Saturday, April 27, 2024

మాంద్యంలోనూ మంచిగనే

- Advertisement -
- Advertisement -

 

పన్ను రాబడి పర్వాలేదు !
2020-21లో 15 శాతం మేర పెరగనున్న బడ్జెట్ ?
రూ.1.65 లక్షల కోట్లతో అంచనాలు రూపొందిస్తున్న ఆర్థిక శాఖ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పన్నుల రాబడి సాధారణ స్థితిలో ఉండటంతో 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు పెరగనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు బడ్జెట్ ప్రతిపాదనలకు తుదిరూపునిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే రానున్న బడ్జెట్‌లో రూ.1.65 లక్షల కోట్ల మేర అంచనాలు రూపొందిస్తున్నట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు మన తెలంగాణకు తెలిపారు. గడిచిన ఏడాది ఫిబ్రవరిలో 1.82 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ తరువాత సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను రూ.1.46 లక్షల కోట్లకు కుదించారు. ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్రంపై కూడా పడటం, జిఎస్‌టి వసూళ్లు తగ్గడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బడ్జెట్ అంచనాలను తగ్గించుకుని, వాస్తవ పద్దులను రూపొందించినట్లు అసెంబ్లీలో కూడా ప్రకటించారు. అయితే దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తీవ్రంగా ఉన్నప్పటికీ, రాష్ట్రంలో జిఎస్‌టి వసూళ్లపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఒకటి, రెండు నెలలు మినహా ప్రతినెలలోనూ జిఎస్‌టి వసూళ్లు సాధారణ స్థితిలో ఉన్నాయి. అలాగే మద్యం అమ్మకాలు, రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఆదాయం కొంత మెరుగైంది.రూ.1.13 లక్షల కోట్ల రాబడిని అంచనా వేయగా గడిచిన డిసెంబర్ వరకు రూ.71,187 కోట్లు 62.94 శాతం వచ్చింది. ఇందులో పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.60,261 కోట్లుగా ఉంది. ఇందులో జిఎస్‌టి రూ.20,348 కోట్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.4865 కోట్లు, అమ్మకపు పన్ను రూ.14 వేల కోట్లు, రాష్ట్ర ఎక్సైజ్ డ్యూటిస్ రూ.9032 కోట్లు వచ్చింది. పన్నేతర ఆదాయం రూ. 2983 కోట్లుగా ఉంది. నిర్ధేశించుకున్న లక్షంలో ఈ మొత్తం 18.79 శాతమే. అయితే పన్ను ఆదాయం జనవరిలో మరింత పెరిగింది. ఫిబ్రవరి, మార్చి నెలలోనూ మంచి ఆదాయమే ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ లెక్కన అంచనా వేసిన విధంగా రెవిన్యూ రాబడి 90 శాతం వరకు వస్తుందని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రస్తుత బడ్జెట్ కంటే రానున్న బడ్జెట్‌లో 10 నుంచి 15 శాతం మేర అంచనాలు పెరగనున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. అలాగే భూముల అమ్మకం ద్వారా రూ.10 వేల కోట్లు ప్రత్యేక అభివృద్ధి నిధి కింద బడ్జెట్‌లో చూపారు. అయితే వివిధ కారణాల వల్ల భూముల అమ్మకం జరపలేదు. ఈసారి కూడా అంతే మొత్తం ఎస్‌డిఎఫ్ కింద ప్రతిపాదించనున్నట్లు తెలిసింది.
సెప్టెంబర్‌లోనే తగ్గింది.. తరువాత ఓకే
పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని గత ఏఫ్రిల్ నుంచి పరిశీలిస్తే ఒక్క సెప్టెంబర్ నెలలో తగ్గింది. ఆ తరువాత నుంచి పెరుగుతూనే వస్తోంది. ఏఫ్రిల్‌లో రూ.5226 కోట్లు రాగా, అది సెప్టెంబర్‌కు వచ్చేసరికి రూ.4843 కోట్లకు పడిపోయింది. ఆ తరువాత అక్టోబర్లో రూ.6183 కోట్లు, నవంబర్‌లో గరిష్టంగా రూ.9114 కోట్లు, డిసెంబర్‌లో రూ.7369 కోట్లు వచ్చింది. జనవరిలో రూ.8 వేల కోట్లు దాటింది. ప్రభుత్వం ఉద్యోగులకు పిఆర్‌సి ప్రకటించడం, వయోపరిమితి పెంపు వంటి వాటితో పాటు సంక్షేమ పథకాలైన ఆసరా, బియ్యం సబ్సిడీ, రైతుబంధు, రైతుబీమా, స్కాలర్‌షిప్ వంటి వాటికి నిధులు పెరగనున్నందున బడ్జెట్ పెంపు తప్పనిసరి అని ఆర్థిక శాఖ నిపుణులు పేర్కొంటున్నారు.

Telangana Budget expected to increase 15% in 2020-21?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News