Monday, April 29, 2024

కాంగ్రెస్ నావను రేవంత్ గట్టెక్కించేనా?

- Advertisement -
- Advertisement -

Can Rewanth reddy bring prestige to Congress!

 

చాలా కాలంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులెవరన్న ప్రశ్నకు ఎవరి నుండీ సమాధానం వచ్చేది కాదు. తెలంగాణలో కె.సి.ఆర్ రెండవ సారి అధికారం చేజిక్కించుకొన్న నాటి నుండి కూడా తెలంగాణ కాంగ్రెస్‌కు త్వరలో కొత్త నాయకుడిని ప్రకటిస్తారు అన్న వార్తే వింటూ వచ్చాం. ఉదయం పూట టివి చర్చల కార్యక్రమాల్లో టిపిసిసి అధ్యక్షుడి నియామకం గూర్చి అనేక మార్లు చర్చకు వచ్చినప్పుడు, అసలు ఇంకా ఎఐసిసి ప్రెసిడెంట్ నియామకానికే దిక్కులేదు. ఇక టిపిసిసి నియామకమా? అంటూ అందరూ ఎద్దేవా చేసేవారు. అలాంటి గందరగోళం ఫులిస్టాప్ పెడుతూ రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించారు. జూన్ 26 సాయంత్రం వొక్కసారిగా రేవంత్ నియామకం ప్రకటన మెరుపులా మెరిసింది. ఏడాది నుండి పిసిసి అధ్యక్ష ఆశావహులు చాలా మంది ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వచ్చారు. అధిష్ఠానం కూడా ఈ చిక్కుముడిని అలాగే నాన్చుతూ వస్తున్నది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ముందు కూడా అదిగో ఇదిగో అంటూ వొకరిద్దరి పేర్లు హల్‌చల్ చేశాయి.

కానీ ఎన్నికల ముందు కొత్త వ్యక్తిని ప్రకటిస్తే, అసంతృప్తులు కాడె క్రింద పడేసి జానారెడ్డికి గోతులు తవ్వతారని, ఎన్నికల అనంతరం అధ్యక్షుణ్ణి ప్రకటిస్తారని కూడా చెప్పుకొచ్చారు. మరి నాగార్జున సాగర్ ఎన్నికలు ఏప్రిల్ 17న జరిగాయి. మరి ఇంత జాప్యం ఎందుకు జరిగిందో? ఏమైతేనేం ఎట్టకేలకు రేవంత్ రెడ్డిని పిసిసి పీఠం ఎక్కించేశారు. కాకుంటే ఈ రోజుకీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుణ్ణి మాత్రం ప్రకటించ లేదు. తెలంగాణకైనా ప్రకటించడం కొద్దిగా సంతోషించాల్సిందే. జులై 7వ తారీఖున లక్షమంది కార్యకర్తల సమక్షంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని, అందుకనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని మీడియాల్లో వార్తలు విస్తృతంగా వస్తున్నాయి. అదెలా జరుగుతుందో అన్నది చర్చనీయాంశం కాదు.

