Sunday, April 28, 2024

సిబిఎస్‌ఇ 10, 12వ తరగతి పరీక్షలు రద్దు

- Advertisement -
- Advertisement -

ఐసిఎస్‌ఇ పరీక్షలు కూడా రద్దు
ఇంటర్నల్స్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు మార్కులు
సుప్రీంకోర్టుకు తెలియచేసిన సిబిఎస్‌ఇ, కేంద్రం

CBSE exams cancelled in india

న్యూఢిల్లీ: సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ బోర్డు జులైలో నిర్వహించవలసిన 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను కోవిడ్-19 మహమ్మారి కారణంగా రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం  సుప్రీంకోర్టుకు తెలియచేసింది. అయితే తర్వాతి కాలంలో తిరిగి పరీక్షలను కోరడం లేదా గత మూడు ఇంటర్నల్ ఎగ్జామ్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా రీ-అసెస్‌మెంట్ కోరే అవకాశం సిబిఎస్ బోర్డుకు చెందిన 12వ తరగతి విద్యార్థులకు ఉంటుంది. కాగా.. తిరిగి పరీక్షను కోరే అవకాశం 10వ తరగతి విద్యార్థులకు ఉండదు. అదే విధంగా తిరిగి పరీక్షలు కోరే అవకాశం ఐసిఎస్‌ఇ బోర్డుకు చెందిన 12వ తరగతి, 10వ తరగతి విద్యార్థులకు ఉండదని కేంద్రం వివరించింది.

జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్ సారథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట కేంద్రం, సిబిఎస్‌ఇ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదన వినిపించారు. జులై 1-15 మధ్య జరగవలసి ఉన్న సిబిఎస్‌ఇ 10, 12వ తరగతి పరీక్షలను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. గతంలో తమకు వచ్చిన మార్కుల ప్రాతిపదికన రీ-ఎగ్జామినేషన్ లేదా రీ-అసెస్‌మెంట్ కోరే అవకాశాలను 12వ తరగతి విద్యార్థులకు మాత్రమే కల్పిస్తూ ఒక పథకాన్ని రూపొందించామని మెహతా వివరించారు. దేశంలో కరోనా ఉధృతి తగ్గి సానుకూల వాతావరణం ఏర్పడిన తర్వాత 12వ తరగతి విద్యార్థులకు రీ-ఎగ్జామ్ నిర్వహించగలమని, అయితే 10వ తరగతి విద్యార్థులకు రీ-ఎగ్జామ్ నిర్వహించబోమని సిబిఎస్‌ఇ తరఫున ఎస్‌జి తెలిపారు.

పరీక్షా ఫలితాల తర్వాత కొత్త విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందన్న ధర్మాసనం ప్రశ్నకు పరీక్షా ఫలితాలను ఆగస్టు మధ్యలో ప్రకటిస్తామని సిబిఎస్‌ఇ జవాబిచ్చింది. కాగా 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు రీ-ఎగ్జామినేషన్ నిర్వహించబోమని ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(ఐసిఎస్‌ఇ) కోర్టుకు తెలిపింది. గత పరీక్షలలో సాధించిన ఫలితాల ఆధారంగా విద్యార్థుల ఫలితాలను ప్రకటిస్తామని వివరించింది. వాదనల అనంతరం ధర్మాసనం వివిధ రాష్ట్రాలలో కరోనా వైరస్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 12వ తరగతి విద్యార్థులకు రీ-ఎగ్జామిషన్ అవకాశం, ఇంటర్నల్ అసెస్‌మెంవ, ఫలితాల తేదీ తదితర అంశాలతో ఒక తాజా నోటిఫికేషన్ విడుదల చేయాలని సిబిఎస్‌ఇని, కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News