Monday, April 29, 2024

కల్నల్‌కు కన్నీటి వీడ్కోలు

- Advertisement -
- Advertisement -

సంతోష్‌బాబుకు కేసారంలో మిలిటరీ లాంఛనాల మధ్య అంత్యక్రియలు
తనయుడి చితికి తలకొరివి పెట్టిన తండ్రి ఉపేందర్
అశ్రునయనాల మధ్య భారీ ర్యాలీతో అంతిమయాత్ర, ‘వందేమాతరం’‘వీరుడా వందనం’ లాంటి నినాదాలతో మార్మోగిన భానుపురి
7కి.మీటర్ల పొడవునా పూలవర్షం
కురిపించి జేజేలు పలికిన ప్రజలు
భార్య సంతోషి, కుమారుడు అనిరుధ్ చివరి సెల్యూట్‌తో కన్నీటి పర్యంతమైన జనం

ఉదయం 9నుంచి 12గంటల వరకు పార్ధివ దేహయాత్ర
సైనిక లాంఛనాలతో కార్యక్రమాలు
రాత్రి నుంచి మంత్రి జగదీష్‌రెడ్డి కుటుంబ సభ్యులతో సహా..
అంతిమ యాత్రలో అన్నీ తానై నిర్వహించిన మంత్రి
ప్రముఖుల సంతాపం g మూడు గంటల పాటు సాగిన అంతిమయాత్ర
వర్షాన్ని తలపించిన పూల జల్లు g దేశ భక్తి నినాదాలతో మార్మోగిన భానుపురి
సంతోష్ వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు
సాంప్రదాయబద్ధంగా చితికి నిప్పుపెట్టిన తండ్రి ఉపేందర్
భార్య సంతోషి, బాబు అనిరుద్‌తో కలిసి కన్నీటి పర్యంతమైన ప్రజలు
దారిపొడవునా జాతీయ పతాకంతో నీరాజనాలు

Colonel santhosh babu funeral

మన తెలంగాణ/సూర్యాపేట జిల్లా ప్రతినిధి : భారత్, చైనా సరిహద్దుల్లో జరిగిన దాడుల్లో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబుకు సూర్యాపేట ప్రజలు అశ్రునయనాలతో కడసారి వీడ్కోలు పలికారు. బుధవారం రాత్రి 8.45 నిమిషాలకు హైదరాబాద్ నుండి బయలుదేరిన పార్ధివదేహాన్ని ప్రత్యేక వాహనంలో జాతీయ రహదారి గుండా సూర్యాపేటకు తీసుకువచ్చారు. భార్య సంతోషి, కూతురు అభిజ్ఞ, కుమారుడు అనిరుద్‌లకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి వారి వెంట కాన్వాయ్‌లో రాగా హైదరాబాద్ నుంచి సూర్యాపేట వచ్చే వరకు అన్ని పట్టణాలు, గ్రామాలలోనూ ప్రజలు పూలు చల్లుతూ ఘనంగా నివాళులు అర్పించారు.

జై భారత్.. జై జవాన్.. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. సూర్యాపేట కొత్త బస్టాండ్‌కు రాగానే అక్కడ నుంచి పట్టణ ప్రజలు భారీగా ఇరువైపులా నిల్చోని పూలు జల్లుతూ స్వాగతం పలికారు. రాత్రి 11.30 గంటలకు ఇంటికి రాగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. రాత్రి మొత్తం అక్కడే జాగారం చేశారు. బీహార్ బెటాలియన్ సైనికులు కూడా కల్నల్ సంతోష్ వెంటనే ఉన్నారు. భారత జాతి గర్వించదగిన యోధునికి వందనాలు పలికారు. గురువారం ఉదయం సంప్రదాయం ప్రకారం 7 గంటలకు సంతోష్ తండ్రి ఉపేందర్ జీవి కర్రను తన వ్యవసాయ క్షేత్రంలో బంధువులతో కలిసి వేశారు. సైనిక లాంఛనాల ప్రకారం ఉదయం 9 గంటలకే సర్వం సిద్ధం చేశారు.

