Thursday, May 9, 2024

రామ జన్మభూమి వద్ద 32 ఏళ్ల క్రితం అలా మొదలై…

- Advertisement -
- Advertisement -

నెరవేరిన రామాలయ వాస్తుశిల్పి చంద్రకాంత్ సోంపుర కల

అయోధ్య: ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో ఈనెల 22న ప్రాణ ప్రతిష్ట జరుపుకోనున్న రామాలయ రూపశిల్పి చంద్రకాంత్ సోంపుర తన 32 ఏళ్ల కల నెరవేరే సమయం ఆసన్నమైందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆయన విలేకరులతో మాట్లాడుతూ 32 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలను జ్ఞాపకం చేసుకున్నారు. విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు, రామ జన్మభూమి ఉద్యమ సారథులలో ఒకరైన అశోక్ సింఘాల్ తన వద్దకు వచ్చి అయోధ్యలో నిర్మించబోయే రామ మందిరం కోసం ఒక ప్లాన్ రూపందించాలని తనను కోరినట్లు ఆయన చెపారు.

అయోధ్యకు వెళ్లి రామజన్మభూమి వద్దకు తామిద్దరం వెళ్లామని, అయితే లోపలకు వెళ్లి భూమి కొలతలు తీసుకోవడానికి కూడా తమను అనుమతించలేదని సోంపుర తెలిపారు. ఎలాగోలా లోపలకైతే వెళ్లగలిగామని, తాను తన కాలి అడుగులతో కొలతలు తీసుకున్నానని ఆయన చెప్పారు. ఆలయం కోసం తాను రూపొందించిన ప్లానే ఈనాడు అద్భుతమైన ఆలయంగా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోందని ఆయన చెప్పారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన చంద్రకాంత్ సోంపుర కుటుంబం తరతరాలుగా ఆలయ వాస్తుశిల్పంలో ప్రావీణ్యం సాధించింది. 15వ తరానికి చెందిన చంద్రకాంత్ సోంపురకు వాస్తుశిల్ప శాస్త్రంలో మౌలికమైన విద్యాభ్యాసం ఏమీ లేదు.

తన తండ్రి వద్ద నుంచి ఈ విద్యను నేర్చుకున్నారు. భారతదేశంతోపాటు విదేశాలలో 200కి పైగా ఆలయాలను నిర్మించిన ఘనత చంద్రకాంత్ సొంతం. చంద్రకాంత్ తాత పిఓ సొంపుర 1949లో పునరుద్ధరించిన గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయానికి వాస్తుశిల్పిగా పనిచేశారు. చంద్రకాంత్ వాస్తుశిల్పంతో రూపుదిద్దుకున్న ఆలయాలలో గుజరాత్‌లోని అక్షరధామ్, ముంబైలోని స్వామినారాయణ్ మందిర్, కోల్‌కతాలోని బిర్లా మందిర్ వంటివి ఉన్నాయి. బిర్లా కుటుంబం ద్వారానే విశ్వ హిందూ పరిషద్ చంద్రకాంత్ సోంపురను అయోధ్య రామాలయం కోసం సందప్రదించింది. 32 ఏళ్ల క్రితం రామాలయ నిర్మాణం కోసం చంద్రకాంత్ పని ప్రారంభించారు.

ఆయన కుమారులు ఆశిష్, నిఖిల్‌తోకూడిన బృందం సాయంతో రామాలయ రూపం దాల్చింది. అయోధ్య రామాలయ విశిష్టత గురించి ఆయన చాలా ఏళ్ల క్రితమే వెల్లడించారు. ప్రతి చోట ఆలయాలు ఉన్నాయి కాని ఇది రామ జన్మభూమి ఆలయం అని 2019లో ది వీక్ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన చెప్పారు. నాగర శైలిలో అత్యద్భుతమైన శిల్పాలు ఈ ఆలయంలో ఉంటాయని ఆయన చెప్పారు. రాముడి జన్మభూమిపై నిర్మిస్తున్న ఈ ఆలయానికి విశిష్టత ఉందని, ఇది త్యుత్తమైన ఆలయంగా చూడాలన్నదే తన కలని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News