కోమాలో వున్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ బతికించగలడా? మునిగిపోయిన నావను రేవంత్ ఒడ్డుకు చేర్చగలడా! కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురాగలడా! విజయ పథాన దూసుకుపోతున్న టిఆర్‌ఎస్ పార్టీని ఓడించడం రేవంత్ వల్ల సాధ్యమా! కాంగ్రెస్‌లో తలపండిన పెద్దలెందరో వున్నారు. వారంతా రేవంత్‌కు సంపూర్ణ సహాయ సహకారాలు అందీయగలరా! దుబ్బాక, జిహెచ్‌ఎమ్‌సి ఎన్నికల్లో ఘన విజయాల్ని అందుకొని దూకుడుగా మందుకెళ్తున్న కాషాయ పార్టీని దాటి రేవంత్ పరుగు అందుకోగలడా! ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు ఈ రోజు అందరి మనసుల్లో మెదులుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ గూర్చి, రేవంత్ స్టామినా గూర్చి, కెసిఆర్ ప్రభను గూర్చి చర్చించుకొందా.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పాతాళం నుండి పైకి రాలేకపోతున్నది. ఆ పార్టీకి అధ్యక్షులు లేరు. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నాయకులు లేరు. రాహుల్ గాంధీ ఆ ముళ్ళ కిరీటం నాకొద్దంటూ పారిపోతున్నాడు. సోనియాగాంధీ అనారోగ్యంతో బండిని లాగలేక పోతున్నది. చుట్టూ చీకటి, వెలుగు కిరణాల జాడే లేదు. వొక్కప్పుడు కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించి దాదాపు వందేళ్ళుగా పాలన సాగిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ సామ్రాజ్య విస్తీర్ణం చాలా కుదించుకుపోయి ఓ చిన్న ద్వీపంలా రూపుదిద్దుకొంది ఈ రోజు. మన భారతదేశ పటం అడుగు భాగంలో మనకు శ్రీలంక పటం అతి చిన్నదిగా కన్పిస్తూ వుంటుంది. మరి భారతదేశ పటమంతగా విస్తరించి వున్న కాంగ్రెస్ సామ్రాజ్యం పాపం ఈ రోజు శ్రీలంక పటం అంతగా మారిపోయింది. ప్రస్తుతం కేవలం 3 రాష్ట్రాలలోనే ఆ పార్టీ పాలన సాగిస్తోంది. దాదాపు అర్ధ శతాబ్దం కాలంగా కాంగ్రెస్‌లో చక్రం తిప్పుతూ ఓ వెలుగు వెలిగిన మహా నేతలు దాదాపు 23 మంది గత ఏడాది నవంబర్‌లో పార్టీ నిర్వహణ, తీరుపై సోనియా గాంధీకి ప్రత్యక్షంగా ఓ లేఖ రాస్తూ తమ అసమ్మతిని, ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు.

ఇది కాంగ్రెస్ పార్టీలో ఓ పెద్ద భూకంపం అనే చెప్పవచ్చు. ఈ లేఖపై సంతకం చేసిన వారిలో 5 మంది మాజీ ముఖ్యమంత్రులు, సిట్టింగ్ ఎంపిలు శశిధరూర్, మనీష్ తివారి, అనేక మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, 12 మందికిపైగా కేంద్ర మాజీ మంత్రులు వున్నారు. వీరిలో గులాం నబీ అజాద్, కపిల్ సిబాల్ లాంటి ఎందరో పేరొందిన వారు కూడా వున్నారు. వారు రాసిన లేఖ బజారున పడి కాంగ్రెస్ పరువు పూర్తిగా గంగలో కలిసింది. అసలు దేశంలో కాంగ్రెసు పార్టీ బిజెపికి ఎంత మాత్రం ప్రత్యామ్నాయం కాదని, కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించే స్థితిలో లేరని వారు ఆ లేఖలో కుండబద్దలు కొట్టారు. వారి లేఖ తర్వాత కూడా ఆ పార్టీలో దిద్దుబాట్లు జరగకపోగా, ఈ రోజు వరకు జరిగిన అన్ని ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ పరాజయాల్నే అందుకొంటున్నది. గత నెల 24న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఆ మీటింగ్‌లో అనేక దిద్దుబాటు చర్యలు, మార్పులు జరుగుతాయని కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో ఆశగా ఎదురూ చూసి చివరికి నిరాశ చెందారు.