Colonel santhosh babu funeral

బీహార్ బెటాలియన్‌కు చెందిన వాహనాన్ని ప్రత్యేకంగా అలంకరించి సైనికులు యాత్రలో పాల్గొన్నారు. అంతిమ యాత్ర సొంత ఇంటి నుంచి ప్రారంభమైనా ప్రతి క్షణానికి యోధునికి నివాళులు అర్పిస్తూ యువకులు నినాదాలు చేశారు. పట్టణ ప్రముఖులు, మంత్రి జగదీష్‌రెడ్డి అంతిమ యాత్రలో ముందు నడుస్తూ కొనసాగించారు. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి మహాత్మా గాంధీ రోడ్డు, శంకర్ విలాస్ సెంటర్, బతుకమ్మ చౌరస్తా, కోర్టు దగ్గర నుంచి పోస్టాఫీసు, చంద్రన్నకుంట, కృష్ణా టాకీస్ నుంచి సైనిక్‌పురి కాలనీ, కాసరబాద రోడ్డులోని కేసారం గ్రామ పరిధిలో ఉన్న వారి వ్యవసాయ క్షేత్రం వద్దకు చేర్చారు. అప్పటికే ప్రభుత్వ లాంఛనాలతో తయారు చేసిన చితి వద్దకు యాత్ర సాగింది. వంద గజాల దూరంలోనే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ పాడె కట్టి ప్రత్యేక బాక్సులో ఉన్న సంతోష్ భౌతిక దేహాన్ని పాడెపై ఉంచారు. అక్కడి నుంచి సైనికులు పాడెను మోసుకుంటూ చితి వద్దకు తీసుకొచ్చారు. చితి చుట్టూ తిరిగిన తర్వాత భౌతిక దేహాన్ని చితిపై ఉంచారు. అప్పటికే అక్కడికి చేరుకున్న మంత్రి జగదీష్‌రెడ్డితో పాటు కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అరవింద్, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్‌కుమార్‌తో పాటు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, జిల్లా పరిషత్తు ఛైర్మన్ గుజ్జ దీపికా యుగేందర్‌రావు, వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, మాజీ ఎమ్మెల్సీ చెరుకుపల్లి సీతరాములు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కర్నాటి కిషన్, మున్సిపల్ చైర్‌పర్సన్ అన్నపూర్ణ, వైస్ ఛైర్మన్ పుట్ట కిషోర్, జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్, అదనపు కలెక్టర్ సంజీవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి, ఆర్డీఓ మోహన్‌రావు, డిఎస్పీ మోహన్‌కుమార్, సిఐ ఆంజనేయులు, తండు శ్రీనివాస్‌యాదవ్, సైనిక లాంఛనాల ప్రకారం పూలదండలు వేసి నివాళులు అర్పించారు.

Colonel santhosh babu funeral

చితికి నిప్పు పెట్టిన తండ్రి ఉపేందర్…

కల్నల్ సంతోష్‌బాబు చితికి తండ్రి ఉపేందర్ నిప్పు పెట్టారు. ముందుగా కుండతో నీళ్లు తెచ్చిన తర్వాత చితి చుట్టూ భార్య సంతోషి, కుమారుడు అనిరుద్‌తో కలిసి మూడు చుట్లు తిరిగాడు. బంధుమిత్రులు తమ సంప్రదాయాన్ని కొనసాగించిన తర్వాత అధికారిక లాంఛనాల ప్రకారం సైనికులు సైనిక వందనం చేశారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం గాలిలోకి మూడు సార్లు తుపాకులు పేల్చారు. అనంతరం ఉపేందర్ చితికి నిప్పు అంటించారు.

చివరి క్షణంలో…

కుమారునితో కలిసి చితికి నిప్పు అంటిస్తున్న సమయంలో పలువురు యువకులు సంతోష్‌బాబుకు జోహార్లు అర్పించారు. అదే సమయంలో భార్య సంతోషి బంధువులతో కలిసి కన్నీళ్ల పర్యంతమయ్యారు. వీర సైనికులు సంతోష్‌బాబు అంత్యక్రియల సందర్భంగా ఆయన మూడేళ్ల కుమారుడు అనిరుద్ చేసిన సెల్యూట్ కంటతడి పెట్టించాయి. ఆయన కుటుంబ సభ్యులు చేసిన వందనం దేశం పట్ల వాళ్ల నిబద్ధతతకు నిదర్శనంగా నిలిచి ప్రజల్లో నిజమైన దేశ భక్తి స్ఫూర్తిని రగిల్చింది. అక్కడ సన్నివేశాన్ని చూడడానికి వచ్చిన ప్రజల్లో చాలా మంది పిల్లలను చూసి కంటతడి పెట్టారు. దేశ సరిహద్దుల్లో భరతమాత రక్షణ కోసం ప్రాణాలు కోల్పొయిన సంతోష్‌బాబు జీవితం నేటి యువతకు ఆదర్శమంటూ పలువురు అడుగడుగునా నినాదాలు చేస్తూ జోహార్లు అర్పించారు. కళాకారులు పాటలు పాడుతూ జనాన్ని కదిలించారు. నాగలక్ష్మి అనే కళాకారిణి పాడిన పాట మరోసారి జనంలో ఆలోచనలకు రేకెత్తిచింది. తల్లి కడుపుకోతను తలుచుకొని ఆమె పాడుతున్నంతసేపు పలువురు మహిళలు కంటతడి పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News