Monday, May 6, 2024

ఎముకలు కొరికే చలిలో…నదిలో 5 గంటల భీకరపోరు

- Advertisement -
- Advertisement -

మనిషి నిలబడేటంత ఒడ్డు ఉన్నా బుద్ధి చెప్పాం
మోసం చేసి రాడ్లతో
దాడి చేశారు
మృత్యుంజయుడైన సురేంద్ర సింగ్ కథనం
లడఖ్‌లో చికిత్స పొందుతున్న సింగ్

China attack on Indian army at boarders

న్యూఢిలీ: వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైనికుల ను తిప్పికొట్టేందుకు భారతీయ సైనికులు వీరోచిత పోరు సలిపారు. గాల్వన్ నది వద్ద కేవలం ఒకే ఒక్కరు నిలిచే ఒడ్డుపై నిలపడి చైనా సైనికులతో తలపడ్డారని ఈ దశలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న సురేంద్ర సింగ్ అనే జవాను తెలిపారు. ప్రస్తుతం లద్థాఖ్ సైనిక ఆసుపత్రిలో కోలుకుంటున్న సింగ్ ఈ విధంగా తెలిపారు. “ చైనా సైనికులు నమ్మించి దెబ్బతీశారు. ధోకాకు దిగారు. వారు వెనక్కి పోతున్నట్లుగా నటించి దాడికి దిగా రు. నాలుగు అయిదు గంటలు నదిలోనే ఘర్షణ జరిగింది. చైనా సైనికులు వేయి మందికి పైగా ఉన్నారు. వారి దాడిని ఊహించకపోవడంతో మన వారు కేవలం 200 నుంచి 250 మంది ఎదురునిలిచారు.

ఘర్షణ అంతా ఎముకలు గడ్డకట్టే  గొంతుకోసుకుపొయ్యేంత తీవ్ర చలిని కల్గించే నీటిలోనే జరిగింది, నది ఒడ్డున కేవలం ఒక్కరు నిలబడే చోటనే నిలబడి చైనా వారితో పోరాడాం, దీనితోనే చాలా నష్టం జరిగింది. పలువురు ప్రాణాలు పోగొట్టుకోవల్సి వచ్చింది. భారత సైనికులను దొంగదెబ్బతీశారు. లేకపోతే మన జవాన్లు ఎందులో తక్కువ తీసిపోరు. దెబ్బకు దెబ్బతీసి తీరడంలో మనమే గొప్ప, చైనా వారికి సరైన జవాబు చెప్పి, తడాఖా చూపేందుకు సిద్ధంగా ఉన్నాం. చైనా వారు వెన్నుచూపినట్లుగా నటించి వెన్నుపోటుకు దిగారు. ఇది కుట్ర, మోసపూరిత చర్య, నీతిరీతిలేని దాడి జరిగింది’ అని అప్పటి పోరాట క్రమాన్ని సురేంద్ర సింగ్ తెలిపారు. గాల్వన్ వద్ద జరిగిన పోరులో సింగ్ కూడా ఒక్కరిగా నిలిచారు. ఆయన తలకు గాయం అయింది. డజన్‌కు పైగా కుట్లు పడ్డాయి. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. చైనా చర్యపై ఆయన ఆగ్రహం ఆయన మాటలలో తూటాలుగా పేలింది. స్వస్థలం రాజస్థాన్ అయిన సింగ్ దేశం కోసం పోరు తమ ప్రాణస్పందన అన్నారు.

జవాన్లు ఎవరూ గల్లంతు కాలేదు ః సైన్యం

లద్దాఖ్‌లో ఘర్షణ సందర్భంగా భారతీయ సైనికులు ఎవరూ గల్లంతు కాలేదని సైనిక వర్గాలు అధికారిక ప్రకటన వెలువరించారు. పరస్పర ఘర్షణ దశలో కొందరు భారతీయ సైనికులు వీర మరణం పొందారు. అయితే మరికొందరు సైనికుల జాడ తెలియడం లేదని వార్తలు వెలువడ్డాయి. దీనిపై గురువారం సైనిక వర్గాలు ప్రకటన వెలువరించాయి. అన్ని విషయాలను నిర్థారించుకున్న తరువాత ఈ ఘటనలో ఎవరూ గల్లంతు కాలేదని స్పష్టం అయినట్లు తెలిపారు.

