Sunday, April 28, 2024

ఆర్థిక సుడిగుండంలో మరో డజను దేశాలు

- Advertisement -
- Advertisement -

Countries reeling under debt repayment crisis

రుణాల చెల్లింపుసంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న అర్జెంటీనా, ఈజిప్టు, పాక్ తదితర దేశాలు
ఆదుకోవాలంటూ ఐఎంఎఫ్‌కు మొర

న్యూఢిల్లీ: కరెన్సీల పతనం, అడుగంటిన విదేశీ ద్రవ్య నిల్వలు, రుణ చెల్లింపుల భారంతో కూరుకు పోయిన శ్రీలంకలో సంక్షోభం చివరికి అక్కడ ప్రభుత్వం కుప్పకూలడానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఒక్క శ్రీలంక పరిస్థితే కాదు. దాదాపు డజనుకు పైగా దేశాలు అదే బాటలో పయనిస్తున్నాయని అక్కడి పరిస్థితులను గమనిస్తే అర్థమవుతుందని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. శ్రీలంకతో పాటుగా లెబనాన్, రష్యా ,సురినామ్, జాంబియా దేశాలు ఇప్పటికే రుణ సంక్షోభంలో చిక్కుకుని ఉన్నాయి. మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌తో పాటుగా అర్జెంటీనా ఈక్వెడార్, ఈజిప్టు లాంటి మరో డజను దేశాల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ దేశాల మొత్తం రుణ భారం 400 బిలియన్ డాలర్లకు పైగానే ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 150 బిలియన్ డాలర్ల రుణ భారంతో అర్జెంటీనా జాబితాలో ముందుండగా 45 బిలియన్ డాలర్లతో ఈజిప్టు, 40 బిలియన్ డాలర్లతో ఈక్వెడార్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రంచ మార్కెట్లు గనుక శాంతించితే, అంతర్జాతీయ ద్రవ్యనిధి( ఐఎంఎఫ్) ఆదుకుంటే ఈ దేశాలు ఇప్పటికీ ఈ సంక్షోభంనుంచి బైటపడగలవని అనేక సంక్షోభాలను చూసిన నిపుణులు అంటున్నారు. అయితే ప్రస్తుతానికి సంక్షోభంలో ఉన్న దేశాలేవో ఓ సారి చూద్దాం.

అర్జెంటీనా
రుణ సంక్షోభంలో కూరుకు పోయే ప్రమాదంలో అర్జెంటీనా ముందు వరసలో ఉందని నిపుణులు అంటున్నారు. ‘పెసోగా’ పిలవబడే ఆ దేశ కరెన్సీ నల్లబజారులో మామూలు విలువకన్నా 50శాతం తక్కువకు ట్రేడ్ అవుతోంది. మరోవైపు ప్రభుత్వం వద్ద విదేశీ ద్రవ్య నిల్వలు దాదాపుగా అడుగంటి పోయాయి. ఇక ప్రభుత్వ బాండ్లు డాలరులో 20 సెంట్లకు ట్రేడ్ అవుతున్నాయి. 2020 రుణ పునర్వవస్థీకరణ తర్వాత ఉన్న ధరతో పోలిస్తే ఇది సగానికన్నా తక్కువే. 2024దాకా ప్రభుత్వం చెల్లించాల్సిన రుణాలు పెద్దగా ఏమీ లేవు కానీ ఆ తర్వాత అవి ఒక్కసారిగా పెరిగిపోనున్నాయి. అయితే బలమైన రాజకీయ నాయకురాలిగా గుర్తింపు పొందిన ఆ దేశ ఉపాధ్యక్షురాలు క్రిస్టీనా ఫెర్నాండెజ్ డి కిర్చర్ ఐఎంఎఫ్‌పై ఒత్తిడి తెచ్చి దేశాన్ని రుణ భారంనుంచి గట్టెక్కించే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఉక్రెయిన్
రష్యా దురాక్రమణ కారణంగా ఇప్పటికే పూర్తిగా చితికిపోయిన ఉక్రెయిన్ త్వరలో చెల్లించాల్సిన సుమారు 1.2 బిలియన్ డాలర్ల రుణాలను వాయిదా వేసుకోవడం తప్పనిసరిగా మారింది. వచ్చే సెప్టెంబర్‌లో మోర్గాన్ స్టాన్లీ, అముండి వార్న్‌లాంటి బలమైన ప్రైవేటు పెట్టుబడిదారులకు ఉక్రెయిన్ ఈ బాండ్ చెల్లింపులు జరపాల్సి ఉంది. అయితే అమెరికా, యూరప్ దేశాలనుంచి అందుతున్న ఆర్థిక సాయం, ప్రభుత్వం వద్ద ఉన్న ద్రవ్య నిల్వలతో ఆ దేశం వీటిని చెల్లించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అయితే రెండు సంవత్సరాల పాటు రుణాలను స్తంభింపజేయాలని దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన ప్రభుత్వ అధీనంలోని ‘నాఫ్టోగాజ్’ గత వారం కోరిన నేపథ్యంలో త్వరలోనే ప్రభుత్వం కూడా ఇదే విధమైన డిమాండ్ చేసే అవకాశముందని భావిస్తున్నారు.