అదేంటో కాంగ్రెస్ పార్టీ రోజురోజూకు సున్నా స్థానానికి చేరుతున్నా సోనియాకు గాని, రాహులకు కానీ చీమ కుట్టినట్లయినా లేదు. నిద్రలేవడం లేదు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించడం లేదు. ఎలాగైనా పార్టీని బతికించుకొందామన్న తపన లేదు! ప్రస్తుతం తమ పాలనలోని రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలలో అంతర్గత కలహాలతో, కుమ్ములాటలతో అధికారం కోల్పోయో స్థితికి చేరాయి. మధ్యప్రదేశ్‌లో జ్యోతి రాదిత్యరాజ్ సింధియా తిరుగుబాటుతో కాంగ్రెస్ తమ అధికారాన్ని బిజెపికి కట్టబెట్టింది. తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలలో ఇతర పార్టీలతో కలసి అధికారం పంచుకొంటున్నది. చతీస్‌గఢ్‌లో అధికారంలో వున్నా అక్కడా సవ్యంగా లేదు. కాంగ్రెసు వేసే ప్రతి అడుగులో కూడా ‘దురదృష్టం’ వారిని వెంబడిస్తూనే వుంది. మొన్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ వొక్క సీటూ గెలవక పోగా 2.93 శాతం ఓట్లతో చాలా పెద్ద ఓటమిని రుచి చూసింది. గతంలో ఎన్నడూ కాంగ్రెస్ పార్టీకి ఇంత ఘోర పరాజయం రాలేదు.

పది సంవత్సరాల కాలంలోని కాంగ్రెస్ పార్టీ స్థితి గతుల్ని సమీక్ష చేస్తే ఆ పార్టీకి ఇప్పట్లో కనుచూపు మేరలో అధికారం అన్నది ‘కల’గానే మిగిలేటట్లు కన్పిస్తున్నది. ఇక గాంధీ పేరున్న కుటుంబీకులు రాజ్యాధికారానికి రారేమోనన్న దిగులు అసలైన కాంగ్రెస్‌వాదుల్లో స్పష్టంగా కన్పిస్తున్నది. కొత్తకొత్త పథకాలతో, వినూత్న ఆలోచనలతో పార్టీని నడిపేందుకు రాహుల్ ఎందుకనో ముందుకు రావడంలేదు. జాతీయ స్థాయిలోనే ఆ పార్టీ పరిస్థితి అలావుంటే ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ను రేవంత్ గట్టెక్కిస్తాడా?
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి జాతీయ స్థాయిలో కంటే భిన్నంగా లేదు. టిఆర్‌ఎస్ అధికారానికొచ్చాక ఈ పార్టీకి ఎక్కడా గెలుపన్నదే లేదు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో గెలవగలిగింది. వారు ఉత్తమ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అనుముల రేవంత్ రెడ్డిలు. మొన్న జరిగిన నాగార్జున సాగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పక గెలుస్తుందని, అది జానారెడ్డి కంచుకోట అని రకరకాల విశ్లేషణలు చేశారు.

చివరికి కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, తెలంగాణ ఇచ్చిన సోనియాకే ప్రజలు పట్టం కడుతారని అందరూ ఊహించారు. కానీ ఆ పార్టీ 21 స్థానాల్నే దక్కించుకోగలిగింది. 2018లో మహా కూటమిలో భాగంగా కాంగ్రెస్ 100 సీట్లలో పోటీ చేసి 19 స్థానాలు మాత్రమే దక్కించుకొంది. తెలుగుదేశం పార్టీతో తొలిసారిగా పొత్తుపెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ చాలా నష్టపోయింది. గెలిచిన ఎంఎల్‌ఎల్లో కూడా మూడోవంతు సభ్యులు టిఆర్‌ఎస్ గూటికి చేరిపోయారు.కాకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం 2014లో 25.02% శాతం కాగా, 2018లో 28.4% శాతం వచ్చాయి. ఓట్ల శాతం పెరగడమొక్కటే ఆ పార్టీకి మిగిలిన ఆనందం.నవంబర్ 2020లో దుబ్బాకలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పడ్డ ఓట్లు కేవలం 21 వేల ఓట్లే అనగా 13.4% శాతం ఓట్లు మాత్రమే. ఇలాంటి దీనమైన స్థితిలో వున్న కాంగ్రెసు గుర్రాన్ని రేవంత్ ఎలా పరిగెత్తిస్తాడో?