రాడ్లు, రాళ్లు చుట్టిన ఇనుపతీగలతో దాడి

చైనా హద్దులు దాటి రావడాన్ని ప్రతిఘటించేందుకు వెళ్లిన భారతీయ సైనికుల బృందంపై చైనా సైనికులు చేతుల్లోని రాడ్స్‌తో దౌర్జన్యానికి దిగారు. వారి చేతులో ముళ్ల ఇనుపతీగలు, వాటి మధ్యలో రాళ్లు కట్టేసి ఉన్నట్లు వెల్లడైంది. ఒక్కసారిగా విరుచుకుపడ్డ చైనా సైనిక మూకలను తట్టుకుని ధైర్యంగా ప్రతిఘటించే దశలోనే పలువురు భారతీయ సైనికులు మృతి చెందారు. చాలా మంది తీవ్రస్థాయిలో గాయపడి కుప్పకూలారు. కరడుగట్టిన కసితో సైనికులను పిఎల్‌ఎ బలగాలు మరీ వెంటపడి కొట్టినట్లు ఇప్పుడు చిత్రాలతో వెల్లడైంది. పాయింట్ 14 ఇరు దేశాల ఎల్‌ఎసి వెంబడి ఉండే అత్యంత కీలక ప్రదేశం. ఇక్కడి నుంచే భారతీయ సైనికులు ఎప్పటికప్పుడు చైనా సైనికుల కదలికలను గమనిస్తూ సరిహద్దు సమగ్రతను పరిరక్షిస్తుంటారు. సైనికుల సునిశిత జాగరూకత మధ్య తమ అతిక్రమణలు, నదులు అటకాయించడం, అత్యంత సంక్లిష్ట, వ్యూహాత్మక భూభాగాలను కబ్జా చేసుకుంటూ వెళ్లడం సాధ్యం కాదనే అభిప్రాయంతోనే చైనా ఈ దూకుడుకు దిగిందని భారతీయ వర్గాలు విశ్లేషించాయి. ఎల్‌ఎసి వెంబడి చైనా భూభాగంలో ఉన్నట్లుండి పెద్ద ఎత్తున బుల్‌డోజర్లు రావడం, అక్కడ పారే నది ప్రవాహానికి ఆటంకం కల్పించే విధంగా తవ్వకాలకు దిగడం గమనించే భారత సైనికులు తక్షణ ప్రతిచర్యకు దిగారని, చైనా పనిని నివారించే విధంగా వ్యవహరించారని వెల్లడైంది.

నదుల ప్రవాహం దారితప్పితే అది బురదనీరుగా భారతీయ భూభాగాన్ని ముంచివేస్తుంది. సరిహద్దులలోని భారతీయ వ్యూహాత్మక స్థావరాలను దెబ్బతీస్తుంది.నీలం రంగు గాల్వన్ నీరు క్రమేపీ మట్టిరంగును పులుముకోవడం గమనించి భారతీయ సైనికులు అప్రమత్తం అయ్యారు. నది వద్ద చైనా సైనికుల పనుల గురించి తెలిపే ఛాయాచిత్రాలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. నదీనీళ్లు మూడు కిలోమీటర్ల పరిధి వరకూ దారితప్పి వచ్చి అక్కడి భారతీయ సైనికుల ట్రక్కులను ముంచెత్తే పరిస్థితి ఏర్పడిందని వెల్లడైంది. అయితే దీనికి సంబంధించి శాటిలైట్ చిత్రాలు వెలువడలేదు. నది వద్ద పనుల గురించి దేశ రాజధాని ఢిల్లీలోని చైనా ఎంబస్సీ వర్గాలు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ప్రస్తుత శాటిలైట్ ఛాయాచిత్రాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి రావడంతో ఈ ప్రాంతంలో పరిస్థితి ఏమిటనేది వెల్లడైంది.

ప్రస్తుతం ఈ సరిహద్దుల వద్ద భారీ స్థాయిలోనే భారత్ చైనా బలగాలు మొహరించి ఉన్నట్లు చిత్రాలతో స్పష్టం అయింది. చైనా భూభాగంలో వందలాది చైనా ట్రక్కులు, సైనిక రవాణా వాహనాలు నిలిచి ఉన్నట్లు ఎన్‌డిటీవీ వంటి ప్రసార సాధనాలు తమ ఛాయాచిత్రాల వెల్లడి ద్వారా తెలిపాయి. అయితే భారత భూభాగం వైపు సాధనసంపత్తిని తెలిపే చిత్రాలను మన భద్రతా వ్యవస్థ గోప్యత కోణంలో వెల్లడించలేదు. చైనా భూ భాగం ప్రాంతంలో దాదాపు 5 కిలోమీటర్ల లోపలి వరకూ చైనా సైనిక శకటాలు నిలిచి ఉన్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల నుంచే ఈ నెల 15వ తేదీన చైనా సైనికులు ఎల్‌ఎసి వద్దకు దూసుకువచ్చినట్లు వెల్లడైంది. మంచుపర్వత ప్రాంతంలో చొచ్చుకు వచ్చిన వీరు భారతీయ సైనికులను తీవ్రంగా కొట్టి కొందరిని శిఖరాలపై పడేసినట్లు వెల్లడైంది.

శాటిలైట్ చిత్రాలతో వెలుగులోకి

నదుల ప్రవాహాలను తమ వైపు మళ్లించుకునేందుకు డ్యాంల నిర్మాణం, వాస్తవాధీన రేఖలను చెరిపివేసేందుకు ఇప్పటివరకూ ఉన్న హద్దులను చెరిపేసేందుకు మైళ్ల దూరం హద్దులు దాటివచ్చేందు కు యత్నించడం , ఈ చర్యలను ప్రతిఘటించిన భారతీయ సైనికులపై ఆటవిక దాడికి దిగడం ఇదీ చైనా డ్రాగన్ విషపు చిత్రంగా స్పష్టం అయింది. ల ద్దాఖ్ వెంబడి వాస్తవాధీన రేఖ ప్రాంతంలో ఈ నెల 15వ తేదీన ఏం జరిగిందీ? చైనా సైనికులు ఎంత పాశవికంగా వ్యవహరించారు? అనేది కొట్టొచ్చినట్లుగా తెలిపే ఉపగ్రహ ఛాయాచిత్రాలు వెలువడ్డాయి. దీనితో అతిక్రమణల పర్వంలో చైనా నేరచరిత్ర మరోసారి ప్రపంచానికి తెలిసిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News