Thursday, May 9, 2024

వంటింటి బడ్జెట్ మరింత భారం

- Advertisement -
- Advertisement -

GST applicability of milk, curd, buttermilk, rice

పాలు,పెరుగు, మజ్జిగ, బియ్యం , ఆటాలకు జిఎస్‌టి వర్తింపు
రూ.వెయ్యి లోపు హోటల్ గదులకూ పన్ను
నేటినుంచి కొత్త జిఎస్‌టి రేట్లు అమలు

న్యూఢిల్లీ: వంటగ్యాస్‌తో పాటుగా నిత్యావసరాల ధరలు పెరగడంతో సామాన్యుడి వంటింటి బడ్జెట్ ఇప్పటికే పెరిగిపోయింది. దీంతో వారి బతుకు బండి భారమైంది. కాగా సోమవారంనుంచి ఈ బడ్జెట్ మరింత భారం కానుంది. సోమవారంనుంచి పెరుగు ప్యాకెట్ కొనాలంటే మరింత చిల్లర జేబులో వేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఒక్క పెరుగే కాదు.. ప్యాక్ చేసి లేబుల్ వేసిన మజ్జిగ, పన్నీర్, లస్సీ వంటి పాల ఉత్పత్తుల ధరలు కూడా జిఎస్‌టి కారణంగా పెరగనున్నాయి. ఇక విహార యాత్రలు చేయాలనుకునే వారు, పుణ్య క్షేత్రాలను సందర్శించాలనుకునే వారు కూడా తమ బడ్జెట్‌లను సవరించుకోవలసి ఉంటుంది. ఇకపై వెయ్యి రూపాయల లోపు గది తీసుకున్నా 12 శాతం జిఎస్‌టి చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన జిఎస్‌టి మండలి(కౌన్సిల్)47వ సమావేశంలో తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాల ఫలితమిది. కొన్ని వస్తువులకు కొత్తగా రేట్లు వర్తింపజేయగా, మరి కొన్ని వస్తువులను వేరే శ్లాబ్ రేటులోకి మార్చారు. దీని ఫలితంగా వాటి ధరలు పెరగనున్నాయి. తాజాగా కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు సైతం ఈ రేట్లను నోటిఫై చేసింది. దీంతో జులై 18నుంచి ఈ రేట్లు అమలులోకి రానున్నాయి.అవేమిటంటే…

* ప్యాక్ చేసిన లేబుల్డ్ బియ్యం, గోధుమ పిండి,అప్పడాలు, పన్నీర్, పెరుగు, మజ్జిగ, లస్సీ, మాంసం (ఫ్రోజెన్ మినహాయించి), చేపలు, తేనె, ఎండు చిక్కుళ్లుమఖానా,గోధుమలు, బార్లీ, ఓట్స్‌పైనా ఇకపై 5 శాతం జిఎస్‌టి పడుతుంది. ఇప్పటివరకు వీటికి మినహాయింపు ఉండేది. అయితే పాక్ చేయని, లేబుల్ వేయని, అన్‌బ్రాండెడ్ వస్తువులకు మాత్రం జిఎస్‌టినుంచి మినహాయింపు ఉంది.

* రూ.1000 కన్నా తక్కువ విలువైన హోటల్ గదులపైనా ఇకపై 12 శాతం జిఎస్‌టి విధిస్తారు. ఇప్పటివరకు వెయ్యికన్నా ఎక్కువ ఖరీదు చేసే హోటల్ గదులపైనే జిఎస్‌టి వసూలు చేసే వారు. అలాగే ఆస్పత్రిలో రూ.5000కంటే ఎక్కువ ఖరీదు చేసే గది తీసుకుంటే ( ఐసియు మినహాయించి) ఐటిసి లేకుండా 5 శాతం జిఎస్‌టి పడుతుంది.

* ప్రింటింగ్, రైటింగ్, డ్రాయింగ్ ఇంక్‌లపై పన్ను 12 శాతంనుంచి 18శాతానికి పెంచారు. కత్తులు, కటింగ్ బ్లేడ్లు, పేపర్ కత్తులు, చివరికి పెన్సిల్ చెక్కే షార్ప్‌నర్లపైనా ఇకపై 18 శాతం పన్ను వర్తిస్తుంది. ఎల్‌ఇడి లైట్లు, ఫిక్సర్లు, వాటికి ఉపయోగించే మెటల్ ప్రింటెడ్ సర్కూట్ బోర్డులపై పన్నును 12 శాతంనుంచి 18 శాతానికి పెంచారు. సోలార్ వాటర్ హీటర్, సిస్టమ్‌పై 5 శాతంగా ఉన్న పన్నును 12 శాతానికి పెంచారు. టెట్రాప్యాక్‌పై 12 శాతంనుంచి 18 శాతానికి పెరిగింది. చెప్పులు, తోలు ఉత్పత్తుల తయారీ ఎంబ్రాయిడరీలపై పన్ను 5 శాతంనుంచి 12 శాతానికి పెరిగింది.

* రోడ్లు, వంతెనలు, రైల్వేలు, మెట్రో, శుద్ధి ప్లాంట్లు, శ్మశాన వాటికల కాంట్రాక్ట్ వర్క్‌లపై పన్నును 12 శాతంనుంచి 18 శాతానికి పెంచారు.

* చెక్కులు జారీ చేసినందుకు బ్యాంకులు వసూలు చేసే చార్జీపై 18 శాతం జిఎస్‌టి వర్తిస్తుంది. ఆర్‌బిఐ, ఐఆర్‌డిఎ,సెబి వంటి నియంత్రణ సంస్థల సేవలపైనా పన్ను విధిస్తారు. వ్యాపార సంస్థలకు ఇచ్చే నివాసాలకూ జిఎస్‌టి వర్తిస్తుంది.

* బ్యాటరీ ప్యాక్ అమర్చినా, లేకున్నాఎలక్ట్రానిక్ వాహనాలపై 5 శాతం జిఎస్‌టిని ఖరారు చేశారు. కట్, పాలిష్డ్ వజ్రాలపై పన్నును 0.25 శాతంనుంచి 1.5 శాతానికి పెంచారు.

కొన్నిటిపై తగ్గింపు

కాగా కొన్నింటిపై పన్ను తగ్గనుంది.ఆస్టమీ, కొన్ని ఆర్థోపెడిక్ పరికరాలపై పన్నును 12నుంచి 5 శాతానికి తగ్గించారు. ఇంధన ధరతో కలిపి అద్దెకు తీసుకునే ట్రక్కు, సరకు రవాణా వాహనాల అద్దెపై పన్నును కూడా 18 శాతంనుంచి 12 శాతానికి తగ్గించారు. రోప్‌వే ద్వారా ప్రయాణికులు, సరకుల చేరవేత సేవలపై పన్నును 18 శాతంనుంచి 12 శాతానికి పంపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News