Friday, April 26, 2024

530 టిఎంసిలు ఎత్తిపోయాలి

- Advertisement -
- Advertisement -

 

అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి
11 సర్కిళ్లుగా ఇంజనీరింగ్ వ్యవస్థ
అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందికి తేవాలి
సర్కిల్ అధిపతిగా ఒక చీఫ్ ఇంజినీర్ ఉండాలి
జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలన్నీ భర్తీ కావాలి
రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపాలి
మే నెలాఖరులోగా కాలువలకు మరమ్మతులు చేయాలి, కొత్త కలెక్టరేట్లకు తక్షణ ఆదేశాలు
– కరీంనగర్ కలెక్టరేట్ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాల్సిన క్రమంలో బ్యారేజ్‌ల ఆపరేషన్ రూల్స్‌ను సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా సాగునీటి లక్ష్య సాధనకు ఇంజినీరింగ్ విభాగాల పునర్వ్యవస్థీకరణ జరగాలని నిర్ణయించారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో గురువారం సాగునీటి రంగంపై అధికారులతో సిఎం కెసిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సాగునీటికి సంబంధించిన ఇంజినీరింగ్ విభాగాలన్నీ ఒకే గొడుగు కిందికి తేవాలలని సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ వ్యవస్థను 11 సర్కిళ్లుగా విభజించాలని సూచించారు. సర్కిల్ అధిపతిగా చీఫ్ ఇంజనీర్ ఉండాలని పేర్కొన్నారు. జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించారు. మే నెలాఖరులోగా సాగునీటి కాలువలకు మరమ్మతులు చేపట్టాలని పేర్కొన్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఇరిగేషన్ అధికారులు, సిబ్బందికి క్వార్టర్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు. 530 టిఎంసిల గోదావరి జలాలను ఎత్తి పోసేలా అధికారులు అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపేలా కార్యచరణ సిద్ధం చేయాలని సూచించారు. కరీంనగర్‌తో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ల స్థానంలో కొత్త కలెక్టరేట్‌ల నిర్మాణం చేపట్టాలని అన్నారు. కొత్త కలెక్టరేట్లను మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సిఎం కెసిఆర్ ఆదేశించారు.
ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న సిఎం కెసిఆర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి సిఎం కెసిఆర్ అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు.సిఎం కెసిఆర్ కాళేశ్వరం పర్యటనలో భాగంగా గురువారం ఉదయం కరీంనగర్ నుంచి హెలికాప్టర్‌లో కాళేశ్వరం చేరుకున్నారు. హెలికాప్టర్ నుంచి మేడిగడ్డ జలాశయం, కన్నేపల్లి పంప్‌హౌస్‌లను విహంగ వీక్షణం చేశారు. అనంతరం గోదావరి పుష్కరఘాట్‌కు చేరుకుని త్రివేణి సంగమం వద్ద పూజలు చేశారు. ప్రాణహిత-గోదావరి పవిత్ర జలాలను తలమీద చల్లుకున్నారు. నదిలో నాణేలు వదిలి చీర, సారె సమర్పించి జల నీరాజనాలు అర్పించారు. అనంతరం ముక్తేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్న సిఎం కెసిఆర్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు సిఎం కెసిఆర్‌ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. సిఎం కెసిఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎంఎల్‌ఎలు, ఉన్నతాధికారులు ఉన్నారు.
గోదావరి జలాలు వృథాగా పోకుండా చూడాలి : సిఎం కెసిఆర్
రాబోయే వర్షాకాలం వరద నీరు ఉదృతంగా చేరుతుందని, ఈ నేపధ్యంలో లక్ష్మి బ్యారేజ్ నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడుకోవాలని, అందుకు సంబంధించిన వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని సిఎం కెసిఆర్ సూచించారు. కాళేశ్వరం పర్యటనలో సిఎం కెసిఆర్ ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎంతో కష్టపడి కట్టుకున్న ప్రాజెక్టులలోని నీటిని ఎప్పటిక్పుడు తోడి పోసుకుంటూ రిజర్వాయర్ లను నింపుతూ, గోదావరి జలాలు వృథా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంజనీర్‌లదే అని సిఎం పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి నుంచి మొదలుకుని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజిలను రిజర్వాయర్‌లను ఎత్తిపోతల పంపులను, కాల్వలను చివరాఖరి ఆయకట్టు దాకా సాగునీరు వ్యవసాయ భూములను తడిపే చివరి జల ప్రయాణం దాకా సునిశిత పర్యవేక్షణ చేసుకోవాలన్నారు. ఎక్కడికక్కడ పని విభజన చేసుకుని పూర్తిస్థాయిలో ఇంజినీరింగ్ వ్యవస్థను పటిష్ట పరుచుకుని అవసరమైతే పోలీసుల మాదిరి వైర్‌లెస్ వాకీ టాకీల వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పని చేయాలని సిఎం అధికారులకు చెప్పారు. సమాచారాన్ని ప్రతిక్షణం చెరవేసుకుంటూ ఎప్పుడు ఏ మోటార్ నడుస్తుంది, ఏ పంపు పోస్తుంది, ఎన్ని నీళ్లు ఎత్తాలే, ఎప్పుడు ఆపాలే, ఎప్పుడు నీటిని కిందికి వదులాలే వంటి పలు విధాలైన నీటి పంపిణీ సాంకేతిక అంశాల పట్ల కాళేశ్వరం టీం మొత్తానికి అవగాహన ఉండాలి అన్నారు. సమన్వయంతో పనిచేసి గోదావరి జలాలను నూటికి నూరుశాతం సద్వినియోగ చేసుకోగలమని సిఎం స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన చర్యలు చేపట్టనున్నట్లు సిఎం వివరించారు. అనంతరం సిఎం కెసిఆర్ మేడిగడ్డ వద్ద మధ్యాహ్నం భోజనం చేసి కరీంనగర్ బయలు దేరారు.

CM KCR Review Meeting on Irrigation sector in Karimnagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News