Sunday, April 28, 2024

మారణహోమాల్లో అష్టమ స్థానం!

- Advertisement -
- Advertisement -

భారత దేశంలో ఉన్న మైనారిటీల పట్ల బిజెపి ప్రభుత్వం విచక్షణా రహితంగా వ్యవహరిస్తోందని, ప్రపంచంలో జరిగే 14 సామూహిక హత్యకాండల్లో ఒకటి భారత దేశంలో జరుగుతోందని ‘ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్టు’ హెచ్చరించింది. సామూహిక హత్యా కాండలు జరిగే దేశాలను గుర్తించే ఈ సంస్థ గత నెల తన నివేదికను విడుదల చేసింది. మారణకాండకు వ్యతిరేకంగా అమెరికాలోని హోలోకస్ట్ మెమోరియల్‌లో ఏర్పాటు చేసిన సైమన్ స్కొజోడ్స్ సెంటర్, డార్ట్ మౌత్ కాలేజీలోని అంతర్జాతీయ అవగాహన కోసం ఏర్పడిన డిక్కీ సెంటర్ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించింది. సామూహిక హత్యాకాండలు జరుగుతున్న దేశాల్లో గత ఏడాది రెండవ స్థానంలో ఉన్న భారతదేశం ఈ ఏడాది (2022-23) ఎనిమిదవ స్థానానికి చేరుకోనుండడం కాస్త ఊరట కలిగించే అంశమే.

ప్రపంచంలో జరిగే మారణ కాండలో భారత దేశం వాటా ఈ ఏడాది 7.4 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. సామూహిక హత్యాకాండలను, అవి జరిగే అవకాశాలను గుర్తించి ‘ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్టు’ ఈ హెచ్చరిక చేసింది. ఒక ఏడాదిలో కానీ, అంతకు లోపల కానీ, ప్రభుత్వ భద్రతా బలగాల ద్వారా కానీ, ప్రభుత్వేతర బలగాల ద్వారా కానీ ఉద్దేశపూర్వకంగా వెయ్యి, అంతకు మించి ఎక్కువ మందిని సామూహికంగా హత్య చేయడాన్ని ఈ నివేదికలో పేర్కొంది. వాస్తవానికి ఈ నిర్వచనానికి సరిపోయే సామూహిక హత్యకాండతో పాటు ఈ నివేదికలో నరమేధాన్ని కూడా పొందుపరిచింది.

సామూహిక హత్యాకాండ జరుగుతున్న మొత్తం 162 దేశాల జాబితాలో పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉంది. యెమెన్ రెండవ స్థానంలో, మయన్మార్ మూడవ స్థానంలో, ఇథియోపియా నాలుగవ స్థానంలో, నైజీరియా ఆరవ స్థానంలో, అఫ్ఘానిస్తాన్ ఏడవ స్థానంలో ఉన్నాయి. సామూహికంగా జరిగే ఆరు హత్యాకాండలలో ఒకటి పాకిస్థాన్‌లో జరిగే అవకాశం ఉందని ఆ నివేదిక తెలిపింది. తొమ్మిదవ స్థానంలో ఉన్న సూడాన్ కంటే, పదవ స్థానంలో ఉన్న సోమాలియా కంటే, పదకొండవ స్థానంలో ఉన్న సిరియా కంటే, పన్నెండవ స్థానంలో ఉన్న ఇరాక్ కంటే, పద్నాలుగవ స్థానంలో ఉన్న జింబాబ్వే కంటే కూడా భారత దేశ పరిస్థితి హీనం గా ఉంది.

