Monday, April 29, 2024

“ఈడీ” తో రాజకీయాలు సాగిస్తున్న బిజెపి : స్టాలిన్ ధ్వజం

- Advertisement -
- Advertisement -

చెన్నై : తమ కేబినెట్ మంత్రి వి. సెంథిల్ బాలాజీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులును దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ బీజేపీపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కాషాయం పార్టీ నాయకత్వం ‘ప్రజా వ్యతిరేక’ రాజకీయాల్లో నిమగ్నమై తన రాజకీయ ప్రతీకారాన్ని ఈడీ ద్వారా సాగించాలని కోరుకుంటోందని ఆరోపించారు. ఈ మేరకు తమ అధికారిక ట్విటర్‌లో వీడియో పోస్ట్ చేశారు. మంత్రి బాలాజీ పట్ల ఈడీ వ్యవహరించిన తీరుని స్టాలిన్ తప్పు పట్టారు. మానసికంగా తీరని ఒత్తిడి తీసుకురావడంతో చివరకు ఆయన అస్వస్థులు కావలసి వచిందని స్టాలిన్ ఆరోపించారు. “ఈడీ ఎంత ఘోరమైన ఇబ్బందులు మంత్రికి తీసుకొచ్చిందో మీ అందరికీ తెలుసు. ఇది బయటకు కనిపించని రాజకీయ కక్ష. పదేళ్ల నాటి కేసును తిరగతోడారు.

ఆయనను నిర్బంధించి మానసిక ఒత్తిడి తెచ్చారు. మానసికంగా, భౌతికంగా బలహీనమై చివరకు ప్రాణాంతకమైన గుండెపోటు ఈడీ వల్లనే దాపురించింది ఇదంతా రాజకీయ పగ కాదా ? ” అని స్టాలిన్ ప్రశ్నించారు. ఫిర్యాదు లేదా కోర్టు ఉత్తర్వు ప్రకారం బాలాజీని విచారించడం లో తప్పులేదు. ఆయనేం పరారైపోయే మామూలు వ్యక్తి కాదు అని స్టాలిన్ పేర్కొన్నారు. ఆయన ఐదుసార్లు ఎన్నికైన శాసన సభ్యుడు. రెండోసారి కూడా మంత్రి. ఆయన ఎన్నో ప్రజాకార్యక్రమాల్లో పాల్గొనే నాయకుడు. ఒక టెర్రరిస్టులా ఆయనను ఎందుకు విచారించ వలసిన అవసరం వచ్చింది ? ఈడీ అధికారులు రాగానే ఆయన పూర్తిగా సహకరించారు. ఇంకా ఏం కావాలో వివరణ ఇవ్వడానికి సిద్ధం అని చెప్పారు. ఇవన్నీ విస్మరించి 18 గంటల పాటు నిర్బంధంలో ఉంచారు. ఎవర్నీ కలుసుకోడానికి అనుమతించలేదు. ఆయన ఆరోగ్యం క్షీణించేసరికి అప్పుడు ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికీ పట్టించుకోకుంటే మంత్రి ప్రాణాలకే ముప్ప జరిగేది ” అని స్టాలిన్ ఈడీ తీరును దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News