Monday, April 29, 2024

అప్పుడు రాహుల్ ఇప్పుడు స్టాలిన్

- Advertisement -
- Advertisement -

దుంగర్‌పూర్ (రాజస్థాన్) : ఇండియా కూటమిలోని వారందరికి హిందూయిజం అంటే మంట, అందుకే పలు రకాలుగా ప్రేలాపనలకు దిగుతున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఇండియా కూటమిలోని డిఎంకెకు చెందిన స్టాలిన్ కుమారుడు ఉదయానిధి సనాతన ధర్మం గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం ఇండియా బ్లాక్ వైఖరిని తెలియచేస్తుందని అమిత్ షా ఆదివారం స్పందించారు. ముఖ్యమంత్రి స్టాన్ కుమారుడి వ్యాఖ్యలు హిందూయిజానికి వ్యతిరేకం, నేరుగా దేశ ఘనమైన వారసత్వ సంపదపై దాడి అని అమిత్ షా తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాజస్థాన్‌లో బిజెపి ఆధ్వర్యపు పరివర్తన్ యాత్రను ఆదివారం దుంగర్‌పూర్ నుంచి ఆరంభించిన దశలో షా ఇండియా కూటమిపై దాడికి దిగారు. దయానిధి స్టాలిన్ వ్యాఖ్యలు ఆయన చిలుకపలుకులు కావు, ఇండియా బ్లాక్ ఓటుబ్యాంక్ రాజకీయాలు,

బుజ్జగింపుల పద్ధతులకు ప్రతీక అని అమిత్ షా స్పష్టం చేశారు. దయానిధి స్టాలిన్ వ్యాఖ్యలు పూర్తిగా సనాతన ధర్మం ఆచరించే వారిపట్ల ఊచకోత పిలుపుగా ఉన్నాయని బిజెపి మండిపడింది. దయానిధి స్టాలిన్ వ్యాఖ్యలతో ఇండియా కూటమి నేతలు ఏకీభవిస్తారా? అని బిజెపి తరఫున అమిత్ షా నిలదీశారు. డిఎంకె, కాంగ్రెస్ , ఇండియా కూటమిలోని పార్టీల పెద్దలు చివరికి వారి కుమారులు కూడా సనాతన ధర్మం అంతం గురించి ముంబై వేదికగా మాట్లాడారని అమిత్ షా తెలిపారు. ఇది దేశంలోని కోట్లాది మందిని అవమానించినట్లే అని తెలిపారు. 2010లోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అతివాద హిందూ సంస్థలు లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల కన్నా ప్రమాదకరం అని చెప్పిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు. రాహుల్ బాబా మాటలే ఇప్పుడు స్టాలిన్‌లు వల్లిస్తున్నారని విమర్శించారు. ఒకరు హిందూ సంస్థలను లష్కరే తోయిబాతో పోలుస్తారు. అప్పటి హోం మంత్రి (సుశీల్‌కుమార్ షిండే ) చివరికి దేశంలో హిందూ ఉగ్రవాదం ఉందని అంటారు. హిందూయిజంపై వీరికి ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు.

సనాతన ధర్మం గొప్పదని, దీనిని విమర్శించే అర్హత ఈ నేతలకు లేదని అమిత్ షా తెలిపారు. తరాలుగా ప్రజల మదిలో తిష్టవేసుకుని ఉందన్నారు, మోడీ తిరిగి అధికారంలోకి వస్తే సనాతన ధర్మం మరింత పాతుకుపోతుందని ప్రతిపక్ష నేతలు చెపుతున్నారని, అయితే ప్రజల హృదయాలలో నెలకొన్న భావనలను ఎవరూ ఏమి చేయలేరని, అటు హిందూ సనాతన ధర్మాన్ని కానీ ఇటు మోడీ ఆమోదప్రక్రియను కానీ దెబ్బతీయలేరని తెలిపారు. భారతదేశానికి రాజ్యాంగం ప్రమాణమని, దీనికి అనుగుణంగానే దేశం నడుస్తుందని పలు సందర్భాలలో మోడీ తెలిపారని రాజస్థాన్‌లో బిజెపి ఎన్నికల ప్రచారం ఆరంభం దశలో అమిత్ షా స్పష్టం చేశారు.

ప్రతిపక్షాలకు రామాలయం అంటే గిట్టదు
ఎన్నో ఏళ్లుగా ప్రతిపక్షాలు అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నాయని, దీనిని అడ్డుకోవడం కాంగ్రెస్‌కు సాధ్యం కాదన్నారు. రామాలయ నిర్మాణం పూర్తయింది. బ్రహ్మండమైన రీతిలో వెలిసిన రామాలయం జనవరిలో రాముడి జన్మస్థలిలోనే వెలుస్తుందని అమిత్ షా చెప్పారు. ఇండియా కూటమి దీనిని ఆపివేయలేదన్నారు. ఎన్నో ఏళ్లుగా పవిత్ర రామాలయాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటూ వచ్చిందని విమర్శించారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్చి, తమ బిజెపి ప్రభుత్వం వచ్చే దిశలోనే పరివర్తన్ యాత్ర చేపట్టినట్లు అమిత్ షా చెప్పారు. 19 రోజులలో 2500 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్ర 52 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగుతుందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News