

పెన్సిల్వేనియా రాష్ట్ర చట్ట ప్రకారం పోలింగ్ తేదీ రాత్రి 8 గం.ల వరకు వచ్చే తపాలా ఓట్లనే లెక్కించవలసి ఉంటుంది. కరోనాను దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్ర శాసన సభ ఈ నిబంధనను సవరించి ఉండవలసింది. కాని అది జరగలేదు. న్యాయ స్థానం మాత్రం కరోనా నేపథ్యంలోనే లెక్కింపుకి 3 రోజుల వ్యవధినిచ్చింది. పెన్సిల్వేనియా తీర్పును రద్దు చేయాలంటూ ట్రంప్ తరపున 10 రాష్ట్రాలకు చెందిన రిపబ్లికన్ పార్టీ ముఖ్య న్యాయవాదులు సుప్రీంకోర్టుకు ఆమికస్ బ్రీఫ్ (సంక్షిప్త న్యాయ సలహా)ను దాఖలు చేశారు. పోలింగ్ కేంద్రానికి నేరుగా వచ్చి వేసే ఓటుకి ఉండే పారదర్శకత తపాలా ఓటుకు ఉండదని కూడా ట్రంప్ వాదిస్తున్నారు. పెన్సిల్వేనియాలో పోలింగ్ నాటి రాత్రి 8 గం. తర్వాత వచ్చిన తపాలా ఓట్లన్నింటినీ పక్కన పెట్టాలని సుప్రీంకోర్టు తాత్కాలిక ఉత్తర్వు జారీ చేయడం కీలక పరిణామం. అందుచేత బైడెన్ విజయం అధికారిక వెల్లడి ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో రిపబ్లికన్ పార్టీకి అనుకూలురైన వారిదే పైచేయి అనే అభిప్రాయం కూడా ఉంది. ట్రంప్ ముందు చూపుతోనే జస్టిస్ అమీ బ్యారెట్ నియామకాన్ని సంప్రదాయ విరుద్ధంగా ఎన్నికలకు ముందే సెనెట్ (ఎగువ సభ) చేత ఖరారు చేయించారన్న విమర్శ ఉంది.

పెన్సిల్వేనియా ఓట్ల లెక్కింపు తర్వాతనే విజయానికి అవసరమైన 270కి మించిన ఎలెక్టోరల్ ఓట్ల (273) ను బైడెన్ సాధించుకోగలిగారు. అంటే ఆ రాష్ట్ర 20 ఓట్లు దక్కి ఉండకపోతే ఆయన విజయానికి చేరువలో ఉండేవారే గాని దానిని సాధించలేకపోయేవారు. అయితే 213 ఎలెక్టోరల్ ఓట్లతో ట్రంప్ అప్పటికే బైడెన్ కంటే చాలా వెనుక ఉన్నారు. అందుచేత ట్రంప్‌దంతా పేచీకోరుతనమేనని రూఢి అవుతున్నది. పెన్సిల్వేనియా తపాలా ఓట్ల లెక్కింపు మళ్లీ జరిగినా ట్రంప్ నెగ్గే అవకాశాలుండవు. ప్రతినిధుల సభలో డెమొక్రాట్లదే పైచేయి కాబట్టి అధ్యక్ష పీఠాన్ని బైడెన్ అధిరోహించడం తథ్యమని చెప్పవచ్చు. బైడెన్ హయాంలో ఆయన వాగ్దానం చేసిన అమెరికా ఆత్మ పునరుద్ధరణ అవుతుందా, పారిస్ పర్యావరణ ఒప్పందంలో అది మళ్లీ చేరుతుందా, ఐక్యరాజ్య సమితి సంస్థలకు దాని అండదండలు తిరిగి ప్రాణం పోసుకుంటాయా, ట్రంప్ రద్దు చేసిన ఇరాన్‌తో అణు ఒప్పందం మళ్లీ లేచి కూచుంటుందా అనే ప్రశ్నలు జవాబు కోసం ఎదురు చూస్తున్నాయి.

వాస్తవానికి అమెరికా సామాజ్యవాదం విషయంలో రిపబ్లికన్, డెమొక్రాటిక్ ప్రభుత్వాల విధానాల మధ్య పెద్ద తేడా ఉండదు. అయితే వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి విదేశీయులకు దక్కుతున్న అమెరికా ఉద్యోగాలు అక్కడి స్థానిక అల్ప విద్యావంతులకు లభిస్తాయనే ఆశలు కల్పించింది. వాస్తవానికి ఆ వైపుగా కొంత మార్పు కూడా వచ్చింది. బైడెన్ ఆ సరళిని మళ్లీ వెనక్కు తిప్పగలుగుతారా? బయటి నుంచి వచ్చే చౌక శ్రమ శక్తిని అమెరికన్ కార్పొరేట్ సంస్థలు కోరుకుంటాయి. అందుచేత బైడెన్ పాలన తెల్ల యువత ఉద్యోగ బయటి దేశాల సిబ్బందిపై ఆకాంక్షలకు కార్పొరేట్లకున్న మక్కువకు మధ్య అడకత్తెరలో పోక అవుతుందా, ఈ విషయంలో ట్రంప్ లేకపోయినా ఆయన విధానం కొనసాగే అవకాశాలను కొట్టిపారేయలేము.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News