Monday, April 29, 2024

బిజెపి పాచికలు

- Advertisement -
- Advertisement -

BJP strategy is to defeat Congress

 

ఈ నెల 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు గుజరాత్‌లో బిజెపి మాయ పాచికలాటకు మళ్లీ తెర లేపాయి. ఆ రాష్ట్రంలో గత కొద్ది రోజుల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు శాసన సభకు రాజీనామా చేశారు. గత మార్చిలో ఇదే పని చేసిన ఐదుగురిని కలుపుకుంటే రాజ్యసభ ఎన్నికల సందర్భంగా మొత్తం 8 మంది కాంగ్రెస్ సభ్యులు శాసన సభ నుంచి నిష్క్రమించా రు. అసెంబ్లీలో ఉండే సభ్యుల సంఖ్యను బట్టి రాజ్యసభ ఎన్నికల్లో ఒక్కొక్క అభ్యర్థికి అవసరమైన ఓట్ల సంఖ్య నిర్ధారణ అవుతుంది. కాంగ్రెస్ ఎంఎల్‌ఎల చేత రాజీనామా చేయించడం ద్వారా ఇటు అవసరమయ్యే ఓట్ల సంఖ్యను పరిమితం చేయడం, కాంగ్రెస్ అభ్యర్థుల ఎన్నిక అవకాశాలను దెబ్బ తీయడం అనే వ్యూహాన్ని బిజెపి అమలు చేస్తున్నది. కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకున్న 70కి పైగా స్థానాలు యథాతథంగా దానికి ఉండి ఉంటే ఈ రాజ్యసభ ఎన్నికల్లో రెండు స్థానాలను అది అవలీలగా గెలుచుకొని ఉండేది.

8 మంది సభ్యులు రాజీనామా చేయడంతో గుజరాత్ శాసన సభలో దాని బలం 65కి పడిపోయింది. దీనితో రెండవ రాజ్యసభ స్థానాన్ని సులభంగా గెలుచుకోలేని స్థితి దానికి ఎదురయింది. ఈసారి 7 రాష్ట్రాల నుంచి 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌ల నుంచి నాలుగేసి స్థానాలకు (8) మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల నుంచి మూడేసి సీట్లకు (6), జార్ఖండ్ నుంచి రెండింటికి (2) మణిపూర్, మేఘాలయ నుంచి చెరి ఒక స్థానానికి (2) ఎన్నికలు జరుగుతాయి. వాస్తవానికి గుజరాత్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు గత మార్చి 26నే ఎన్నికలు జరిగిపోయి ఉండవలసింది. ఏప్రిల్ 9న పదవీ కాలం ముగిసిన నలుగురు రాజ్యసభ సభ్యుల స్థానాలను పూరించడానికి ఆ ఎన్నికలను ఉద్దేశించారు. ఆ సందర్భంలో ఐదుగురు కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీకి రాజీనామా చేశారు.

కరోనా కారణంగా ఆ ఎన్నికలు వాయిదా పడి ఇప్పుడు జరుగుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అటు మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికిగాని, ఇప్పుడు గుజరాత్‌లో ఆ పార్టీ ఎంఎల్‌ఎల చేత రాజీనామా చేయించడానికిగాని ఏమాత్రం వెనుకాడకపోడం, అది భ్రష్ఠాచారమని భావించి సిగ్గు పడకపోడం దేశ రాజకీయాల పతన గతిని మరో కింది మెట్టుకు తీసుకెళ్లాయి. 245 మంది సభ్యులు గల రాజ్యసభలో 75 మంది బలంతో భారతీయ జనతా పార్టీ అతి పెద్ద శక్తిగా ఉన్నది. అయినా సొంతంగా స్పష్టమైన మెజార్టీ లేకపోడం దానికి వెలితిగా మిగిలిపోయింది. ఎటువంటి బిల్లునైనా చట్టం చేయించుకోడానికి వేరెవరినీ బతిమలాడనవసరం లేని స్థితిని సాధించుకోవాలన్నది దాని ఆరాటం. రాజ్యసభలో మెజార్టీ లేకపోయినా ఇతరుల మద్దతు కూడగట్టడం ద్వారా, దొడ్డి దారి వ్యూహాలతో ట్రిపుల్ తలాఖ్, పౌరసత్వ సవరణ, జమ్మూ కశ్మీర్ పునర్వవస్థీకరణ వంటి వివాదాస్పదమైన కీలక బిల్లులను విజయవంతంగా చట్టాలు చేయించుకోగలిగింది.

బిఎస్‌పి వంటి పార్టీల సహకారాన్ని కూడా సాధించుకొని రాజ్యసభలో అవసరమైన బలాన్ని సమీకరించుకోగలిగింది. రాజ్యసభ అవసరాన్ని దాటవేయడానికి నిబంధనలను అతిక్రమించి కొన్ని బిల్లులకు ద్రవ్య బిల్లులనే ముద్ర వేయించి లోక్‌సభ ద్వారా చట్టాలు చేయించుకొనే తెలివి తేటలను ప్రదర్శించింది. లోక్‌సభలో పొందిన ఎదురులేని మెజార్టీతో సంపాదించుకున్న తిరుగులేని అధికారాన్ని ప్రయోగించి తాను ఏది కోరుకుంటే దానిని సఫలం చేసుకోగలిగింది. దేశ రాజ్యాంగం అనుమతించని మత ప్రాతిపదిక పౌరసత్వాన్ని కల్పించే బిల్లుకు కూడా శాసన రూపం ఇప్పించుకోగలిగింది. లోక్‌సభ ఎన్నికల ఘన విజయాలు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ సమరాల్లో కూడా రుజువై ఉంటే బిజెపి రాజ్యసభలో మరిన్ని స్థానాలను అవలీలగా మూటగట్టుకొని ఉండేది. కాని గత లోక్‌సభ ఎన్నికలలో దానికి అఖండమైన పట్టం కట్టిన రాష్ట్రాలే ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన పరాజయాలు చవిచూపించాయి.

ఢిల్లీ, జార్ఖండ్ వంటి రాష్ట్రాలలో వచ్చిన ఫలితాలే ఇందు కు నిదర్శనం. ఇప్పుడు రాజ్యసభలో వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకోడానికి ముఖ్యం గా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో అది కదుపుతున్న పావులు ఎంత మాత్రం ప్రజాస్వామికమైనవి కావు. ఇలా బిజెపి ఇతర పార్టీల శిబిరాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా బలాన్ని పెంచుకునే దుర్వ్యూహానికి పాల్పడడం జాతీ య పాలక పార్టీగా దానికి ఎంత మాత్రం శోభస్కరం కాదు. చేతివాటం అలవాటైనవారు అవసరం లేకపోయినా దొంగతనాలకు పాల్పడినట్టు అత్యంత ప్రజాభిమానం చూరగొన్న ఈ పార్టీ గుజరాత్‌లో వెనుకటి గుణాన్ని వదులుకోలేకపోడం అత్యంత బాధాకరం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News