Sunday, April 28, 2024

ప్రధాని సభా హాజరీకి ఆదేశించడం కుదరదు: ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధానిని తాను సభకు పిలిపించి , హాజరయ్యేలా చేయ్యేలా తాను ఆదేశాలు వెలువరించడం కుదరదని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ బుధవారం సభాముఖంగా తెలిపారు. బుధవారం రాజ్యసభ ఆరంభం కాగానే ప్రతిపక్ష నేతలు లేచి మణిపూర్ సంక్షోభంపై ప్రధాని మోడీ సభకు వచ్చి ప్రకటన చేయాల్సి ఉందని డిమాండ్ చేశారు. ఇతర కార్యకలాపాలను పక్కకు నెట్టి, 267 రూల్ పరిధిలో మణిపూర్ ఘర్షణలపై చర్చ జరగాల్సి ఉందని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. 267 రూల్ పరిధిలో చర్చకు తనకు 58 నోటీసులు అందాయని అంతకు ముందు సభాధ్యక్షులు వివరించారు. అయితే ఇవి నిర్ణీత పద్ధతిలో లేనందున తాను వీటిని పరిగణనలోకి తీసుకోడం లేదని, సభకు ప్రధానిని పిలిపించి మాట్లాడాలని ఆదేశించడం కుదరదని కూడా జగదీప్ ధన్‌కర్ తెలిపారు.

తాము కోరిన పరిధిలో చర్చకు అనుమతి దక్కకపోవడంతో ప్రతిపక్షాలు ఎగువసభ నుంచి వాకౌట్ జరిపాయి. అంతకు ముందు విపక్ష సభ్యుల నినాదాల నడుమనే సభాధ్యక్షులు ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడేందుకు వీలు కల్పించారు. ఖర్గే మాట్లాడుతూ మణిపూర్ విషయంపై సభలో 267 రూల్ పరిధిలో చర్చకు ప్రాతిపదికలతో తాను ఎనిమిది అంశాలతో నోటీసును వెలువరించినట్లు తెలిపారు. ప్రధాని సభకు వచ్చి మణిపూర్ విషయంపై ప్రకటన వెలువరించాల్సి ఉందన్నారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉంది. హింసాకాండలో పలువురు మృతి చెందడం, గాయపడటం, సాధారణ జనజీవన పరిస్థితులు దెబ్బతినడం జరిగిందని, ఇప్పటికీ ప్రధాని స్పందించకపోవడం భావ్యమా? అని ఖర్గే ప్రశ్నించారు. ఈ దశలో సభాధ్యక్షులు మాట్లాడుతూ సభలో స్పందించేందుకు ప్రతిపక్ష నేతకు అవకాశం ఇచ్చినట్లు, అయితే ఈ అవకాశాన్ని ఆయన ఉద్ధేశపూరితంగానే వాడుకోవడం లేదన్నారు.

దీనితో విపక్ష సభ్యులు తిరిగి నిరసనలకు దిగారు. ముందు ప్రధానిని సభకు పిలిపించండి, మాట్లాడించండి అని పట్టుపట్టారు. దీనికి ఛైర్మన్ ససేమిరా అన్నారు. ఆయన స్పందిస్తూ ‘ దీనిపై నేను నిర్థిష్టంగా విషయం స్పష్టం చేశాను. రాజ్యాంగ పరిధిలో, అంతకు మించి సభాధ్యక్ష స్థానానికి ఉండే పద్ధతుల మేరకు వ్యవహరిస్తున్నాను. ఈ స్థానం నుంచి నేను ప్రధానమంత్రి సభకు హాజరుకావాలని ఆదేశించడం జరిగితే అది బాధ్యతల స్వీకరణ దశలో నేను చేసిన ప్రమాణాన్ని, రాజ్యాంగపరమైన కట్టుబాట్లను ఉల్లంఘించడమే అవుతుంది. ఇంతకు ముందు ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు. కుదరని విధంగా ఆదేశాలు వెలువరించడం కుదరదు. అయినా ప్రధాని తనంతతానుగా ఇతరుల లాగానే సభకు రావాలనుకుంటే రావచ్చు. ఇది ఆయన నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుంది. ప్రధాని హాజరుకావాలని ఈ స్థానం నుంచి ఇంతకు ముందెప్పుడూ ఆదేశాలు వెలువరించిన దాఖలాలు లేవు. వెలువరించడం కుదరదు’ అన్నారు.

అయినా ప్రతిపక్షం వైపు పలువురు పేరుమోసిన న్యాయనిపుణుల బృందం ఉంది. వారి నుంచి పద్థతుల గురించి తెలుసుకుంటే మంచిదని, ఇప్పటికైతే మీకు సరైన సలహాలు అందడం లేదని భావించాల్సి వస్తోందని సభాధ్యక్షులు తెలిపారు. నిపుణులను సంప్రదిస్తే రాజ్యాంగం పరిధిలో విధివిధానాల గురించి తెలిసివస్తుందని ధన్‌కర్ చెప్పారు. ఈ వివరణ దశలోనూ సభలో గందరగోళం ఏర్పడిందిం. దీనితో సభాధ్యక్షులు నిర్ణీత జీరో అవర్ నిర్వహణకు దిగారు. దీనికి నిరసనగా ప్రతిపక్షాలు వాకౌట్ జరిపాయి. ఈ దశలో సభాధ్యక్షులు వారి వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. సభ్యులు కేవలం వాకౌట్‌కు దిగినట్లు భావించరాదని, వారు ఈ ధోరణితో రాజ్యాంగ కట్టుబాట్లు, ప్రజల పట్ల తమ బాధ్యతల నిర్వహణల నుంచి వైదొలుగుతున్నట్లుగా భావించుకోవల్సి ఉంటుందన్నారు. మణిపూర్ అంశంపై రూల్ 176 పరిధిలో సభలో చర్చకు సిద్దం అని, ఇది కేవలం రెండున్నర గంటలకే పరిమితం అని అనుకోరాదని తెలిపారు. ఎంత సేపైనా చర్చించవచ్చునన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News