తెలంగాణ పిసిసి అధ్యక్ష స్థానం కోసం ఐదారు మంది పెద్దలు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తూ వచ్చారు. వారిలో కోమటి రెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి తదితరులు ప్రముఖంగా చెప్పవచ్చు.ఇందులో విజయాన్ని వరించిన రేవంత్ రెడ్డి మాత్రం అందరికన్నా ఆ పార్టీలో జూనియర్ కావడం విశేషం. రేవంత్ రెడ్డి మాస్‌లీడర్ అని, పార్టీని గట్టెక్కిస్తాడని కొందరంటే, మరి కొందరు రేవంత్‌కు చంద్రబాబే రెకమెండ్ చేసి అధ్యక్ష పదవి ఇప్పించాడని విమర్శిస్తున్నారు. టిపిసిసి ఇకపై తెలంగాణ తెలుగుదేశం పపిసిగా మారుతుందని సాక్ష్యాత్తూ కోమటి రెడ్డి వెంకటరెడ్డి విమర్శించాడు. ఆయన ఇంకా తీవ్రంగా స్పందిస్తూ నోటుకు ఓటు కేసులో లాగా తెలంగాణ పిసిసి పదవి కూడా అమ్ముకొన్నాడని అధిష్ఠానంపై తీవ్ర విమర్శలు చేశాడు.

మర్రి శశిధర్ రెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు కూడా రేవంత్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇచ్చేశారు. ఇలా అసమ్మతి అనేది అన్ని పార్టీల్లో సహజమే! కాకుంటే రానున్న రోజుల్లో సీనియర్ నాయకులు రేవంత్‌కు ఎంత వరకు సహకరిస్తారన్నది చూడాలి. అధిష్ఠానం ఏం మాయచేసిందో ఏమో కానీ రేవంత్‌కే ఆ పార్టీ నాయకుల నుండి ఎక్కువ విమర్శలు రాలేదు. మరి అది నివురు కప్పిన నిప్పు అయినా కావచ్చు. చెప్పలేం! మామూలుగా అయితే కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత స్వేచ్ఛ చాలా ఎక్కువ. సమయం, సందర్భం లేకుండా, పార్టీకి నష్టమా? లాభమా? అని చూడకుండా వొకరినొకరు దుమ్మెత్తి పోసుకొంటుంటారు. ఎవరిపై ఎవరి ఆధిపత్యమూ వుండదు.

ఇక రేవంత్ రెడ్డి 51 సం॥ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిలో జన్మించాడు. 2006 జడ్‌పిటిసి ఎన్నికల్లో తొలిసారిగా ఇండిపెండెంట్‌గా గెలుపొంది తదుపరి తెలుగుదేశంలో చేరి రెండు సార్లు ఎంఎల్‌ఎగా గెలిచాడు. తర్వాతి కాలంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా, నమ్మకస్థుడిగా మారాడు. టిఆర్‌ఎస్ పార్టీ అధికారానికొచ్చాక 2015లో ఎంఎల్‌సి ఎన్నికలొచ్చాయి. అప్పుడు చంద్రబాబు ఆదేశానుసారం టిఆర్‌ఎస్‌కు చెందిన ఎంఎల్‌ఎ ఓటును నోటుతో కొనడానికి మంతనాలు జరుపుతూ, డబ్బుల సంచులతో అడ్డంగా కెమెరాలో దొరికిపోయాడు రేవంర్ రెడ్డి. దేశ వ్యాప్తంగా అదో పెద్ద సంచలనం అయింది. మే 31.2015 న తెలంగాణ ఎసిబి వారు రేవంత్‌ను అరెస్టు చేసి జుడిషియల్ కస్టడీకి పంపారు. అది మరోసారి పొడిగించారు కూడా చివరికి బెయిల్‌పై విడుదల అయ్యారు. విడుదల రోజున అనగా జూలై 1న రేవంత్ రెడ్డి జైలు నుండి ఇంటికి చాలా పెద్ద ర్యాలీగా చాలా హంగామా సృష్టించాడు. దారంబడీ స్వాగత తోరణాలు, బ్యానర్లు, క్రాకర్స్, పూల జల్లులు. అబ్బో అంతాఇంతా హడావుడి కాదు.

