Wednesday, May 1, 2024

మరో వేవ్ భయాలు!

- Advertisement -
- Advertisement -

Communal clashes during Ram Navami procession వరుస మూడు అలలతో ప్రపంచాన్ని మూడు చెరువుల నీళ్లు తాగించి ముప్పుతిప్పలు పెట్టిన కరోనా (కొవిడ్ 19) మళ్లీ విరుచుకుపడనున్నదా? ఈ ఊహే చెప్పనలవికాని భయోత్పాతాన్ని సృష్టిస్తుంది. నిలువెల్లా వణికిపోయేలా చేస్తుంది. చైనాలో, మధ్య, పశ్చిమ యూరప్‌లో కొవిడ్ మళ్లీ తీవ్రతరమవుతున్నట్టు వస్తున్న వార్తలు ఎలా వున్నప్పటికీ దేశంలో మాత్రం అది బాగా తగ్గిందని, పూర్తిగా కనుమరుగైపోతున్నదని భావిస్తున్న సమయంలో దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో కేసుల సంఖ్య వున్నపళంగా మూడింతలు పెరిగి తొందరగా వ్యాపిస్తున్నట్టు వచ్చిన తాజా వార్తలు తిరిగి ఆందోళన కలిగిస్తున్నాయి.

దేశం మొత్తం మీద గత వారంతో పోలిస్తే ఈ వారం కొవిడ్ కేసులు 35 శాతం పెరిగాయని తాజా సమాచారం తెలియజేస్తున్నది. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఈ తీవ్రమైన పెరుగుదల నమోదైంది. అంతకు ముందరి ఏడు రోజులలో (ఈ నెల 1117) దేశ వ్యాప్తంగా 4900 కేసులు నమోదు కాగా, మొన్నటి ఆదివారంతో ముగిసిన వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా 6610 తాజా కేసులు రికార్డయ్యాయి. ఇది అసాధారణ స్థితిని ప్రతిబింబిస్తున్నది. అయితే కొవిడ్ మరణాల సంఖ్య పెరగడానికి బదులు తగ్గుతూ వుండడం ఒకింత ఊరట కలిగించే అంశం. ఢిల్లీలో ఈ నెల 1117 తేదీల మధ్య 943 కొత్త కేసులు నమోదు కాగా, మొన్నటి ఆదివారం నాటితో ముగిసిన వారం రోజుల్లో 145 శాతం అధికంగా 2307 కొత్త కేసులు రికార్డయ్యాయి.

అయితే దేశంలో నాలుగవ కెరటం కరోనా ప్రారంభమైందనడానికి నిదర్శనంగా దీనిని తీసుకోవచ్చా అనే ప్రశ్నకు అది తొందరపాటే అవుతుందని కాన్పూర్ ఐఐటి ప్రొఫెసర్ ఒకరు ఇచ్చిన సమాధానం ఆశాజనకంగా వుంది. కొవిడ్ అంతమైందనే ధీమాతో ప్రజలు ఒక్కసారిగా దానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలకూ స్వస్తి చెప్పడంతో వున్నపళంగా కేసుల సంఖ్య పెరిగిందే గాని, కొత్తగా దాపురించిన వేవ్‌గా దీనిని పరిగణించలేమని ఆయన అన్నారు. ప్రపంచాన్ని ఈ మహమ్మారి వైరస్ పీడించడం మొదలైన తర్వాత తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభించడం దానికి అలవాటుగా మారిన విషయం అనుభవంలోకి వచ్చింది. దానిని దృష్టిలో పెట్టుకొని నాలుగవ వేవ్ కూడా మొదలైతే కావచ్చునేమో అనే అంచనాతో ముందు జాగ్రత్తలు వహించడం అత్యంత అవసరం. కరోనా మొదలైన తర్వాత ఈ మూడేళ్లలో ఇంత వరకు ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల 48 లక్షల 35 వేల 361 కేసులు నమోదై, 62 లక్షల 23 వేల 651 మంది మృతి చెందారు. భారత దేశంలో 4 కోట్ల 30 లక్షల కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య అధికారికంగా 5 లక్షల 22 వేలు, అనధికారికంగా పది, పదిహేను లక్షల మందే వుండవచ్చని అంచనాలు వెలువడ్డాయి. వందలు వేలాది కుటుంబాల్లో కరోనా సృష్టించిన విషాదం అంతాఇంతా కాదు.

