Friday, April 26, 2024

మేడారం, తిరుమల భక్తులకు ‘కరోనా’ భయం

- Advertisement -
- Advertisement -

Corona

 

హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మేడారం, తిరుమలకు వెళ్లే భక్తులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే చైనాలో ఈ మహమ్మారి బారినపడి 170 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇంకా దాదాపు 4,000లకు పైగా కేసులు నమోదయ్యాయి. అటు పొరుగు దేశాలతో పాటుగా మొత్తం 17 దేశాల్లో దీని ప్రభావం ఉంది. దీంతో ఈ కరోనా వైరస్ ఈ పేరు వింటేనే చాలు మనదేశంలో అంతా భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మేడారం జాతరకు, తిరుమలకు వచ్చే భక్తులు దీని పేరు వింటేనే హడలెత్తిపోతున్నారు. దేశ, విదేశీ భక్తులంతా ఒకేచోటకి వచ్చే ఈ పుణ్యక్షేత్రాల వద్ద కరోనా వైరస్ వచ్చిన వారు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై ప్రస్తుతం చర్చలు మొదలయ్యాయి.

అధికారులు మాత్రం కరోనా వైరస్ ప్రభలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టుగా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకకుండా తిరుమలలో అధికారులు భారీ చర్యలను చేపట్టారు. నిత్యం దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో తిరుపతిలో ప్రత్యేక క్యాంపులను సైతం ఏర్పాటు చేస్తున్నారు. అయితే మేడారంకు వచ్చే భక్తులు పాటించాల్సిన జాగ్రత్తలపై ఇటు తెలంగాణ ప్రభుత్వం అవగాహన కల్పిస్తుండగా, అటు తిరుపతిలో కూడా ప్రత్యేక మెడికల్ క్యాంపుల ద్వారా సహాయక చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు.

తెలుగు రాష్ట్రాలే కాకుండా వివిధ దేశాల నుంచి హాజరు
కాగా, దేశంలో రెండో కుంభమేళగా పేరుగాంచిన మేడారం మహాజాతర ఈనెల 5వ తేదీన ప్రారంభం కానుంది. 8వ తేదీ వరకు జరిగే ఈ జాతరకు దాదాపు కోటి నుంచి రెండు కోట్ల మంది భక్తులు హాజరువుతారని అధికారుల అంచనా. ఇక్కడికి కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా పొరుగు రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరవు తుంటారు. అయితే ఇంత పెద్ద ఎత్తున భక్తులు ఒకేచోట గుమికూడితే కరోనా వ్యాపించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో అధికారులు జాతరకు వచ్చే భక్తులకు పాటించాల్సిన ముందస్తు జాగ్రత్తలు, కరోనా వైరస్ వ్యాపించకుండా రక్షణ చర్యలపై భక్తులకు ఇప్పటి నుంచే అవగాహన కల్పిస్తున్నారు.

జాతర ప్రాంగణంతో పాటు, మేడారంకు చేరుకునే అన్ని మార్గాల్లో కరోనా వైరస్ అవగాహనకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని విధాలుగా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామని అధికారులు భక్తులకు తెలియజేస్తున్నారు. జాతర ప్రాంగణంలో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పటికే వెల్లడించగా, కరోనా వైరస్ మేడారం పొలిమేరల్లోకి రాకుండా పూర్తి జాగ్రత్తలు చేపట్టామని వారు భరోసా కల్పిస్తున్నారు.

Corona fear for devotees of Medaram and Tirumala
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News