Tuesday, March 19, 2024

రాజీ’స్థాన్’‌?

- Advertisement -
- Advertisement -

Congress MLAs to shift resort in Rajasthan

రాజస్థాన్‌లో రాజకీయ వేడి
రిసార్టులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
గెహ్లోత్‌కు సిఎల్‌పి మద్దతు
రెబెల్స్‌పై వేటుకు తీర్మానం
సచిన్‌తో రాజీకి బేరాలు
మంత్రివర్గ విస్తరణ పావులు?
జైపూర్/న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో కాంగ్రెస్ చిచ్చుఇప్పుడు రిసార్టుల స్థాయికి చేరుకుంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ నివాసంలో సోమవారం మధ్యాహ్నం హుటాహుటిన జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) భేటీ తరువాత ఎమ్మెల్యేలను జైపూర్‌కు సమీపంలోని రిసార్ట్‌కు తరలించారు. అంతకు ముందు జరిగిన సిఎల్‌పిలో పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గెహ్లోట్ పట్ల పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి సిఎల్‌పిలో ఓ తీర్మానం ఆమోదించారు. పైలెట్ పేరు ప్రస్తావించకుండానే పార్టీలో క్రమశిక్షణా ఉల్లంఘనలకు దిగిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీ కార్యవర్గ సభ్యులు కానీ సిఎల్‌పి సభ్యులు కానీ ఇతరులు కానీ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే చర్యలకు దిగితేతగు మూల్యం చెల్లించుకునేలా చేయాలని ఇందులో పేర్కొన్నారు. ఇది పిసిసి అధ్యక్షులు పైలెట్‌కు చురకగా భావిస్తున్నారు. పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ బలహీనపర్చేందుకు ఎవరు యత్నించినా సహించేది లేదని తెలిపారు. అయితే ఇందులో పైలెట్ పేరు ప్రస్తావించలేదు. తారాస్థాయికి చేరుకుంది. ఉపముఖ్యమంత్రి, యువ నేత సచిన్ పైలెట్ తిరుగుబాటు జెండా ఎగురేశారు.

ఇది జరిగిన కొద్దిగంటలకే అఖిలభారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకులు అవినాశ్ పాండే ఓ ప్రకటన వెలువరించారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పూర్తి బలం ఉందని తెలిపారు. ఇప్పటికే 109 మంది ఎమ్మెల్యేలు సిఎంకుమద్దతు తెలిపే లేఖపై సంతకాలు చేశారని వెల్లడించారు. ఇతరులు కూడా గెహ్లోట్‌తో ఫోన్‌లు ఇతరత్రా మాట్లాడుతున్నారని తెలిపారు. ఓ వైపు యువ నేత, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు అయిన పైలెట్ రాష్ట్రంలో ఇప్పుడు గెహ్లోట్ ప్రభుత్వం బలం పడిపోయిందని, మైనార్టీ ప్రభుత్వం ఉందని బహిరంగంగా ప్రకటన వెలువరించారు. దీనితో కాంగ్రెస్‌లో అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనకు ముప్పు ఏర్పడే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) భేటీకి హాజరు కావాలని విప్ జారీ చేసినట్లు పాండే తెలిపారు. దీనికి హాజరు కాని వారిపై తగు విధమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. దీనితో పైలెట్ , సీనియర్ నాయకుడు అయిన గెహ్లోట్ వర్గాల మధ్య బలాబలాల పోటీ పర్వం నెలకొంది.

ఇప్పటికే 109 మంది ఎమ్మెల్యేలు గెహ్లోట్ పట్ల పూర్తి విశ్వాసం తెలియచేసే పత్రంపై సంతకాలు చేశారని పాండే తెలిపారు. తమకు గెహ్లోట్, సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంపై నమ్మకం ఉన్నట్లు, దీనిని కాదనే పరిస్థితి లేదని తెలిపే పత్రంపై సంతకాలు చేశారు. కొందరు ఎమ్మెల్యేలు అందుబాటులో లేరని, అయితే ముఖ్యమంత్రితో మాట్లాడి మద్దతు తెలిపారని, వీరు కూడా పత్రంపై సంతకాలు చేస్తారని పాండే ముఖ్యమంత్రి నివాసంలో సోమవారం విలేకరులకు తెలిపారు. అశోక్ గెహ్లోట్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు జరుగుతోన్న కుట్ర వెనుక బిజెపి ఉందని పాండే ఆరోపించారు. అయితే మోడీ ఇతర నేతల యత్నాలు ఫలించబోవని, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం నిలుస్తుందని పాండే విశ్వాసంవ్యక్తం చేశారు. 200 మంది సభ్యుల శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం 107. బిజెపికి 72 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో చేసినట్లుగానే ఇక్కడ కూడా బిజెపి కుటిల బుద్ధిని ప్రదర్శిస్తోందని. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు యత్నిస్తోందని పాండే ఇతర కాంగ్రెస్ నేతలు విమర్శించారు. మధ్యప్రదేశ్ తరహా కుట్రలురాజస్థాన్‌లో సాగబోవని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. రాష్ట్రంలో మొత్తం 13 మంది ఇండిపెండెంట్లలో పది మంది కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. రాష్ట్రీయలోక్‌దళ్‌కు చెందిన ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు మిత్రపక్ష ఎమ్మెల్యేగానే ఉన్నారు.

