Saturday, April 27, 2024

పంచాయతీ పోరుకు ఏర్పాట్లు వేగం

- Advertisement -
- Advertisement -

వివరాలు పంపించాలని కలెక్టర్లకు ఇసి ఆదేశాలు
పాత రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్న అధికారులు

మన తెలంగాణ/ హైదరబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముగియగానే పంచాయతీ ఎన్నికల పోరు సందడి ప్రారంభం కానుంది. సర్పంచ్ ఎన్నికలకు అతి త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కసరత్తు ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు 2019 జనవరిలో మూడు విడుతలు నిర్వహించగా గ్రామాల్లో ఫిబ్రవరి 1 నాటికి సర్పంచ్ సహా కొత్త కార్యవర్గం కొలువుదీరింది. వీరి పదవి కాలం 2024 ఫిబ్రవరి 1తో ముగియనుంది. దీంతో నిబంధనల ప్రకారం మూడు నెలల ముందు నుంచే ఎన్నికల ప్రక్రియ అధికారులు పూర్తి చేసి, ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది.

అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇప్పటికే ఈ ప్రక్రియ ఆలస్యమైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈనెల 3వ తేదీ వరకు అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడం, కొత్త శాసనసభ కొలువుదీరనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సర్పంచ్ ఎన్నికలకు కసరత్తు వేగం చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ అధికారుల నియామకం, ఎన్నికల విధుల్లో పాల్గొననున్న సిబ్బందికి శిక్షణ ఇవ్వడం తదితర కార్యక్రమాలను ప్రారంభించాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం సూచించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం అశోక్ కుమార్ పేరుతో డిసెంబర్ 4న ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామ కార్యదర్శులు ఇప్పటికే సర్పంచ్, వార్డు మెంబర్లకు సంబంధించిన రిజర్వేషన్లపై వివరాలు పంపించారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు 10 ఏళ్లకు వర్తించేలా ప్రభుత్వం 2019లో చట్టం చేసింది. పాత రిజర్వేషన్ విధానంతోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొలువుదీరే కొత్త ప్రభుత్వం రిజర్వేషన్లను మార్చాలని నిర్ణయం తీసుకుంటే, అధికారులు నిర్ణీత సమయంలో కొత్త రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు అందిస్తే తప్ప రిజర్వేషన్లు మారే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News