అకాల మరణాలు ఇంటింటా కన్నీళ్లు తెప్పించాయి. అత్యవసర మందులు, ఆక్సిజన్ కరువై చూస్తూ వుండగానే ఊపిరులు ఆగిపోయి మృత్యువు పగబట్టిన రీతిలో దేశాన్ని పట్టిపల్లార్చింది. రెండవ వేవ్ కొవిడ్ కేంద్రంలోని ప్రధాని మోడీ ప్రభుత్వ చేతగానితనాన్ని నిలువెత్తున రుజువు చేసింది. ఇంట్లోని పాత్రలు మోగించి, ప్రార్థనలు చేసి కొవిడ్‌ను తరిమేయమని ఉద్బోధించిన దేశాధినేత ఆక్సిజన్ సిలిండర్ల కొరతను తీర్చలేక, ప్రపంచానికి టీకా దానం చేస్తున్నామని గొప్పలు చెప్పుకోడానికి, దేశంలో వాటి అవసరం పడినప్పుడు చేతులెత్తేశారు. ఆలోగా గాలిలో కలిసిపోయిన ప్రాణాలు లెక్కకందనన్ని అంటే అతిశయోక్తి కాదు. మన ‘పవిత్ర’ గంగా నది మోసుకెళ్లిన కొవిడ్ మృతుల శవాల గణాంకాలు గల్లంతు. వాటిని లెక్కపెట్టిన వారే లేరు. ఎన్ని కుటుంబాలు పోషకులను కోల్పోయి అనాథలయ్యాయో చెప్పనలవికాదు. ప్రధాని మోడీ ప్రజలకు సకాలంలో మేలు చేయకపోగా ఆకస్మిక లాక్‌డౌన్‌ను ప్రకటించి వలస కార్మికులను బాధించిన తీరు సాటిలేనిది. ఉన్నపళంగా ఉద్యోగాలు, ఉపాధులు కోల్పోయి నిలువ నీడ లేక స్వస్థలాలకు చేరుకోడానికి మండుటెండల్లో పాదచారులై ప్రయాణం చేసిన అసంఘటిత రంగ కార్మికుల బాధలు వర్ణణాతీతం. రాష్ట్ర ప్రభుత్వాలు తమకు చేతనైనంత సాయాన్ని చేసి ఆదుకోగలిగాయి.

చలన చిత్ర నటుడు సోనూసూద్ వంటి దయార్ద్ర హృదయులు అందించిన అండదండలు అక్కరకు వచ్చాయి. అయితే టీకాల రంగంలో మొదట్లో తడబడినా ఆ తర్వాత వేగం పుంజుకొని అందించగలిగిన సాయం దేశంలో కొవిడ్ తగ్గు ముఖం పట్టడానికి దోహద పడింది. మొన్న ఆదివారం ఉదయం వరకు దేశ వ్యాప్తంగా 186.51 కోట్ల డోసుల టీకాలు వేసినట్టు సమాచారం. అవసరమైన చోట బూస్టర్ డోసులు కూడా ఇవ్వగలిగి దేశంలో నాలుగో వేవ్ కరోనా వ్యాప్తి అనే దానిని ఆపగలిగితే అంతకంటే గొప్ప విషయం మరొకటి వుండదు. ప్రభుత్వాల స్థాయిలో మరింత అప్రమత్తంగా వుండడం, ప్రజలు ఎవరికి వారు వ్యక్తిగతంగా మళ్లీ తగు జాగ్రత్తలకు మళ్లడం తక్షణావసరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News