Monday, April 29, 2024

విడదీసే ‘ఉమ్మడి’!

- Advertisement -
- Advertisement -

భిన్నమతాలు, విభిన్నఆచార, సంస్కృతులు కలిగిన భారత దేశంలో వివాహం, వారసత్వం, పిల్లల సంరక్షణ బాధ్యతలు వగైరాలకు సంబంధించి అందరికీ ఒకే చట్టం వర్తించేలా ఉమ్మడి పౌరస్మృతిని తక్షణమే అమల్లోకి తేవడం మంచిది కాదనే దృష్టితోనే రాజ్యాంగ పెద్దలు ఆ విషయాన్ని ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేని సర్వసమ్మతి నెలకొన్నప్పుడే ఉమ్మడి పౌర స్మృతిని తీసుకు రావాలని, సమాజంలో అటువంటి పరిపక్వతను పెంపొందించడానికి ప్రభుత్వం కృషి చేయాలని అందులో సూచించింది. ఇందుకు విరుద్ధంగా తాను అధికారంలోకి రాగానే ఉమ్మడి స్మృతిని రూపొందించి అమలు చేస్తానని బిజెపి ప్రకటించి ఉంది. ఎన్నికల్లో ఆ మేరకు వాగ్దానం చేసింది. దానిని తన పవిత్ర కర్తవ్యంగా చాటుకొన్నది. అన్ని మతాలు స్త్రీకి రెండవ శ్రేణి పౌరసత్వాన్నే ఇచ్చాయి. కాని ఇస్లాంలో ఇది ఎక్కువగా ఉన్నదనే అభిప్రాయంతో అందులోని పురుషుల నిరంకుశత్వం నుంచి వారి స్త్రీలకు విముక్తి ప్రదాతగా మెప్పు పొందాలని బిజెపి పడే ఆరాటం తెలిసిందే.

మైనారిటీలలో గల, ముఖ్యంగా ముస్లింలలో ఆచరణలో గల కొన్ని సాంఘిక నియమాలను వారి అంగీకారం తీసుకోకుండానే రద్దు చేయడం ద్వారా తాము హిందువుల ఆమోదాన్ని మరింతగా పొంది మెజారిటీ ఓటుతో దేశాధికారాన్ని పదిల పరచుకోవాలని బిజెపి, దాని రాజకీయ ఆధ్యాత్మిక గురువు ఆర్‌ఎస్‌ఎస్ ఆశించాయి. ప్రస్తుత పార్లమెంటులోనే ఉమ్మడి పౌరస్మృతి బిల్లును తేవాలని అనుకొన్న బిజెపి ముందుగా తన ఏలుబడిలోని ఉత్తరాఖండ్‌లో దానిని ప్రవేశపెట్టింది. బుధవారం నాడు ఈ బిల్లును ఉత్తరాఖండ్ శాసనసభ ఆమోదించింది. ఆ విధంగా ఉత్తరాఖండ్ దేశంలోనే మొదటిసారి ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడుతున్న రాష్ట్రం అయ్యింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడగానే ఆ రాష్ట్రంలో ఇది అమల్లోకి వస్తుంది. ఉత్తరాఖండ్ చట్టాన్ని చూసి దేశంలోని హిందూ ఓటర్లు తమను మరింత అక్కున చేర్చుకొంటారని బిజెపి పాలకులు ఆశిస్తుండవచ్చు. అందుబాటులోని ఈ చట్టం వివరాలను గమనిస్తే అక్కడక్కడా కొన్ని చిన్నచిన్న మంచి మార్పులనిపించేవి వున్నప్పటికీ మొత్తం మీద ఇందులో తిరోగామి గుణాలే ఎక్కువ అని పరిశీలకులు భావిస్తున్నారు.

పిల్లల సంరక్షణ, వారి ఆస్తుల అజమాయిషీలో స్త్రీలకు కూడా అధికారం కల్పించే దిశగా సుప్రీం కోర్టు చేసిన ప్రయత్నాలను ఉత్తరాఖండ్ చట్టం వమ్ము చేసింది. బహు భార్యత్వాన్ని నిషేధించింది. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకొన్నవారు, వివాహ వ్యవస్థ బయట సహ జీవనం చేస్తున్నవారు విధిగా ప్రభుత్వం వద్ద నమోదు చేసుకొని అధికారుల తనిఖీకి అందుబాటులో ఉండాలని ఈ చట్టం నిర్దేశిస్తున్నది. ఇది సెక్యులర్ వివాహాలను, తద్వారా ఆశించే సామాజిక విప్లవాన్ని నిరుత్సాహ పరుస్తుంది. వీరిని భయానికి గురి చేస్తుంది. స్త్రీ, పురుషుడు తమలో తాము ఇష్టపడి సహ జీవనం చేయడానికి రాజ్యాంగం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. అది రాజ్యాంగం 21 అధికరణ ఇస్తున్న జీవన హక్కు పరిధిలోకి వస్తుందని సుప్రీం కోర్టు ఒక తీర్పులో స్పష్టం చేసింది. ఇద్దరు స్త్రీలు లేదా ఇద్దరు పురుషులైనా పరస్పర సమ్మతితో సహ జీవనం సాగించే స్వేచ్ఛ ఉన్నదని, అందులో ప్రభుత్వాలు జోక్యం చేసుకోరాదని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు.

సహ జీవనం సాగించదలచుకొన్న జంట ముందుగా వివాహాల రిజిస్ట్రార్ వద్ద ఆ మేరకు ఉమ్మడి దరఖాస్తు పెట్టుకోవాలని, దానిపై తనిఖీ జరిపి వారి సంబంధం నిషిద్ధమైనది కాదని తేల్చుకొని వారికి అనుమతి పత్రం రిజిస్ట్రార్ ఇవ్వాలని, ఆ జంట విడిపోదలచుకొన్నప్పుడూ ఇదే పద్ధతి పాటించాలని ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌర స్మృతి సూచిస్తున్నది. ఉత్తరాఖండ్‌లోని ఎస్‌టిలను ఈ చట్టం పరిధి నుంచి మినహాయించారు. కేవలం ముస్లింలను లక్ష్యంగా చేసుకొని తీసుకొచ్చిన ఈ బిల్లు వెనుక రాజకీయ స్వప్రయోజన దృష్టి ఉందని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు అభిప్రాయపడింది. స్త్రీ పురుషులకు సమాన వారసత్వ హక్కు కల్పన ఇస్లాం చట్టాలకు విరుద్ధమైందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. హిందూ అవిభక్త కుటుంబం జోలికి ఈ చట్టం వెళ్లలేదనే విమర్శ కూడా వినవస్తున్నది. ఏ మత వర్గ ఆంతరంగిక చట్టాన్ని అయినా మార్చదలచినప్పుడు అందులోని మెజారిటీ సమ్మతిని తీసుకోవాలి.

ముమ్మారు తలాక్‌ను రద్దు చేయడం, దానిని నేరంగా పరిగణించడం ద్వారా ముస్లిం మహిళలకు విమోచన కలిగించామని ఎంత చెప్పుకొన్నా ఆ సమాజం దానిని ఏ విధంగా తీసుకోవాలనుకున్నదో అలాగే తీసుకొన్నది. భిన్నత్వం వున్న సమాజంలో సాధించుకొన్న ఏకత్వాన్ని మంటగలపడం సులభం. తిరిగి దానిని నెలకొల్పడం మాత్రం కష్టసాధ్యం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News