టునీసియా
ఐఎంఎఫ్ రుణాలకోసం పాకులాడే దేశాల్లో ఆఫ్రికా దేశాలు ముందువరసలో ఉంటాయి. అయితే టునీసియా పరిస్థితి మరింత దారుణంగా ఉందని విశ్లేషకులు అంచనా. దాదాపు10 శాతానికి చేరుకున్న బడ్జెట్ లోటు, ప్రపంచంలోనే అత్యధిక ంగా ఉండే ప్రభుత్వ రంగ ఉద్యోగుల వేతనాల బిల్లు,కు తోడు దేశంలో బలమైన కార్మిక యూనియన్‌పై తన పట్టును పెంచుకోవడానికి దేశాధ్యక్షుడు కైస్ సయిద్ చేస్తున్న ప్రయత్నాలతో ఐఎంఎఫ్ రుణం పొందడం కష్టతరం కావచ్చని నిపుణులు అంటున్నారు. మోర్గాన్ స్టాన్లీ రుణ ఎగవేతదారుల జాబితాలో ఉక్రెయిన్, ఎల్‌సాల్వడార్‌తో పాటుగా టునీసియా కూడా ముందువరసలో ఉంది. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం తప్పనిసరిగా కనిస్తోందని టునీసియా కేంద్ర బ్యాంక్ అధ్యక్షుడు మారౌన్ అబాస్సీ వ్యాఖ్యానించడం గమనార్హం.

ఘనా
ఇష్టవ వచ్చినట్లుగా పెద్ద ఎత్తున అప్పులు చేయడంతో ఘనా దేశం అప్పులు జిడిపిలో 85 శాతానికి అప్పుడే చేరుకున్నాయి. దేశ కరెన్సీ ‘ సెడి’ ఈ ఏడాది నాలుగో వంతు విలువను కోల్పోయింది. అంతేకాదు ఇప్పటికే పన్నులద్వారా వచ్చిన ఆదాయంలో సగానికి పైగా రుణాల వడ్డీలు చెల్లించడానికే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. మరో వైపు ద్రవ్యోల్బణం 30 శాతం దరిదాపుల్లోకి చేరుకోవడం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది.

ఈజిప్టు
ఈజిప్టు రుణాల నిష్పత్తి ఆ దేశ జిడిపిలో 95 శాతానికి చేరుకోగా, మరో వైపు దేశంనుంచి విదేశీ పెట్టుబడులు భారీ ఎత్తున తరలి వెళ్లడం దేశానికి ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఈ ఏడాది దాదాపు 11 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టబడులు దేశంనుంచి తరలిపోయినట్లు మోర్గాన్ స్టాన్లీ అంచనా. రాబోయే అయిదేళ్లలో ఈజిప్టు దాదాపు 100 బిలియన్ డాలర్ల రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుందని ఫండ్ సంస్థ ఎఫ్‌ఐఎం పార్టర్స్ అంటోంది. 2024లో చెల్లించాల్సిన సుమారు 3.3 బిలియన్ల బాండ్ల చెల్లింపులు కూడా ఇందులో ఉంది. ప్రభుత్వం పౌండ్‌తోతన కరెన్సీ విలువను 15 శాతం మేర తగ్గించుకుంది. అంతేకాక రుణాల చెల్లింపుల సమస్యను అధిగమించడానికి సాయం అందించాలని గత మార్చిలోనే ఐఎంఎఫ్‌ను కోరింది.

పాకిస్థాన్
శ్రీలంక తరహాలోనే మన పొరుగు దేశం పాకిస్థాన్ కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విదేశీ కరోన్సీ నిల్వలు గతంలో ఎన్నడూ లేని విధంగా 9.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇవి కేవలం ఐదు వారాల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. ఇక పాకిస్థాన్ కరెన్సీ( రుపీ) రికార్డు స్థాయిలో బలహీనపడింది. ప్రభుత్వ ఆదాయంలో దాదాపు 40 శాతం వడ్డీల చెల్లింపులకే ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవలసిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గత వారం ఐఎంఎఫ్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇప్పటికే సంక్షోభం తీవ్రతరమయిన నేపథ్యంలో ఈ ఒప్పందం ఎంతవరకు ఆ దేశాన్ని ఆదుకుంటుందో చూడాలి. ఈ దేశాలే కాదు కెన్యా, ఇథియోపియా, ఎల్ సాల్వడార్, బెలారస్, ఈక్వెడార్, నైజీరియా వంటి మరికొన్నిదేశాలు కూడా రుణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆ సంక్షోభంనుంచి ఆ దేశాలు గట్టెక్కలేక పోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News