Monday, April 29, 2024

బిజెపి తరఫున ఎన్నికల ప్రచారంలో అస్సాం గవర్నర్

- Advertisement -
- Advertisement -

గువాహటి: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి తరఫున ప్రచారం చేసిన అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియాను బర్తరఫ్ చేయాలని తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి), ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన ఆ రాష్ట్ర విభాగాలు డిమాండ్ చేశాయి. రాజ్యాంగ పదవిని చేపట్టే ముందు తన రాజకీయ పదవులన్నిటినీ వదులుకున్న గవర్నర్ ఒక పార్టీకి చెందిన అభ్యర్థి కోసం ఎన్నికలలో ప్రచారం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని, ఆయనపై చర్య తీసుకునే విషయంలో రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని ఆ రెండు పార్టీలు గురువారం వేర్వేరు ప్రకటనలలో డిమాండ్ చేశాయి.

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో బిజెపి తరఫున ప్రచారం సాగిస్తూ అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా బిజీగా ఉన్నారని, ఆయనపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని టిఎంసి అస్సాం విభాగం అధ్యక్షుడు రిపున్ బోరా ఎక్స్ వేదికగా కోరారు. రాజ్యాంగ పరిరక్షకుడైన గవర్నర్ బిజెపి కోసం ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. కటారియాను తక్షణమే గవర్నర్ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఉదయ్‌పూర్‌లో బిజెపి అభ్యర్థి తారాచంద్ జైన్ తరఫున కటారియా ప్రచారం చేశారని, ఆయన రాజ్యాంగ పదవిలో ఉన్నందున ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమేనని బోరా తెలిపారు. కొద్ది రోజుల క్రితం అస్సాం అసెంబ్లీ స్పీకర్ నుమల్ మోమిన్ మిజోరంలో బిజెపి తరఫున ప్రచారం చేశారని, ఇప్పుడు గవర్నర్ కటారియా వంతని బోరా పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ నిబంధనలను అతిక్రమించడమేనని, ఒక రాష్ట్రాధినేతగా ఏ రాజకీయ పార్టీకి గవర్నర్ మద్దతు ఇవ్వకూడదని ఆయన తెలిపారు. బిజెపి అధికార దుర్వినియోగానికి, నియంతృత్వ ప్రభుత్వాలకు ఈ రెండు ఉదాహరణలు చాలని ఆయన పేర్కొన్నారు.

అస్సాం ఆప్ సమన్వయకర్త హబెన్ చౌదరి కూడా టిఎంసి అభిప్రాయన్నే వ్యక్తం చేశారు. రాజకీయాలను దూరం పెడుతూ గవర్నర్ కుల, మతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అయితే ఎన్నకిలలో ఒక పార్టీ తరఫున ప్రచారం చేసి గవర్నర్ కటారియా రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారని, అలా చేయడం ద్వారా ఆయన గవర్నర్ పదవికి ఉన్న ప్రతిష్టను దిగజార్చారని చౌదరి విమర్శించారు. వెంటనే కటారియా గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కటారియాపై చర్యలు కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News