Monday, April 29, 2024

బిజెపి పోరుతోనైనా సర్కార్ నిద్రలేవాలి : తరుణ్‌చుగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నిరుద్యోగుల సమస్యలపై బిజెపి చేస్తున్న పోరాటంతో అయినా బిఆర్‌ఎస్ సర్కార్ నిద్ర లేవాలని ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. బుధవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షలో జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, డికె అరుణ, ఎంపి అర్వింద్, మురళీధర్ రావు, విజయరామారావు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బుర్ర నర్సయ్యగౌడ్, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తరుణ్‌చుగ్ మాట్లాడుతూ పదేండ్లుగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఏదీ నెరవేర్చలేదన్నారు. ఈ నవంబర్‌తో బిఆర్‌ఎస్ పార్టీ పతనం తప్పదన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువత తెలంగాణ కోసం పోరాటం చేశారని..

1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారని చెప్పారు. ‘తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని భావిస్తే బిఆర్‌ఎస్ సర్కారు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆయన చేతగానితనం వల్ల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. అప్పు చేసి లక్షల రూపాయలు ఖర్చు చేసి పరీక్షలు రాస్తే.. ప్రశ్న పత్రాలు లీక్ చేశారు. ప్రశ్న పత్రాల లీక్‌పై పోరాటం చేస్తే బండి సంజయ్ పై కేసులు పెట్టారు. తొమ్మిదేళ్ల నుంచి డీఎస్సీ వేయలేదు. గ్రామాల్లోకి వచ్చి ఓట్లు అడిగే నైతిక హక్కు బిఆర్‌ఎస్ నేతలకు లేదన్నారు. నిరుద్యోగ భృతి ఏమైందో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. హోంగార్డు రవీందర్ ఆత్మహత్య చేసుకోలేదు.. బిఆర్‌ఎస్ సర్కారు హత్య చేసిందని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు తీసుకుంటున్నారు. బంగారు తెలంగాణలో ఆర్థిక సంక్షోభం తీసుకొచ్చారు. ఖబడ్డార్ ముఖ్యమంత్రి.. మిలియన్ మార్చ్ చేసిన చోటే మీ పార్టీని యువత పాతరేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి కెసిఆర్ ఆర్థిక సహాయం చేసి బలోపేతం చేస్తున్నారు‘ అని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

 యువత ప్రాణాలను బలిగొన్నారు : డికె అరుణ
తెలంగాణ ఉద్యమ సమయంలో యువతకు ఆశలు కల్పించి.. బిఆర్‌ఎస్ నేతలు నిరుద్యోగ యువత ప్రాణాలు బలిగొన్నారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్నపత్రాలు లీక్ చేశారని.. బాధ్యులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థ ఇంకా ఎందుకు నడుస్తుందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేసిన బిఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని డికె అరుణ హెచ్చరించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ఒక బోగస్ అన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు అంచనాలు పెంచి.. అడ్డగోలుగా ప్రజా ధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. పూర్తి కానీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధం అయ్యారని విమర్శించారు.

జమిలి” అంటే అంత జంకెందుకు : బండి సంజయ్
తెలంగాణ బలిదానాల స్ఫూర్తితో బిఆర్‌ఎస్‌ను గద్దె దించేదాకా యువత పోరాడాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కోరారు. “జమిలి” ఎన్నికలంటే కెసిఆర్ కుటుంబం వణికిపోతోందని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మా ముందు బిఆర్‌ఎస్ పాలన కొట్టుకుపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశద్రోహుల పార్టీని సంతృప్తి పర్చేందుకే సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినోత్సవ పేరిట నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఆ రోజు పబ్లిక్ గార్డెన్ లో కాదు…దారుస్సలాంలో ఉత్సవాలు జరుపుకోండి”అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వం బిజెపిదే: అర్వింద్
బిఆర్‌ఎస్ పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్‌లో క్లారిటీ ఉండదు. ఉన్నా.. పరీక్ష సరిగ్గా నిర్వహించరని ఎంపి ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. పరీక్షలు నిర్వహించినా.. పేపర్ లీక్ చేస్తారు. కేంద్రం పరీక్ష పెట్టినప్పుడే.. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పరీక్షలు పెడుతున్నారు. నిరుద్యోగులే పరీక్షలు వాయిదా వేయాలని అడిగేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది బిఆర్‌ఎస్ నేతల తెలివి. అందుకే నేను ముందుండి పోరాడుతున్నా. బిడ్డను. ఓడించా.. బిఆర్‌ఎస్‌ను గద్దె దింపుతా, ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వం బిజెపిదే అన్నారు. దీక్ష కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ రావు, గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు, శ్యామ్‌సుందర్‌గౌడ్, శాంతికుమార్, నాగురం నామోజీ,గూడూరు నారాయణ రెడ్డి, బండ కార్తీక రెడ్డి, బిజెపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News