Saturday, May 4, 2024

వర్కింగ్ వయస్సు వాళ్లే అత్యధికం…

- Advertisement -
- Advertisement -

పాజిటివ్ వస్తున్న వాళ్లలో 21 నుంచి 50 ఏళ్ళ వారే ఎక్కువ
అన్‌లాక్ పీరియడ్‌లో 85 శాతం మంది బాధితులు వీరే
ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి వైరస్‌తో హైరిస్క్
డిశ్చార్జ్ కొత్త నిబంధనలతో పెరుగుతున్న వైరస్ వ్యాప్తి

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఎవర్నీ వదలడం లేదు. చంటిపాప నుంచి పండు ముసలి వరకు అందరిపై దాడి చేస్తుంది. అయితే ఇటీవల నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం నడివయస్సు వారు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దీంతో అందరిలో కలవరం ప్రారంభమైంది. గత నెలరోజులుగా పాజిటివ్ వస్తున్న వారిలో 21 నుంచి 50 మధ్య వయస్సు(వర్కింగ్ ఏజ్ గ్రూప్) వారు ఎక్కువగా ఉన్నారని అధికారులు పేర్కొనడం ఆసక్తి మారింది. రాష్ట్రంలో వచ్చిన 10444 పాజిటివ్‌లలో(బుధవారం వరకు) సుమారు 7 వేలకు పైగా అన్‌లాక్ పీరియడ్‌లోనే నమోదయ్యాయి. వీటిలో 85 శాతం మంది బాధితులు 21 నుంచి 50 మధ్య వయస్సులు ఉన్నారని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

సాధారణంగా ఈ మధ్య వయసు వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. కానీ వీరికి కూడా వైరస్ తేలడం ఆందోళనకరం. వైరస్ తేలిన వాళ్లల్లో 75 శాతం మంది అసింప్టమాటిక్‌తోనే వస్తున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అంచనా వేసేందుకు ఇటీవల టెస్టులు సంఖ్యను పెంచడంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య అమాంతంగా పెరిగాయి. కంటైన్‌మెంట్ జోన్లు, పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్లో కొందరికి లక్షణాలు లేకపోయినా టెస్టులు చేయడంతో కేసులు భారీగా నమోదవుతున్నాని వైద్యారోగ్యశాఖ అధికారుల్లో ఒకరు తెలిపారు. అయితే వీరికి ఏ విధమైన ఇతర సమస్యలు లేకపోతే వైరస్‌తో పెద్ద ప్రమాదం లేదని నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

జన సమూహంలో తిరగడం వలనే వైరస్ వ్యాప్తి….

ఉద్యోగ, వ్యాపార రిత్యా, ఇతర పనులు కారణంగా నడి వయస్సు వారు బయటకు ఎక్కువగా వస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుతం లాక్‌డౌన్ ఎత్తివేయడంతో అత్యధికంగా 21 నుంచి 50 సంవత్సరాలలోపు వారు మార్కెట్లు, కార్యాలయాలు, ఇతర ప్రదేశాలకు వెళ్తున్నారు. ఈక్రమంలో జనసమూహం ఎక్కువ ఉన్న చోట ఒకరికి వైరస్ ఉంటే , మిగతా వారందరికీ వేగంగా అంటుకుంటుంది. అదే విధంగా కంపెనీలు, ఇతర ప్రదేశాల్లో అత్యధికంగా గుమిగూడే ప్రాంతాల్లోనూ ఒకరికి కరోనా సోకితే మిగతా వారందరికీ వైరస్ బారిన పడేస్తుంది. ప్రస్తుతం ఈ విధానంలోనే కేసులు భారీగా నమోదవుతున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అన్‌లాక్ పీరియడ్‌లో ఎక్కువ కేసులు ఈ విధంగానే నమోదయ్యాయని అధికారులు అంటున్నారు.

ఇదిలా ఉండగా గతంలో కరోనా పాజిటివ్ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జ్ చేసే ముందు రెండు సార్లు ఆర్‌టిపిసిఆర్ టెస్టులు చేసేవారు. రెండూ నెగటివ్ వస్తేనే అధికారులు సదరు వ్యక్తిని డిశ్చార్జ్ చేశారు. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు డిశ్చార్జ్ మార్గదర్శకాలను ఐసిఎంఆర్ సవరించింది. దీని ప్రకారం కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి అసుపత్రిలో అడ్మిట్ అయిన పది రోజుల్లో చివరి మూడు రోజులు జ్వరం రాకపోతే ఎలాంటి ఫైనల్ టెస్టులు చేయకుండానే డిశ్చార్జ్ చేయొచ్చని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే విధానంలో కోలుకున్న వారిని ఇళ్లకు పంపుతున్నారు. కానీ వీరే వైరస్ క్యారియర్లుగా మారుతున్నారని ఆరోగ్యశాఖ అధికారులు అనధికారికంగా వెల్లడిస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరూ మాస్క్, భౌతిక దూరం పాటించడం వలనే వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని, ఈక్రమంలో ఇంటి నుంచి బయటకు వచ్చేటపుడు ఖచ్చితంగా మాస్కు ధరించాలని వైద్యారోగ్యశాఖ అధికారులు మరోసారి గుర్తుచేస్తున్నారు.

ఈనెల 17వ తేది వరకు వయస్సు వారిగా కేసులు వివరాలు….

వయస్సు కేసుల సంఖ్య
0 నుంచి 20 695
21 నుంచి 50 3499
51 నుంచి 70 1285
71 నుంచి 95 196

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News