Saturday, April 27, 2024

మండుతున్న చికెన్ ధరలు.. కిలో రూ.260

- Advertisement -
- Advertisement -

Chicken skinless price is Rs. 260 per kg

వారం రోజుల్లోనే రూ30 పెరుగుదల

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో చికెన్ ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకు వీటి ధరలు సామాన్యుడికి అందనంత వేగంగా పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్ ఎత్తివేసి నప్పటినుంచి కోడి మాంసం ధరలకు రెక్కలు మొలిచాయి. ఆదివారం రాష్ట్రంలో చికెన్ స్కిన్‌లెస్ కిలో ధర రూ.260కి పెరిగిపోయింది. రాష్ట్రంలో కోళ్ల పెంపకం దారులు రెండవ దశ కోవిడ్ ప్రభావ కారణంగా కోళ్ల పెంపకం యూనిట్లను తగ్గించివేశారు. దీంతో సహజంగానే రాష్ట్రంలో కొళ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. మహారాష్ట్ర , కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలనుంచి కూడా కోళ్ల దిగుమతి మందగించింది. అవసరాలమేరకు కోళ్లు మార్కెట్‌కు రాకపోవటంతో వారం రోజుల్లోనే చికెన్ ధరలు కిలో 30రూపాయలు పెంచివేశారు. గత ఆదివారం కిలో స్కిన్ లెస్ రూ.230కి విక్రయించగా ఈ ఆదివారం కిలో 260కి పెంచారు.లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా కోళ్ల పెంపకం యూనిట్లలో పనిచేసే కూలీలు సొంతగ్రామాలకు తరలిపోయారు. దీంతో యూనిట్ల యజమానులు కూలీల కొరత వల్ల నిర్వహణ సమస్యలను భరించే పరిస్థితిలేక కోళ్ల పెంపకం యూనిట్ల సంఖ్యను తగ్గించివేస్తు వచ్చారు.

లాక్ డౌన్ ఎత్తివేతతో హోటళ్లు, బార్లు రెస్టారెంట్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి. రవాణా ఆంక్షలు కూడా తొలగటంతో ప్రయాణాలు పెరిగి ఇంటిబయటే బోజన అవసరాలు తీర్చుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. జనజీవనం కూడా సాధారణ స్థాయికి చేరింది. దీంతో ఒక్కసారిగా కోడి మాంసం వినియోగం పెరిగిపోయింది. అయితే డిమాండ్‌కు తగ్గట్టు సరకు సరఫరా లేదు. దీంతో మార్కెట్‌లో మాంసం ధరలకు రెక్కలు మొలిచాయి. ఈ ఏడాది మేనెల తొలివారంలో కనిష్టంగా కిలో చికెన్ ధర రూ.145 ఉండేది. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేతతో రోజురోజుకూ చికెన్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. జూన్‌లో కూడా ధరలు ఏమాత్రం తగ్గలేదు. ఈ నెల ప్రారంభం నుంచి చికెన్ స్కిన్ లెస్ కిలో 220నుంచి అలా అలా పెరిగిపోతూనే వుంది. మార్కెట్లో పెరుగుతున్న చికెన్ ధరలు చూసి వినియోగదారులు నిరాశ చెందుతున్నారు.

మాంసం ప్రియులు జిహ్వాచాపల్యం తీర్చుకునేందుకు భారంగానే అధిక ధరలు పెట్టి కోనుగోలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ధరలు భరించలేని వారు వినియోగంలో 50శాతం తగ్గించుకుంటున్నారు. గుడ్ల ధరలు కూడా అధికంగానే ఉన్నాయి.టోకున వంద కోడిగుడ్ల ధరలు 500రూపాయలు ఉండగా, రిటైల్‌గా వీటి ధర మరింత అధికంగా ఉంది. డజన్ గుడ్ల ధర రూ.70కి విక్రయిస్తున్నారు. కోళ్ల పెంపకంలో కొత్త యూనిట్లు నుంచి ఉత్పత్తి ప్రారంభం అయ్యేదాక చికెన్ ధరలు తగ్గవని చికెన్ మార్కెట్ వర్గాల వారు చెబుతున్నారు. కొత్త బ్యాచ్ ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చేందుకు మరికొన్ని రోజులపాటు ఎదురు చూడక తప్పదంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News