దారుణంగా ఉన్న 15 దేశాల్లో భారత దేశం గత ఐదేళ్ళుగా, గత ఏడాది (2021 22) వరకు రెండవ స్థానంలో ఉంది. భారత దేశం రెండవ స్థానం నుంచి ఎనిమిదవ స్థానానికి వెళ్ళడం పురుషుల స్వేచ్ఛలో వచ్చిన మార్పునకు సంకేతమని ఆ నివేదిక పేర్కొంది. భారత దేశంలో ఆ పరిస్థితి అలాగే కొనసాగినట్టయితే, పదకొండు శాతంతో ఈ ఏడాది మొదట్లో ఉన్న మొదటి స్థానం అలాగే కొనసాగేది. ఈ విశ్లేషణ కోసం భౌగోళిక కారణా లు, జనాభా వంటి దేశాల మౌలిక స్వభావం; స్థూల తలసరి ఉత్పత్తి వంటి సామాజిక ఆర్థిక ప్రమాణాలు, రాజకీయ అభ్యర్థుల పట్ల ఆంక్షలు, రాజకీయ పక్షాలు వంటి ప్రభుత్వ అంచనాలు, ఇతర తేడాలు వంటివి ఎదురైన ఇబ్బందులు.

విద్వేష ప్రసంగాలు

కేంద్రంలో, రాష్ట్రాలలో ఉన్న బిజెపి ప్రభుత్వం దేశంలో ఉన్న ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా ఎలా వివక్షతతో వ్యవహరిస్తున్నాయో అనేక సంఘటనల్లో ఈ నివేదిక వివరించింది. గత ఏడాది డిసెంబర్‌లో ముస్లింలను సామూహికంగా హత్య చేయాలని హిందూ జాతీయవాద నాయకులు, మత నాయకులు విద్వేష పూరిత ప్రసంగాలతో ప్రచారం చేశారు. ముస్లింలే ధ్యేయంగా అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. మసీదులను అపవిత్రం చేయాలని, ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇటీవల కాలంలో హిందూ జాతీయ వాదుల ప్రదర్శనలు జరిగాయి. హింసాత్మకంగా రెచ్చగొట్టడానికి కొనసాగింపుగా అనేక రాష్ట్రాలో అధికారులు ముస్లింల ఇళ్ళను బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. దీన్ని సామూహికంగా శిక్షించడంగా మతవాద సంప్రదాయ గ్రూపులు అభివర్ణించాయి. ముస్లింలను సామూహికంగా నిర్మూలించాలని విద్వేషపూరిత ప్రసంగాలతో చాలా మంది హిందూత్వ నాయకులు, బిజెపితో కలిసి ప్రయాణం చేస్తున్న వారు గత కొన్నేళ్ళుగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేష పూరితంగా ప్రసంగిస్తున్నారు.

రాష్ట్రాల్లో తొలి రోజుల్లో

అధికారిక లెక్కల ప్రకారం ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్లలో 53 మంది మరణించారు. ఈ సంఘటన జరగడానికి రెండు నెలల ముందు హిందూత్వ నాయకుడు యతి నారాయణ్ సింగానంద్ ముస్లింలను రాక్షసులుగా, దయ్యాలుగా అభివర్ణించినా, అతనిపైన ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈ మారణకాండ జరగడానికి ఒక రోజు ముందు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని బలవంతంగా తొలగించాలని బిజెపి నాయకుడు కపిల్ మిశ్రా పిలుపు నిచ్చాడు. కపిల్ మిశ్రా విద్వేష పూరిత ప్రసంగం వల్లనే ఢిల్లీ అల్లర్లు జరిగాయని నిజ నిర్ధారణ కమిటీ పేర్కొంది. తన విద్వేషపూరిత ప్రసంగాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కపిల్ మిశ్రా అనేక సార్లు ప్రకటించినా ఆయనపైన ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈ హింసలో ప్రత్యక్షంగా పాలు పంచుకున్నా శిక్షార్హం కాదని, భయపడాల్సిన అవసరం లేదని హిందూత్వ వాదులకు ఒక సందేశం పంపించినట్టు అయ్యిందని ‘ద వైర్’ చేసిన విశ్లేషణలో అజయ్ ఆశీర్వాద్ మహాప్రశాస్త పేర్కొన్నారు.

