Monday, April 29, 2024

పశ్చిమ కాబూల్‌లో బాంబు పేలుళ్లు.. 40మంది మృతి

- Advertisement -
- Advertisement -

Blasts targeting Afghan school in Kabul kill 40

40మంది మృతి, 40మందికిపైగా గాయాలు
మృతుల్లో అధికభాగం విద్యార్థినులే
ఐఎస్ ఉగ్రవాదుల పనే అంటున్న తాలిబన్లు

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లోని పశ్చిమకాబూల్ జిల్లాలో శనివారం జరిగిన బాంబు పేలుళ్లలో 40మంది చనిపోగా, మరో 40మందికిపైగా గాయపడ్డారు. షియాలు అధికంగా ఉండే దస్త్‌ఎబార్చీ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్టు అధికారులు తెలిపారు. ఓ పాఠశాల పక్కన ఈ బాంబు పేలుళ్ల ఘటన జరిగిందని, మృతుల్లో అధికభాగం మహిళా విద్యార్థులేనని అధికారులు తెలిపారు. పౌరులపై జరిగిన ఈ దాడిని ఖండిస్తున్నట్టు తాలిబన్లు ప్రకటించారు. దాంతో, ఈ దాడికి పాల్పడింది ఎవరన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. సున్నీ వర్గానికి చెందిన తీవ్రవాదులు షియాలపై యుద్ధం ప్రకటించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా మాత్రం ఆఫ్ఘన్‌లో షియాలపై జరుగుతున్న దాడుల వెనుక ఇస్లామిక్ తీవ్రవాదులున్నారని అంటోంది.

ఇప్పుడు బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతంలో గతేడాది ఓ ప్రసూతి హాస్పిటల్‌పై దాడి జరిపిన ఉగ్రవాదులు ఓ గర్భిణీసహా పలువురు చిన్నారులను బలిగొన్నారు. తాజా దాడి విషయంలో ఐఎస్ ఉగ్రవాదులపైనే తాలిబన్లు సైతం ఆరోపిస్తున్నారు. షియాలతోపాటు మహిళా జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను హత్యగావించిన ఐఎస్ ఉగ్రవాదుల పట్ల ఆఫ్ఘనిస్థాన్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు అమెరికా నిఘావర్గాలు చెబుతున్నాయి. అమెరికా సైనికుల ఉపసంహరణ ప్రారంభమైన కొన్ని రోజులకే ఈ దాడి జరగడం స్థానిక ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. అమెరికాకు చెందిన దాదాపు 3500మంది సైనికుల ఉపసంహరణ ప్రక్రియను ఇటీవలే ఆ దేశం ప్రారంభించింది. సెప్టెంబర్ 11 వరకల్లా ఈ ప్రక్రియ పూర్తి కానున్నది. తాలిబన్లు ఇప్పటికే ఆఫ్ఘన్‌లోని సగం ప్రాంతాల్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నట్టు అంచనా. ఆఫ్ఘన్ ప్రభుత్వానికి ఇక గడ్డు కాలమేనని స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న ఓ అమెరికా మిలిటరీ అధికారి అన్నారంటే పరిస్థితి ఎలా ఉండనున్నదో అర్థమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News