Saturday, April 27, 2024

సంపాదకీయం: మొండి బకాయిల భయం

- Advertisement -
- Advertisement -

Banking sector loss with Lockdown సుదీర్ఘ కరోనా లాక్‌డౌన్ భారం ప్రభుత్వ రంగం బ్యాంకుల మీద అమితంగా పడగలదని, పర్యవసానంగా వాటి మొండి బకాయిలు అపరిమితంగా పెరిగిపోగలవనే హెచ్చరికలు వినవస్తున్నాయి. ప్రస్తుతం 8.5 శాతం వద్ద గల తిరిగిరాని రుణాలు వర్తమాన ఆర్థిక సంవత్సరం (202021) ముగిసే సరికి 1314 శాతానికి పేట్రేగగలవని ప్రఖ్యాత రేటింగ్ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్ అభిప్రాయపడింది. గత 18 మాసాలుగా తగ్గుతూ వస్తున్న మొండి బకాయిలు మళ్లీ పైకి దూసుకుపోగలవని హెచ్చరించింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఎయిర్ లైన్స్, హోటల్స్, మాల్స్, మల్టీప్లెక్సులు, రెస్టారెంట్లు, చిల్లర వర్తకం రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పిన ఈ రేటింగ్ సంస్థ పలుకుబడి గల రియల్ ఎస్టేట్ నిర్వాహకులు, టెలికం కంపెనీలు, విద్యుదుత్పాదన సంస్థలు బ్యాంకుల మొండి బకాయిల పెరుగుదలకు కారణమవుతాయని వివరించింది.

బ్యాంకు రుణాల కిస్తుల చెల్లింపుపై ఆర్‌బిఐ స్వచ్ఛందంగా 6 మాసాల పాటు మారటోరియం (వాయిదాల చెల్లింపు నుంచి మినహాయింపు) విధించినందువల్ల ఈ మొండి బకాయిల పెరుగుదల సంభవిస్తుందని వెల్లడించింది. రుణాల చెల్లింపు ప్రణాళికను ఈ విధంగా మార్చడం వల్ల బ్యాంకులపై వసూలు కాని అప్పుల భారం పెరుగుతుందేగాని ఇతరత్రా ప్రయోజనముండదని హెచ్చరించింది. మరొక వైపు నిర్లక్షం, క్రమశిక్షణారాహిత్యంతో కూడిన రిజర్వు బ్యాంకు రుణ నిర్వహణను దాని మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కడిగి పారేశారు. ముఖ్యంగా యుపిఎ ప్రభుత్వ హయాంలో మొండి బకాయిల విషయంలో ఆర్‌బిఐ బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని, ప్రభుత్వ రంగ బ్యాంకుల మేనేజ్‌మెంట్ వ్యవహారాలను సరిగ్గా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఆర్‌బిఐని దాని మాజీ గవర్నర్ ఒకరు ఇంతగా విమర్శించడం బహుశా ఇదే మొదటిసారి. ఉర్జిత్ పటేల్ 2018 డిసెంబర్‌లో గవర్నర్ పదవికి అర్ధంతరంగా రాజీనామా చేసి దిగిపోయారు.

అలా నిష్క్రమించిన మొదటి గవర్నర్ ఆయనే. ఆయన హయాంలోనే దేశాన్ని కుదిపివేసిన పెద్ద నోట్ల రద్దు అమలయింది. ఆర్‌బిఐ సొంత నిల్వల నుంచి అదనపు డివిడెండ్‌ను రాబట్టడానికి ప్రధాని మోడీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని ఉర్జిత్ హయాంలోనే అది ప్రతిఘటించింది. ఈయన మాదిరిగానే అప్పటి డిప్యూటీ గవర్నర్ విరళ్ ఆచార్య కూడా మధ్యలోనే పదవి నుంచి తప్పుకున్నారు. అదనపు నిధులు సమకూర్చకపోతే రిజర్యు బ్యాంకు స్వయం ప్రతిపత్తిని రద్దు చేసి దానిపై తనకు తిరుగులేని అదుపును కల్పించే ప్రత్యేకాధికారాల అస్త్రాన్ని ప్రయోగించవలసి వస్తుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఉర్జిత్ పటేల్ బ్యాంకుల నిధుల నిర్వహణ పట్ల ఖచ్చితంగా ఉండేవారని ప్రతీతి. ఇప్పుడీయనను కేంద్ర ఆర్థిక శాఖ కింద పనిస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్‌ఐపిఎఫ్‌పి) చైర్మన్‌ను చేశారు. ఈయన ‘ఓవర్ డ్రాఫ్ట్: సేవింగ్ ది ఇండియన్ సేవర్’ అనే గ్రంథాన్ని మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టితో రచిస్తున్నారు. మన దేశంలో బ్యాంకులపై పట్టున్న పెద్దవారు ప్రజల డిపాజిట్ల డబ్బును ప్రయోజనవంతంకాని లక్షాల వైపు వెదజల్లుతుంటారని, చాలా మంది పాలకులు వారి ఒత్తిళ్లకు లొంగిపోయి బ్యాంకుల దివాలా తీతకు, వాటి పట్ల జనం విశ్వాసం కోల్పోవడానికి తోడ్పడ్డారని ఉర్జిత్ పటేల్ ఆ పుస్తకంలో ఘాటుగా వ్యాఖ్యానించారు.

దేశ ఆర్థిక రంగాన్ని లాక్‌డౌన్ విపరిణామాల నుంచి బయటకు లాగడానికి ఆర్‌బిఐ రెండున్నల లక్షల కోట్ల రూపాయల మేరకు రుణ వితరణ చేయడానికి నిర్ణయించింది. ఇందులో పలు రంగాలకు రుణాలు సులభంగా లభ్యం కావడం, అప్పటికే తీసుకున్న రుణాల చెల్లింపులలో వెసులుబాటు కల్పించడం వంటి చర్యలున్నాయి. ఇందు కోసం బ్యాంకులకు ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా 40 వేల కోట్ల రూపాయల నిధులు సమకూర్చవలసి వస్తుందని అంటున్నారు. అయితే ఈ చర్యలు వాస్తవంలో ఏయే రంగాలను బాగు చేస్తాయనేది కీలకమైన ప్రశ్న. లాక్‌డౌన్ వల్ల బడా పారిశ్రామిక వ్యాపార రంగాలు కూడా దెబ్బతిన్న మాట నిజమే. అంతకంటే ఎక్కువగా వీధి వ్యాపారులు, చిల్లర వర్తకులు, అసంఘటిత రంగంలో పని చేసే కార్మికులు, ఉద్యోగులు అమితంగా నష్టపోయారు.

అందుచేత ఆర్‌బిఐ గాని, కేంద్ర ప్రభుత్వంగాని బ్యాంకుల్లో అకౌంట్లు కూడా ఉండని చిన్న, చితక వీధి వ్యాపారులు, చిల్లర వర్తకులు, అసంఘటిత రంగానికి చెందిన కోట్లాది మంది వలస కార్మికుల బతుకులు బాగు పర్చడానికి, వారి వ్యాపారాలు, వ్యాపకాలు తిరిగి పుంజుకోడానికి పకడ్బందీ ఆపత్కాల సహాయ పథకాన్ని అమలు చేయాలి. అందువల్ల ఆ రంగాల్లో పని చేసే సామాన్యుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అది ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో బడా సంస్థల మొండి బకాయిల పెను భూతం తిరిగి విజృంభించకుండా వాటికి రుణాలిచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News