Monday, April 29, 2024

అల్లు అర్జున్‌కు సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు చలన చిత్రాలకు పలు విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ అవార్డుల్లో ఈసారి టాలీవుడ్ 10 అవార్డులతో సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఏ తెలుగు హీరో సాధించని ఘనతను సొంతం చేసుకున్న అల్లుఅర్జున్ పై సినీ సిలబ్రెటీస్ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు దక్కించుకుని చరిత్ర సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

69 ఏండ్లలో మొదటిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కడం గొప్ప విషయమని సిఎ కెసిఆర్ అన్నారరు. కథానాయకుడిగా, పలు సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలద్వారా తెలుగు సహా జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించిన అల్లు అర్జున్, తమ నటనా ప్రతిభతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పొందిన తొలి తెలుగు చలనచిత్ర కళాకారుడు కావడం, తెలుగు చలన చిత్ర రంగానికి గర్వకారణమన్నారు. నాటితరం గొప్ప నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా, విలక్షణ నటులైన చిరంజీవి వంటి వారి స్ఫూర్తితో నేటితరం నటుడిగా స్వశక్తితో ఎదిగిన అల్లు అర్జున్ కృషి గొప్పదని సిఎం అన్నారు.

అదే సందర్భంలో… తమ సృజనాత్మక రచనతో సినీ పాటల సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ కు, ఉత్తమ సినీ సాహిత్యానికి గాను జాతీయ అవార్డు దక్కడం పట్ల సిఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబోస్ కు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ కాలభైరవ, ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమాచార్యులుతో పాటు ఆయా విభాగాల్లో జాతీయ అవార్డులు పొందిన పలు సినిమాలకు చెందిన నిర్మాతలు, దర్శకులు, నటులు, సాంకేతిక సిబ్బందికి సిఎం అభినందనలు తెలిపారు.

తెలుగు చలన చిత్ర రంగం నేడు హైద్రాబాద్ కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుతుండడం గొప్ప విషయమని సిఎం అన్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతూ, ఫిల్మ్ ప్రొడక్షన్ లో తెలుగు సినిమా దేశానికి ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వ కారణమని సిఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో తెలుగు సినిమా ఇతర భారతీయ సినిమా రంగాలతో పోటీపడుతుండడం పట్ల సిఎం హర్షం వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర రంగాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కృషి కొనసాగిస్తూనే వుంటుందని సిఎం స్పష్టం చేశారు. విభిన్న సంస్కృతుల మేళవింపుతో భవిష్యత్తులో తెలుగు సినిమా విశ్వవ్యాప్తంగా మరింతగా విస్తరించాలని సిఎం ఆకాంక్షించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News