పెద్ద ఎత్తున గుమిగూడిన ప్రజలను ఉద్దేశించి బిజెపి నాయకుడు, ప్రస్తుత సమాచార ప్రసారాల శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ ‘దేశ్ కి గద్దారోంకో గోలీ మార్ సాలోంకో’ (ఈ దేశద్రోహులను కాల్చి చంపండి) అని పిలుపు ఇవ్వడం ఒక వీడియో లో స్పష్టంగా ఉంది. పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా బిజెపి అనుకూల హిందూత్వ వాదులు నిర్వహించిన ప్రదర్శనలో ‘గోలీ మార్ సాలోంకో’ (తుపాకీతో కాల్చి చంపండి) అన్నది ప్రధాన నినాదమై మోగింది. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా 2020లో జరిగిన సభలో హోం మంత్రి అమిత్ షా పక్కనే ఉండగా, ఠాకూర్ పదేపదే ఈ నినాదం చేశాడు. మిశ్రా ఈ నినాదం చేయడం వీడియోలో స్పష్టంగా ఉంది. ‘గోలీ మార్ సాలోంకో’ అన్న నినాదంలో తప్పేమిటి? అని ‘ద వైర్’ కిచ్చిన ఇంటర్వ్యూలో మిశ్రా సమర్థించుకున్నాడు. డిసెంబర్ 2021లో హరిద్వారలో జరిగిన ‘ధర్మ సంసద్’ (మత సమావేశం)లో హిందూత్వ నాయకులు ముస్లింల మారణ హోమానికి పిలుపు నిచ్చారు. మారణ హోమం జరగబోతోందనే ముందస్తు హెచ్చరిక భారత దేశంలో స్పష్టంగా కనిపించిందని ‘జెనోసైడ్ వాచ్’ అధ్యక్షుడు గ్రెగొరి స్టాన్‌టన్ కరన్‌థాపర్ కిచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

విద్వేష పూరిత ప్రసంగాలను ఖండించాలని ఆలోచన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏ కోశానా లేదని ఆయన స్పష్టం చేశారు. దీని పైన దృష్టి సారించడంలో ప్రధాని చాలా దూరంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ముస్లింలు నేరస్థులని, మాఫియాలని, దాడులు చేసేవారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ విద్వేష పూరితంగా తరచూ వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో శ్రీరామ నవమి పండుగ సందర్భంగా జరిగిన ఊరేగింపులో కత్తులు, కర్రలు చేతబూని మసీదుల ముందుకు వెళ్ళి ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్మాద పూరిత నినాదాలు చేశారు. అనేక మసీదులను అపవిత్రం చేసేలా వ్యవహరించారని అనేక నివేదికలు వెల్లడించాయి.

మత ఘర్షణల్లో అనేక మంది ముస్లింల ఇళ్ళను ధ్వంసం చేశారు. హిందూత్వ వాదులు ఇచ్చిన ‘సామూహిక శిక్ష’ పిలుపునకు స్పందనగా ఈ విధ్వంసం జరిగింది. క్రైస్తవులు, దళితులు వంటి ఇతర పీడిత మైనారిటీ వర్గాలు వివక్షకు, హింసకు గురవుతున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. అక్టోబర్ 2021లో విడుదల చేసిన నిజనిర్ధారణ కమిటీ నివేదిక ప్రకారం 2021లో తొమ్మిది నెలలకాలంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా మూడు వందల హింసాత్మక సంఘటనలు జరిగాయి. జమ్ము కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతూనే ఉందని ఈ నివేదిక తెలిపింది. జర్నలిస్టులపైన, మానవ హక్కుల కార్యకర్తల పైన భారత ప్రభుత్వం హింసతో పాటు హిందూ మతానికి చెందిన పౌరులపైన మిలిటెంట్ల దాడులు కూడా జరుగుతున్నాయని ఆ నివేదిక పేర్కొంది.

భారత దేశంలో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా తయారవడానికి ఇక్కడ ఉన్న అత్యధిక జనాభా, ఇక్కడ సామూహిక హత్యలు జరిగిన చరిత్ర, (దక్షిణ మధ్య ఆసియాలో) దీని భౌగోళిక పరిస్థితులు, భారత ప్రభుత్వానికి, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టులు)కు జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన మరణాలు, కశ్మీర్‌లో తిరుగుబాటుదార్లు కారణమని ఆ నివేదిక పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News