తప్పుచేస్తూ దొరికినా అదో గొప్ప ప్రయత్నం అన్నట్లు కలరింగ్ ఇచ్చుకొన్న ఘటికుడు రేవంత్ రెడ్డి. చూడడానికి చిన్నవాడిగా కన్పించినా గట్టివాడే అని చెప్పవచ్చు. తెలంగాణలో కెసిఆర్ తర్వాత అంతటి వాగ్ధాటి గల నాయకుడిగా రేవంత్ రెడ్డే అని చెప్పవచ్చు. కెసిఆర్‌ని విమర్శించడంతో ఆయన అన్ని పరిధిలు దాటుతుంటాడు. 31.10.2017లో తెలుగుదేశం వదిలి కాంగ్రెస్ గూటికి చేరాడు. తన చాతుర్యం వాగ్ధాటితో 20/9/ 2018లో తెలంగాణ కాంగ్రెస్‌కు మూడవ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించపడ్డాడు. శాసన సభ్యుడిగా ఓడిపోయి, మల్కాజగిరి పార్లమెంటు సభ్యుడిగా గెలవడంతో ఆయనకు రాజకీయ జీవనం లభించింది. ఇక ఎత్తులకు పైఎత్తు వేసుకొంటూ ఈ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఎంపిక కాబడ్డాడు. ప్రమాణ స్వీకారం కాకముందే కాంగ్రెస్‌లోని అసమ్మతి వాదులందర్నీ వరుసగా కలుస్తున్నాడు. తన నియామకాన్ని ఆది నుండి విమర్శిస్తున్న వి.హనుమంతరావును ఆస్పత్రికి వెళ్లి పరామర్శించడం రేవంత్ ఎత్తుగడల్లో భాగం. ఇక క్రమం తప్పకుండా ప్రతిరోజు కెసిఆర్‌ని దుర్భాషలాడడం, అవినీతిపరుడని విమర్శించడం చేస్తున్నాడు.

2023 ఎన్నికల్లో కెసిఆర్ గద్దె దింపుతానని ప్రతిజ్ఞలు చేస్తున్నాడు. ప్రమాణ స్వీకారానికి ముందే జనాల్ని బాగా రెచ్చగొడుతున్నాడు. ఎన్నికలకు ఇంకా చాలా కాలం వుంది. ఇప్పటి నుంచి అంత దూకుడు అవసరమా? చంద్రబాబు ముద్ర తప్పకుండా రేవంత్‌కు కొంత నష్టాన్నే కలిగిస్తుంది. ఆ కేసు పూర్తిగా అవినీతి మయమే. అందులో ఇరుక్కొని చంద్రబాబు మెప్పు కోసం తన ఇజ్జత్‌ను రేవంత్ పోగొట్టుకొన్నాడన్నది వాస్తవం. ముందు ఆ మచ్చ నుండి తనను తాను ఆత్మశుద్ధి చేసుకోవాలి ఆ ఘటన తప్పేనని ప్రజల ముందు ఒప్పేసుకోవాలి. ఇక కెసిఆర్ పై రేవంత్ అస్త్రాలు ఎంత మాత్రం పని చేస్తాయి? తెలంగాణలో కెసిఆర్ పాలనపై ఇప్పటికీ పూర్తి వ్యతిరేకత అయితే కన్పించడం లేదు. ప్రజల నాడి తెలిసి అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకొనే పథకాలతో ఆయన విజయ పథంలో ముందుకు దూసుకెళ్తున్నాడు. వొక్క దుబ్బాక ఉప ఎన్నికే టిఆర్‌ఎస్‌కు ఓటమి నిచ్చింది. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో స్వల్పంగా దెబ్బతినింది.