భారతీయ ట్రైబల్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, సిపిఎంకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా గెహ్లోట్‌కు మద్దతుగా నిలుస్తారని కాంగ్రెస్ వర్గాలు దీమాతో ఉన్నారు. 72 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న బిజెపికి ముగ్గురు ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉన్న ఆర్‌ఎల్‌పి మిత్రపక్షంగా ఉంది. అయితే తనకు 30 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే మద్దతు ప్రకటించారని ఆదివారం సచిన్ పైలెట్ ప్రకటించారు. గెహ్లోట్‌పై తిరుగుబాటుకు దిగారు. ప్రభుత్వం మైనార్టీ అయిందన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతు ప్రకటించనున్నారని, పైలెట్ తేల్చిచెప్పారు. తమకు కొందరు ఇండిపెండెంట్లు కూడా మద్దతు ప్రకటిస్తారని తెలిపిన పైలెట్ తాను బిజెపిలో చేరడం లేదని ప్రకటించారు. తాను కాంగ్రెస్‌వాదినని పేర్కొంటూ ఇది గెహ్లోట్ వ్యతిరేక తిరుగుబాటు అని తెలిపారు. అయితే పైలెట్ ప్రకటనతో ఎటువంటి ఇబ్బంది లేదని , ఇప్పటికే అత్యధిక సంఖ్యలో పార్టీ ఎమ్మెల్యేలు సిఎం నివాసానికి చేరుకుని ప్రత్యక్షంగా ఆయనకు మద్దతు తెలిపారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తెలిపారు.
పైలెట్ కోసం తలుపులు తెరిచే ఉంటాయి
సచిన్ పైలెట్ ఇతర ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉంటాయని సీనియర్ నాయకులు రణదీప్ సూర్జేవాలా జైపూర్‌లో విలేకరులతో చెప్పారు. మంగళవారం కీలకమైన సిఎల్‌పి భేటీ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై సోమవారం ఆయన స్పందించారు. సిఎల్‌పికి అంతా హాజరు కావాలని, దీనికి హాజరు అయ్యే వారంతా అవినాశ్ పాండేతో మాట్లాడాలని సూచించారు. రాజస్థాన్ కాంగ్రెస్‌లో యువ, వృద్ద నేతల మధ్య రగులుకున్న పోరు శృతి మించిన వెంటనే ఎఐసిసి రంగంలోకి దిగింది. ఢిల్లీ నుంచి హుటాహుటిన పాండే, సూర్జేవాలా, అజయ్ మకెన్‌లు జైపూర్‌కు చేరుకున్నారు. మంగళవారం నాటి సిఎల్‌పిపై దృష్టి సారించారు. రిసార్ట్‌లకు ఎమ్మెల్యేలు ..
పైలెట్‌తో రాజీకి మంతనాలు 
రాజస్థాన్‌లో రాజకీయ వేడి సోమవారం రిసార్ట్ క్యాంప్‌ల స్థాయికి చేరింది. ఎమ్మెల్యేలలో అత్యధికులు సిఎం ఇంటికి చేరారు. తరువాత వారంతా బస్సుల్లో రిస్టార్టులకు బయలుదేరి వెళ్లారు. సోమవారం గెహ్లోట్ నివాసానికి 97 మంది ఎమ్మెల్యేలు హాజరయినట్లు వెల్లడైంది. ఇద్దరు మంత్రులు రాలేదు. కేవలం పది నుంచి 15 మంది ఎమ్మెల్యేలే సచిన్‌కు మద్దతుగా ఉన్నారని గెహ్లోట్ వర్గాలు తెలిపాయి. మరో వైపు రెబెల్ నేత సచిన్ పైలెట్‌ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రంగంలోకి దిగారు. రాహుల్, ప్రియాంక, చిదంబరం, కెసివేణుగోపాల్‌లు కూడా ఫోన్‌లో సచిన్‌తో మాట్లాడినట్లు వెల్లడైంది. సిఎంపై అసంతృప్తితో ఉన్న సచిన్‌ను చల్లార్చేందుకు వెంటనే మంత్రివర్గ విస్తరణకు దిగాలని, పైలెట్ వర్గీయులకు స్థానం కల్పించాలని అధిష్టానం భావిస్తోంది. పైలెట్ అసంతృప్తి నేపథ్యంలోనే బిజెపి రంగంలోకి దిగితే వారికున్న ఆర్థిక వనరులతో పార్టీ ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్ల మద్దతు కూడా కోల్పోవల్సి వస్తుందని, మధ్యప్రదేశ్ తరహాలోనే ఈ కీలక రాష్ట్రాన్ని కోల్పోవల్సి వస్తుందని ఆందోళన చెందుతోన్న కాంగ్రెస్ అధిష్టానం వెంటనే పార్టీ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించింది.

Congress MLAs to shift resort in Rajasthan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News