Wednesday, May 1, 2024

నేపాల్ సంక్షోభం

- Advertisement -
- Advertisement -

Constitutional crisis in Nepal

 

నేపాల్ రాజకీయం, మరిగిమరిగి బద్దలైన కుండను తలపిస్తున్నది. అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో ముదిరిన అంతర్గత సంక్షోభం ప్రధాని కె.పి. ఓలిని చేతులు కట్టేసిన స్థితికి నెట్టివేయడంతో ఆదివారం నాటి మంత్రివర్గ సమావేశంలో ఆయన ఎకాఎకీ పార్లమెంటు రద్దుకే సిఫారసు చేయించారు. దానిని దేశాధ్యక్షురాలు విద్యాభండారీ వెంటనే ఆమోదించి ఏప్రిల్, మే నెలల్లో రెండు విడతల మధ్యంతర ఎన్నికలను ప్రకటించారు. దీనితో ప్రజాస్వామిక నేపాల్‌లో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ సంక్షోభానికి తెర లేచింది. 275 మంది సభ్యులున్న నేపాల్ ప్రతినిధుల సభ (దిగువ సభ) కు 2017లో ఎన్నికలు జరిగాయి. ప్రస్తుత సభ 2022 వరకు కొనసాగవలసి ఉంది. ఈ పరిస్థితుల్లో దానిని రద్దు చేయించడం రాజ్యాంగ విహితం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఎన్నికైన సభను ఏకపక్షంగా రద్దు చేయించే అవకాశం నేపాల్ రాజ్యాంగం ఇవ్వలేదని అంటున్నారు. అందుచేత సుప్రీంకోర్టుదే అంతిమ నిర్ణయం కానున్నది. ప్రతినిధుల సభలో ప్రధాని శర్మ ఓలికి మూడింట రెండు వంతుల మెజారిటీ ఉంది. అయితే పాలక పార్టీలోని ఆయన వర్గానికి, మాజీ ప్రధాని పూర్వపు మావోయిస్టు పార్టీ నేత పుష్పకమల్ దహాల్ ప్రచండ వర్గానికి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయి విభేదాలు నెలకొన్నాయి.

వాటి కారణంగానే తాజా పరిణామం సంభవించింది. ప్రభుత్వం పార్లమెంటులో మెజారిటీని కోల్పోడం వల్లనో దేశంలో ఇతరత్రా సంక్షోభం తలెత్తినందు వల్లనో ఈ సంక్షోభం ఏర్పడలేదు. పార్లమెంటు రద్దుకు సిఫారసు చేస్తూ ప్రధాని ఓలి తీసుకున్న నిర్ణయం చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఆయన దిగిపోవలసి వస్తుంది. రద్దు నిర్ణయాన్ని కోర్టు ధ్రువపరిస్తే ఎన్నికలు జరిగే వరకు అంటే మరి ఆరు మాసాల పాటు ఓలి అధికారంలో కొనసాగుతారు. నేపాల్‌లో రెండు ప్రధాన వామపక్షాలైన శర్మ ఓలి నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ (ఐక్యమార్కిస్టు, లెనినిస్టు) ఆఫ్ నేపాల్, ప్రచండ సారథ్యంలో ఉండిన కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు సెంటర్) ఆఫ్ నేపాల్ 2018 మేలో విలీనమై నేపాల్ కమ్యూనిస్టు పార్టీ అవతరించింది. అప్పుడు ఆ ఇద్దరూ ఐక్య పార్టీకి సహ అధ్యక్షులుగా ఉండడానికి అంగీకారం కుదిరింది. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో చెరి సగ కాలం ప్రధానులుగా ఉండాలని కూడా ఒప్పందానికి వచ్చారు. ముందుగా అధికారం చేపట్టిన శర్మ ఓలి దానిని గౌరవించకపోడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తి రాజుకుంటూ వచ్చాయి.

అధికార పార్టీలో కీలక నిర్ణయాధికారం గల తొమ్మది మంది సభ్యుల కార్యదర్శి వర్గంలో ప్రచండది పైచేయి కావడంతో ప్రధాని ఓలి అభిమతానికి తరచూ భంగపాటు ఎదురవుతున్నది. రాజ్యాంగ పదవుల నియామకాలకు సిఫారసు చేసే రాజ్యాంగ మండలి నిబంధనలను తనకు అనుకూలంగా సవరింప చేస్తూ ఈ నెల 15న ఓలి తీసుకు వచ్చిన ఆర్డినెన్స్‌పై పార్టీలోని రెండు వర్గాలూ తీవ్రంగా విభేదించాయి. ఓలి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నిరంకుశ నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రచండ వర్గం ఆరోపిస్తున్నది. దీనికి తోడు చైనా అండదండలతో ఓలి అధికారంలో నెట్టుకొస్తున్నాడనే అభిప్రాయమూ కలిగింది. ప్రచండతో తమకు గల సాన్నిహిత్యాన్ని ఉపయోగించి చైనా నాయకత్వం ఓలితో ఆయనకున్న విభేదాలు హద్దు మీరకుండా చూస్తూ వచ్చింది. ఒక దశలో నేపాల్‌లోని చైనా రాయబారి జోక్యం చేసుకొని రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చారని వార్తలు వచ్చాయి. సరిహద్దుల్లోని కొన్ని భారత భూభాగాలను చేర్చుకుంటూ ఓలి ప్రభుత్వం విడుదల చేసిన కొత్త నేపాల్ పటాన్ని పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించినప్పుడు తన అధికారానికి అడ్డులేదనే అభిప్రాయానికి వచ్చి ప్రధాని ఏకగ్రీవ నిర్ణయాలను తీసుకోడంలో జోరు పెంచారు.

భారత ప్రభుత్వం కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత విడుదల చేసిన దేశ పటంలో చూపించిన లిపులేఖ్, కాలాపాని వంటి ప్రాంతాలను తమవిగా చూపిస్తూ నేపాల్ తన తాజా మ్యాపును పార్లమెంటు చేత ఆమోదింప చేసుకున్నది. దీని వెనుక చైనా హస్తమున్నదని భారత ప్రతినిధి పరోక్షంగా వ్యాఖ్యానించడమూ జరిగింది. ప్రతిపక్షాలు నేపాల్ కాంగ్రెస్, మధేసీ పార్టీ వంటివి కూడా అంతర్గత విభేదాలతో సతమతమవుతున్నాయి. అందుచేత ఇప్పటి సంక్షోభాన్ని తమకు అనువుగా మార్చుకునే శక్తి వాటికి లేదు. పాలక పక్షంలోని రెండు వర్గాల్లో దేనిది పైచేయి అవుతుందో నేపాల్ భవిష్యత్తు ఆ వైపు అడుగులు వేస్తుంది. ఈలోగా శర్మ ఓలి మద్దతుతో మళ్లీ పాలు పోసుకొని పడగెత్తాలని అణగారిపోయిన రాచరిక శక్తులు ప్రయత్నిస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతానికైతే నేపాల్ కూడలిలో ఉంది. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత దాని దిశ నిర్ధారణ అవుతుంది. ఈ పరిణామాలను గమనిస్తూ ఉండడానికే పరిమితం కావడంలో భారత ప్రభుత్వం పరిణతి రుజువవుతున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News