Monday, April 29, 2024

కోరమాండల్ డ్రైవర్ తప్పిదం లేదు: రైల్వే బోర్డు

- Advertisement -
- Advertisement -

ఒడిశా: ఒడిశా రైలు ప్రమాదానికి కారణాలను రైల్వే బోర్డు ఆదివారం వెల్లడించింది. రైళ్ల వేగం అనుమతికి లోబడి ఉందని, అయితే సిగ్నలింగ్ లోపం ఎఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని తెలిపింది. మూడు రైళ్లు ఢీకొన్నాయని తప్పుగా భావించరాదని, కోరమాండల్ ఎక్‌ప్రెస్ ఒక్కటే ప్రమాదానికి గురయిందని తెలిపింది. ముడి ఇనుముతో ఉన్న గూడ్సు రైలును ఢీకొనడం వల్లనే ప్రమాద తీవ్రత ఎక్కువైందని తెలిపింది. రైల్వే బోర్డు ఆపరేషన్, బిజెనెస్ డెవలప్‌మెంట్ సభ్యురాలు జయావర్మ సిన్హా, సిగ్నలింగ్ విభాగం ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ మాధుర్‌లు ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ , ఒడిశాలోని బహనగ బజార్ స్టేషన్‌లో నాలుగు రైల్వే లైన్లు ఉన్నాయని చెప్పారు. వీటిలో రెండు స్ట్రెయిట్‌మెయిన్ లైన్స్ అని, మిగిలిన రెండూ ఇరు వైపులా ఉన్న లూప్‌లైన్స్ అని చెప్పారు.

మెయిన్ లైన్స్ రెండూ లూప్‌లైన్స్‌కు మధ్యలో ఉన్నాయన్నారు. ఈ స్టేషన్‌లో ఏదైనా రైలును ఆపాలంటే లూప్ లైన్‌లో ఆపుతామని చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఎదురెదురుగా వచ్చాయన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రమాదం జరిగినప్పుడు రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు దారి ఇవ్వడం కోసం రెండు గూడ్సు రైళ్లను లూప్‌లైన్లలో ఆపి ఉంచినట్లు తెలిపారు. కోరమాండల్, యశ్వంత్‌పూర్ హౌరా ఎక్స్‌ప్రెస్‌ల కోసం రెండు లైన్లను క్లియర్ చేసి ఉంచినట్లు తెలిపారు. అంతా సజావుగానే ఉందని ఆకుపచ్చ(గ్రీన్) సిగ్నల్ ఉందని తెలిపారు. గ్రీన్ సిగ్నల్ అంటే రైలును గరిష్ఠ వేగంతో నడపవచ్చని చెప్పారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గరిష్ఠ వేగం గంటకు 130 కిలోమీటర్లు అని, అయితే ఆ రైలు గంటకు 128 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించిందని వారు చెప్పారు.

యశ్వంత్‌పూర్ హౌరా ఎక్స్‌ప్రెస్ కూడా గంటకు 126 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించిందని , దీని వేగం కూడా పరిమితికి లోబడే ఉందన్నారు. అంతా సక్రమంగానే ఉన్నప్పటికీ ఏదో కారణం చేత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురయిందని, ఈ కారణం ఏమిటో తెలుసుకునేందుకే దర్యాప్తు జరుగుతోందని అన్నారు. ప్రాథమిక నివేదిక ప్రకారం సిగ్నలింగ్ లోపం ఉన్నట్లు సంకేతాలు వచ్చాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News