Monday, April 29, 2024

ఏ క్షణమైనా బిఆర్‌ఎస్ తొలి జాబితా

- Advertisement -
- Advertisement -

ముందుగా ఎన్నికల్లో గెలిచే రేసు గుర్రాలు
ఆ తర్వాత సర్వేల ఆధారంగా టిక్కెట్లు ఖరారు
తొలి జాబితాలో తమ పేర్లు ఉంటాయా? లేదా?..
తీవ్ర ఉత్కంఠకు లోనవుతున్న అభ్యర్థులు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో హ్యాట్రిక్ లక్ష్యంగా కసరత్తులు చేస్తున్న గులాబీబాస్.. రేసుగుర్రాల జాబితాను ముందుగానే ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత సర్వేల ఆధారంగా ఏ నియోజకవర్గంలో ఎవరిని బరిలోకి దించితే గెలుస్తారని ఓ అంచనాకు వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు బిఆర్‌ఎస్ అధిష్టానం అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. బిఆర్‌ఎస్ తొలి జాబితా ప్రకటించిన తర్వాత అభ్యర్థులు ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.
కొలిక్కి వచ్చిన అభ్యర్థుల ఎంపిక
అసెంబ్లీ ఎన్నికలకు బిఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్, ఇతర ముఖ్యనేతలు సుధీర్ఘంగా కసరత్తు చేసి తొలి జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఏ క్షణమైనా బిఆర్‌ఎస్ తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. శనివారం లేదా సోమవారం తొలి జాబితాను బిఆర్‌ఎస్ అధినేత ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈనెల 20వ తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్ సూర్యాపేట జిల్లాలో కలెక్టరేట్, ఎస్‌పి కార్యాలయం, బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవాలతో పాటు బహిరంగసభలో పాల్గొననున్నారు. ఆ సభకు ముందురోజు లేదా మరుసటి రోజు అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటిస్తారని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. 10 లేదా 12 మందిని మినహాయిస్తే.. దాదాపు సిట్టింగ్ అభ్యర్థులు అందరినీ బరిలోకి దించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈసారి ముఖ్యమంత్రి కెసిఆర్ కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం జరగుతుండగా, ఈసారి కూడా గజ్వేల్ నుంచే పోటీ చేస్తారని బిఆర్‌ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తొలి జాబితాలో ఎంతమంది..?
బిఆర్‌ఎస్ అధినేత ఎంతమంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటిస్తారని గులాబీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. మొదటి విడతలో 60 నుంచి 70 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది కొంతమంది పేర్కొంటుండగా, 81 మందితో తొలి జాబితా ప్రకటిస్తారని మరికొంతమంది అంటున్నారు. అన్ని స్థానాలకూ ప్రకటించేస్తే పూర్తిస్థాయిలో ఎన్నికలబరిలోకి దిగవచ్చని, ఎవరైనా వెనకబడితే మార్చుకోవడానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో అభ్యర్థులెవరినీ మార్చకపోవచ్చని తెలుస్తోంది. అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో గత ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో కొంతమందిని మార్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొంతమంది సిట్టింగ్‌లను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. పలు సర్వేల తర్వాత కొంతమంది సిట్టింగ్‌లను మార్చాలని బిఆర్‌ఎస్ అధినేత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈసారి కూడా శ్రావణం సెంటిమెంట్ కొనసాగించే అవకాశం
గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్ 105 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను శ్రావణంలోనే ప్రకటించింది. ఈసారి కూడా ఆ సెంటిమెంట్ కొనసాగించే అవకాశం ఉంది. ఆషాడం, అధికమాసం పూర్తి కావడంతో తొలి జాబితా విడుదలకు సిఎం కెసిఆర్ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. శ్రావణమాసం ప్రారంభమైన నేపథ్యంలో ఏ క్షణంలో అయినా అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందుగా బిఆర్‌ఎస్ పార్టీ 105 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను 2018 సెప్టెంబర్ 7వ తేదీన ప్రకటించింది. ఈ నెల 21న పంచమితో కూడిన శ్రావణ సోమవారాన్ని విశేషమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటంతో అదేరోజు కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
అభ్యర్థుల్లో ఉత్కంఠ
కొంతమంది సిట్టింగ్‌లను మార్చుతారనే ప్రచారం జరుగుతుండటంతో బిఆర్‌ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న సిట్టింగ్‌లు, ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠకు లోనవుతున్నారు. కొంతమంది తమకు సీటు ఖరారు అయ్యిందని ప్రచారం చేసుకుంటుండగా, మరికొంతమంది మొదటి జాబితాలో తమ పేర్లు ఉంటాయని ప్రచారం చేసుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాలలో ద్వితీయ శ్రేణి నాయకులు తమకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఈ ఎన్నికల్లో సిట్టింగ్‌కు కాకండా తమకే సీటు పక్కా అంటూ ప్రచారం చేసుకుంటూ పార్టీ కార్యకర్తలతో కలిసి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే బిఆర్‌ఎస్ అధినేత తొలి జాబితాలో ప్రకటించే పేర్లతో తమ పేరు ఉంటుందో…ఉండదో అని తీవ్ర ఉత్కంఠను గురవున్నారు. కొందరు హైదరాబాద్‌లోనే ఉంటూ పార్టీ ముఖ్యనేతల చుట్టూ ప్రదిక్షిణలు చేస్తూ మొదటి జాబితాలోనే తమ పేర్లు ప్రకటించేలా అధినేతకు సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. టిక్కెట్ల విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెబుతూనే తమకు టికెట్ వస్తుందా..? రాదా..? అని అంతర్మథనం చెందుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News