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక టిఆర్‌ఎస్ విజయాన్ని మరోసారి నింగి కెగసేలా చేసింది. అభివృద్ది, సంక్షేమం రెండూ కళ్ళులా కెసిఆర్ ముందుకు తీసుకెళ్తున్నాడు. సాగునీరు, మంచి నీరుకు అత్యధిక ప్రాధాన్యత నిస్తూ అందరి మన్ననల్నీ అందుకెళ్తున్నాడు. జూన్ 18న యాదాద్రిలో మరియమ్మ అనే దళిత మహిళ పోలీసు కస్టడీలో మరణించింది. ఉవ్వెత్తున ఎగసిన ఆ సమస్యను కెసిఆర్ తన చాణక్య విద్యతో సునాయాసంగా పరిష్కారం చేసేశాడు. మొట్టమొదటిసారి దళితుల సమస్యలపై అఖలపక్ష సమావేశాన్ని నిర్వహించి, దళితులకు గంపగుత్తెడు వరాల్ని ప్రకటించి అదే దళితులతో జై కొట్టించేసుకొన్నాడు. కెసిఆర్‌ను ఎవరూ తక్కువగా అంచనావేయలేరు. ఎంతటి సమస్యకైనా అట్టే పరిష్కారం చిట్కా ఆయన దగ్గరుంటుంది. పొగరాక ముందే గ్రహించి నిప్పును ఆర్పేసే కిటుకు కెసిఆర్ సొంతం. అవినీతి ఆరోపణలతో కెసిఆర్‌ని గద్దె దించాలనుకోవడం భ్రమగానే మిగుల్తుంది. 2018 ఎన్నికల్లో కెసిఆర్‌పై అన్ని పార్టీలు కలసి తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేశాయి. కానీ ఎన్నికల్లో ప్రజలు గతంకన్నా మరిన్ని ఎక్కువ స్థానాల్లో టిఆర్‌ఎస్‌ను గెలిపించారు.

రానురాను అవినీతి ఆరోపణలన్నీ ఉత్తుత్తివిగానే మిగిలిపోతున్నాయి. ప్రతిపక్షాలు ఎప్పుడూ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకోకూడదు. వారెప్పుడు ప్రజల ప్రధాన సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం పాలనాపరమైన అవినీతిని సాక్ష్యాధారాలతో వెతికితీయడం, ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఈయడం చేయగల్గాలి. కెసిఆర్‌ని గద్దె దించడమే లక్ష్యంగా సాగితే రేవంత్ కూడా వైఫల్యం చెందుతాడు. అవసాన దశలో మూలుగుతున్న పార్టీకి ప్రాణం పోసేందుకు చాలా కష్టపడాల్సి వుంది. అభివృద్ధిని అడ్డుకోవడానికి ఏ నాయకుడూ ప్రయత్నించరాదు. వాస్తవ పరిస్థితుల్ని బేరీజు వేస్తే రాష్ట్రంలో ప్రస్తుతం రెండో స్థానంలో బిజెపి నిలుస్తున్నది. 3వ స్థానంలో వున్న కాంగ్రెస్ పార్టీని మొదట రెండోవ స్థానానిక తీసుకొచ్చేందుకు రేవంత్ ప్రయత్నం చేయాలి.

త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రేవంత్ అందుకు కృషి చేయగల్గాలి. బిజెపిని వెనక్కినెట్టి, కనీసం డిపాజిట్ అయినా కాంగ్రెస్‌కు దక్కేలా చూడాలి. కొంత కాలం ప్రధానంగా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌తో పోటీపడి ముందుకెళ్ళాలి. అప్పుడే కెసిఆర్ తో పోటీపడే అవకాశం వుంటుంది.విభిన్న పంధా అనుసరిస్తే, ప్రజల ఆదరణ పొందగలిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాకున్నా 2028 ఎన్నికల్లోనైనా టిఆర్‌ఎస్‌ని ఓడించే వీలుంటుంది. ప్రస్తుత భారత రాజకీయాలలో అటు మోడీని, ఇటు కెసిఆర్ ఓడించడం కష్టమనిపిస్తున్నది. మరి 7వ తారీఖున రేవంత్ ప్రకటించే భవిష్యత్ కార్యాచరణను చూశాక ఆయన భవిష్యత్తు మరింత బేరీజు వేయొచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News