Saturday, April 27, 2024

2050 నాటికి 800 మిలియన్ల మందికి వెన్నునొప్పి రిస్కు

- Advertisement -
- Advertisement -

కొన్ని లక్షల మందిని వెన్నునొప్పి పీడిస్తోంది. రానురాను ఈ కేసులు పెరుగుతున్నాయి. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో వెన్నునొప్పికేసులు విశేష సంఖ్యలో ఉంటున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 1990 నుంచి 2020 వరకు 204 దేశాల డేటా సేకరించి పరిశీలించగా, 2050 నాటికి 843 మిలియన్ల మంది వెన్ను నొప్పికి గురవుతారని అధ్యయనంలో వెల్లడైంది. 2020 లో సుమారు 619 మిలియన్ల మంది వెన్ను నొప్పికి గురైనట్టు తేలింది. 2020 తో పోలిస్తే 2050 నాటికి 36 శాతం వరకు ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతాయని లాన్సెట్ జర్నల్ అధ్యయనం వెల్లడించింది.

Also Read: ఆ సినిమా ఆపాలి… నరేష్ మాజీ భార్య రమ్య పిటిషన్

వెన్ను నొప్పి అన్నది తీవ్రమైన వ్యాధుల సంకేతం. దెబ్బలు తగిలినా, అధిక బరువులు ఎత్తినా, సరైన రీతిలో కూర్చోకోక పోయినా, ఎక్కువ సేపు మంచంపై పడుకున్నా వెన్ను నొప్పి వస్తుంటుంది. గర్భధారణ, నెలసరి సమయం లోనూ వెన్ను నొప్పి వస్తుంది. సాధారణంగా పెయిన్ కిల్లర్స్ , బామ్స్‌తో నొప్పి నయమవుతుంది. అంతకీ తగ్గక పోతే డాక్టరును సంప్రదించక తప్పదు. తీవ్రమైన వ్యాధులు కొన్నిటి ప్రభావం వల్ల కూడా వెన్ను నొప్పి రావచ్చు. జాతీయ స్థాయిలో వైద్య అధ్యయనం ప్రకారం పక్కటెముకలు, వెన్నెముక , ఎముకల కణజాలంలో ఇన్‌ఫెక్షన్ల కారణంగా వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఉందని తేలింది. వెన్నెముకలో కణాలు అసాధారణంగా పెరగడం ప్రారంభమైతే వెన్నెముక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.జన్యుపరమైన కారణాల వల్ల కూడా వెన్నెముక క్యాన్సర్ రావచ్చు.

వెన్నెముక డిస్క్ జారినప్పుడు వెన్ను నొప్పి వస్తుంటుంది. దీన్ని హెర్నియేటెడ్ డిస్క్ అంటారు. ఆస్టియోపోరోసిస్‌కు వెన్నునొప్పికి సంబంధం ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలకు సంబంధించిన వ్యాధి. ఎముకలు గుల్లబారడం, ఎముకల పటుత్వం తగ్గడం, బోలుబోలుగా బలహీనం కావడం, ఫలితంగా ఎముక కణజాలం సాంద్రత తగ్గిపోవడం వంటి కారణాల వల్ల వెన్ను నొప్పి వస్తుంది. నడుం నొప్పితో నడుస్తున్నప్పుడు భరించలేనంత బాధ ఉంటుంది. కాలిపిక్కల నుంచి వెన్నులోకి నొప్పి పాకుతుంది. ఈ సమస్యను సయాటికా అంటారు. సయాటికా లో వెన్ను, కాళ్లలో నొప్పి, జలదరింపు , తిమ్మిరి తదితర లక్షణాలు కనిపిస్తాయి.

కొంతమందిలో ఉదయం పూట నొప్పి ఉండడం, అర్ధరాత్రి కూడా రావడం, 45 నిమిషాల సేపు వరకు తగ్గకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అని అంటారు. వీపు కింది భాగం లోనే నొప్పి ఉంటే స్పైనల్ స్టెనోసిస్ అని అంటారు. దీనివలన నరాల కుదింపు, తిమ్మిరిగా ఉండడం వంటివి కనిపిస్తాయి . చేతులు, కాళ్లు తిమ్మిరి ఎక్కుతుంటాయి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే పరీక్షించి చికిత్స చేస్తారు. నొప్పి 72 గంటల కంటే ఎక్కువ సేపు ఉంటే ఏమాత్రం నిర్లక్షం చేయరాదని వైద్యులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News