Saturday, April 27, 2024

అన్నీ ప్రాంతీయ పార్టీలే

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని రాజకీయపార్టీలన్నీ ప్రాంతీయపార్టీలేనని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు చెప్పారు. కాంగ్రెస్, బిజెపి పెద్దసైజు ప్రాంతీయ పార్టీలుగా కొన్ని రాష్ట్రాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉనికి,యంత్రాంగం ఉన్న జాతీయపార్టీలు దేశంలో లేవని కెటిఆర్ చెప్పారు. గరువారం ఢిల్లీలోని టైమ్స్‌నౌ సమ్మిట్ 2020లో దేశనిర్మాణంలో రాష్ట్రాల పాత్ర అనే అంశంపై కెటిఆర్ ప్రసంగించారు. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య అనేవిషయాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయపార్టీలు గుర్తుంచుకోవాలని ఆయన చెప్పారు. రాష్ట్రాలు బలపడినప్పుడే దేశం బలపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎన్నిఉన్నా వాటి ఆచరణ అంతా రాష్ట్రాల్లోనే ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల అమలును రాష్ట్రప్రభుత్వాలే చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు తన సొంత నిధులు ఇస్తున్నామనే ఆలోచన మంచిదికాదని కెటిఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలు నిధులు సమకూరుస్తున్న విషయాన్ని మరువకూడదని ఆయన కేంద్రానికి హితవు చెప్పారు. తెలంగాణ లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు కేంద్రానికి చెల్లిస్తున్న పన్నులతో పోల్చుకుంటే కేంద్రం నుంచి తిరిగి వచ్చేనిధులు తక్కువగా ఉంటున్నాయని విచారం వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ పార్టీ బిజెపి,కాంగ్రెస్‌లను శత్రువులుగా భావించడం లేదని ఆయన అన్నారు. కేవలం రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే భావించి ఎన్నికల్లో పోరాటం చేస్తున్నామని చెప్పారు. టిఆర్‌ఎస్ పార్టీకి ఏరాజకీయ పార్టీతో వ్యక్తిగత శత్రుత్వం లేదని కెటిఆర్ చెప్పారు. కేంద్రప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలను అంశాలవారిగా మద్ధతు ఇచ్చిన టిఆర్‌ఎస్ ప్రజావ్యతిరేక చర్యలను అదేవిధంగా వ్యతిరేకించినట్లు చెప్పారు. డిమానిటైజేషన్ తో దేశానికి మంచి జరుగుతుందని, సంపూర్ణ క్రాంతి వస్తుందని ప్రధాని ఇచ్చిన హామీ మేరకు టిఆర్‌ఎస్ మద్ధతు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే డిమానిటైజేషన్ ద్వారా దేశానికి నష్టం వస్తుందని తెలిసినప్పుడు పునరాలోచించామన్నారు. దేశంలో గతకొద్ది కాలంగా జరుగుతున్న ఎన్నికల్లో ప్రాంతీయపార్టీలే బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నాయని కెటిఆర్ చెప్పారు. భవిష్యత్‌లో ఖచ్చితంగా ప్రత్యామ్నాయ కూటమికే దేశంలో అవకాశాలున్నాయన్నారు. కాంగ్రెస్,బిజెపి రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రజలను నిరాశపరిచాయని చెప్పారు. గతం కొద్ది కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఆర్థిక అభివృద్ధి,మౌలిక వసతుల సదుపాయాల కల్పన,సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాల్లో దేశప్రజల అకాంక్షలను అందుకోలేకపోయాయని చెప్పారు. ఈ విషయాన్ని దేశప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారన్నారు. పౌరసత్వసవరణ బిల్లును పార్లమెంట్‌లో టిఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకించిందని ఆయన గుర్తు చేశారు. ఈ బిల్లుకు టిఆర్‌ఎస్ మద్ధతు ఇవ్వడంలేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా అవసరాలు,పాధాన్యత గల అంశాలపై దృష్టి పెట్టాలే కానీ ఇలాంటి వివాదస్పద చట్టాలతో ప్రజలను భయాందోళనకు గురిచేయవద్దని కెటిఆర్ హితవు చెప్పారు. జీవించడానికి అవకాశం ఉన్న ప్రపంచనగరాల్లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అన్నిఅవకాశాలున్న ఉత్తమనగరంగా హైదరాబాద్‌కు గుర్తింపు ఉందని ఆయన గుర్తు చేశారు. దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్‌ను ప్రకటించాల్సివస్తే హైదరాబాద్ ప్రజలు అంగీకరిస్తారో లేదో అనే విషయంలో నాకు స్పష్టతలేదని ఒక ప్రశ్నకు కెటిఆర్ సమాధానం ఇచ్చారు. కోఆపరేటివ్, ఫెడరలిజం,టీమ్ ఇండియా వంటి మాటలు చెప్పే ప్రధాని మోడీ ఆమేరకు ఎందుకు పనిచేయడంలేదని కెటిఆర్ ప్రశ్నించారు. నీతి ఆయోగ్ తెలంగాణలోని మిషన్‌భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులకు ఆర్థికసహాయం అందించాలని కేంద్రానికి నివేదకలు సమర్పించినా ఇప్పటివరకు ఎలాంటి సహాయం అందించలేదని విచారం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు, ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులు వంటి అంశాల్లో మరింత సరళంగా వ్యవహరించాలని కెటిఆర్ కోరారు. కేంద్రం రాష్ట్రాలను ప్రోత్సహిస్తూ దేశాభివృద్ధికి కృషిచేయాలని కెటిఆర్ హితవు చెప్పారు.
హక్కుగా రావల్సినదానికంటే ఒక్కపైసా ఎక్కువరాలేదు
కేంద్ర వార్షిక బడ్జెట్ రాష్ట్రానికి నిరాశమిగిలించిందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, మున్సిపాలిటీ, పరిశ్రమల శాఖ మంత్రి కలవకుంట్ల తారకరామారావు విచారం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా, అసంబద్ధంగా ఉందని ఆయన ఆరోపించారు. పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతూ తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావల్సినదానికంటే ఎక్కువ ఇచ్చామని చెప్పడాన్ని కెటిఆర్ తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఖండిస్తోందని కెటిఆర్ చెప్పారు. ఐదు సంవత్సరాల్లో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 లక్షల72 వేలకోట్లు పన్నుఆదాయంగా చెల్లిస్తే కేంద్రం కేవలం ఐదేళ్లలో రాష్ట్రానికి రూ. లక్షా 12వేల కోట్లు తిరిగి ఇచ్చిందని కెటిఆర్ వివరించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఇతర అంశాలపై ఇప్పటికే కేంద్ర మంత్రి పీయుష్ గోయల్‌తో చర్చించినట్లు చెప్పారు. కేంద్రంతో రాజ్యాంగబద్దంగా ఉండే సంబంధాలను జరుపుతూనే అంశాలవారిగా విభేదిస్తున్నట్లు చెప్పారు. సిఎఎ అంశంలోనూ రాష్ట్రం పక్షాన విభేదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే సిఎఎను ఎందుకు విభేధించామో స్పష్టం చేశామని ఆయన వివరించారు. జిఎస్‌టి బకాయిలపై ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా స్పష్టంగా వివరణ ఇచ్చారని తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సిన బకాయిలు ఇవ్వాలని సిఎం డిమాండ్ చేశారని ఆయన గుర్తు చేశారు. చట్టం మేరకు కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో ఆర్థిక శాఖమంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించిన ఆదాయానికి,రాష్ట్రానికి ఇచ్చిన ఆదాయానికి సుమారు రూ. 60 నేల కోట్ల వ్యత్యాసం ఉందని మంత్రి తెలిపారు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలు చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మనుగడ దెబ్బతినక తప్పదని కెటిఆర్ అన్నారు. రాజ్యాంగబద్దంగా కేంద్రంతో రాష్ట్రం మెదులుతుందేకానీ రాజకీయంగా కాదని ఆయన చెప్పారు. అయితే రాజ్యాంగ బద్దంగా కేంద్రానికి రాష్ట్రాలు పన్నుల మసూళ్లు చెల్లిస్తున్నప్పటికీ తిరిగి కేంద్రం చెల్లించడంలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉండే ఏ ప్రభుత్వమైన దేశంలోని అన్నిరాష్ట్రాల భివృద్ధికి పాటిపడాల్ కానీ కొన్నిరాష్ట్రాలపై వివక్షధోరణీ అవలంఙించవద్దని కెటిఆర్ చెప్పారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి అదనంగా అభివృద్ధికోసం ఒక్క పైసాకూడా అందలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. పైగా పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి తెలంగాణకు హక్కుగా రావల్సిన దానికంటే ఎక్కువగా ఇచ్చామని అబద్దాలు ఆడితే ప్రజలు నమ్ముతారాని కెటిఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు.

BJP and Congress only Regional Parties Says KTR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News