Monday, April 29, 2024

ముంబై బాలీవుడ్ దోస్త్-దుష్మన్

- Advertisement -
- Advertisement -

Bollywood Drug Case in Mumbai

 కత్తులు దూసుకున్న బిజెపి, సేన
హిందీ చిత్రసీమ యుపికి ఉడాయింపు?

ముంబై : ముంబై నుంచి క్రమేపీ బాలీవుడ్ ఉత్తరప్రదేశ్‌కు తరలివెళ్లనుందనే వార్తలు రాజకీయ రచ్చను రేకెత్తించాయి. డ్రగ్స్ మాఫియా ఇతర కారణాలు చూపుతూ ముంబైలోని హిందీ చలన చిత్ర పరిశ్రమను బిజెపి కావాలనే యుపికి తరలించేందుకు కుట్ర పన్నిందని శివసేన విరుచుకుపడుతోంది. వర్థిల్లుతున్న నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంతుచిక్కని మరణం పలు విధాలుగా మలుపులు తిరిగింది. పలువురు బాలీవుడ్ తారలు కేంద్రీకృతంగా మాదకద్రవ్యాల రాకెట్ సాగుతోందని, పలువురు ముంబైసినీ వాలాలు మత్తుమందుకు అలవాటుపడ్డారనే మచ్చపడింది. ఈ కోణంలోనే నార్కొటిక్ బ్యూరో, సిబిఐ దర్యాప్తులు సాగుతున్నాయి. ప్రస్తుత తరుణంలోనే యుపి సిఎం యోగి ఆదిత్యానాథ్ లక్నోలో సినీ ప్రముఖులను ఆహ్వానించారు. యుపిని వారంతా తమ చిత్రనిర్మాణానికి అనువైన కేంద్రంగా మల్చుకోవచ్చునని తెలిపారు.

ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. దీనితో వివాదాస్పద ముంబై నుంచి బాలీవుడ్ ఉత్తరాది, అందులోనూ హిందీ ప్రాబల్య ప్రాంతం అయిన యుపికి తరలివెళ్లుతుందనే వాదన పలు రకాల వార్తలకు దారితీసింది. ఒక్కరోజు క్రితమే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్రస్థాయిలో స్పందించారు. ముంబై కేంద్రంగా ఉన్న బాలీవుడ్ పరిశ్రమపై బురదచల్లి, దీనిని ఇతర ప్రాంతాలకు తరలించాలనే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని విమర్శించారు. దీని వెనుక ఉన్న శక్తులు ఎవరనేది తెలుసునని, వారి ప్రయత్నాలను తాము సాగనిచ్చేది లేదని హెచ్చరించారు. శివసేన తరఫు అధికార పత్రిక సామ్నాలో కూడా ముంబై బాలీవుడ్‌పై కుట్రను నిరసిస్తూ వార్తలు వెలువరించారు. సుశాంత్ మృతి తరువాత సాగుతోన్న దర్యాప్తు క్రమంలో ముఖ్యమంత్రి బాలీవుడ్ పరిణామాల గురించి స్పందించడం ఇదే తొలిసారి. సుశాంత్ మృతి కేసు గురించి మహారాష్ట్ర బీహార్ ప్రభుత్వాల మధ్య దర్యాప్తు విషయంలో చిచ్చు రగులుకుంది.

ముంబై పోలీసు అధికారుల బృందాన్ని బీహార్ పోలీసు అధికారులు ప్రశ్నించడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ దశలోనే కేంద్రం జోక్యంతో కేసు దర్యాప్తు సిబిఐ చేతుల్లోకి వెళ్లింది. ఈ దర్యాప్తు సాగుతున్న దశలో అనుబంధ అంశంగా తెరపైకి బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్‌కు బాలీవుడ్‌ను తరలించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్‌సిపి సీనియర్ నేత నవాబ్ మాలిక్ శుక్రవారం స్పందించారు. ముంబై నుంచి దీనిని యుపికి తరలించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. భారతదేశంలోనే అతి పెద్ద మెగాఫిల్మ్‌సిటీని యుపిలో ఏర్పాటు చేస్తామని, ఇతరత్రా తాయిలాలు ఇస్తామని గత నెలలో యుపి సిఎం వరాలు వెలువరించడం, తరువాతి పరిణామాలు, వెలువడుతున్న వార్తలు అన్ని కూడా బాలీవుడ్‌కు ఎసరు పెట్టడానికే అని మాలిక్ అనుమానాలు వ్యక్తం చేశారు. బాలీవుడ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఉంటుందని తరచూ వ్యతిరేకించే ఎంఎన్‌ఎస్ ప్రకటించింది. బిజెపి ప్రోద్బలంతోనే మహారాష్ట్ర పరువు తీసే యత్నాలు జరుగుతున్నాయనే వాదనను మహారాష్ట్ర బిజెపి నేతల అమర్‌జీత్ మిశ్రా ఖండించారు.

బాలీవుడ్ వేరే చోటికి తరలివెళ్లే విషయంలో బిజెపి ప్రోద్బలం ఏమీ లేదని, సినీ ప్రముఖులు వారంత వారుగా తమ కార్యకలాపాలను ఇతర చోట్లకు తీసుకునిపోతే తాము చేసేది ఏముంటుందని మిశ్రా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ వాస్తవిక పరిస్థితిని అర్ధం చేసుకుని మాట్లాడితే మంచిదని సలహా ఇచ్చారు. ముంబైలోని ఫిల్మ్‌సిటిని మరింతగా విస్తరించడానికి రాష్ట్రంలోని గత ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు రూ 2050 కోట్ల గ్రాంటును ఖరారు చేసిందని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ విషయంలో చేసిందేమీ లేదని, అప్పటి నిర్ణయాన్ని అటకెక్కినట్లుగా నిర్థారించుకునే బాలీవుడ్ ముంబై నుంచి తరలివెళ్లుతోందని ఇది ఎవరి తప్పు అని బిజెపి నిలదీసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News